వైసీపీలోకి మూర్తి కుటుంబం ?

నిజంగా రాజకీయాల్లో ఎపుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. విశాఖలో వ్యాపారం నిమిత్తం వచ్చిన దివంగత ఎంపీ, తెలుగుదేశం నాయకుడు ఎంవీవీఎస్ మూర్తి ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. [more]

Update: 2020-10-31 15:30 GMT

నిజంగా రాజకీయాల్లో ఎపుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. విశాఖలో వ్యాపారం నిమిత్తం వచ్చిన దివంగత ఎంపీ, తెలుగుదేశం నాయకుడు ఎంవీవీఎస్ మూర్తి ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన టీడీపీలోనే నాయకుడిగా పుట్టారు. ఆ పార్టీతోనే కడదాకా కొనసాగారు. ఇక ఆయన 2018లో మరణించాక ఆయన మనవడు శ్రీభరత్ టీడీపీలో కొనసాగి ఎంపీ గా కూడా విశాఖ నుంచి పోటీ చేసారు. అయితే మనవడు శ్రీభరత్ కి ఎంపీ టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు ఎంత ఇబ్బంది పెట్టాలో అంతా పెట్టాడని అంటారు. నిజానికి శ్రీభరత్ కూడా బాబుకు కొడుకు వరస అవుతారు. బావమరిది బాలకృష్ణ రెండవ కుమార్తె భర్త ఈయన.

విరక్తితోనే అలా ….

ఇక గత ఏడాది ఎన్నికల్లో కూడా పార్టీ శ్రేణులు సరిగ్గా సహకరించలేదని శ్రీభరత్ కి నాటి నుంచే ఆవేదన ఉంది. దానికి తోడు జనసేన తరఫున పోటీ చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణకు సొంత పార్టీలోనే కొంతమంది సహకరించారని కూడా మూర్తి వర్గం అప్పట్లో గుర్రుమంది. అనుకున్నంతా అయి శ్రీభరత్ ఓడిపోయారు. ఆ తరువాత నుంచి ఆయన ఎక్కువగా రాజకీయాల జోలికి పోవడం లేదు. తాను, గీతం విద్యాసంస్థలు అన్నట్లుగానే ఉన్నారు. ఇక ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు గీతం విద్యా సంస్థలకు మాయని మచ్చలా అక్రమ భూముల వ్యవహారం వేధిస్తోంది. పైగా వైసీపీ సర్కార్ కఠినంగా ఉంటోంది.

బాబుకు ప్రేమ లేదా…?

ఈ మాటలు అన్నది ఎవరో కాదు విశాఖకు చెందిన వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్. చంద్రబాబు ది ఎంతసేపూ రాజకీయమేనని. అందుకే ఆయన ఎవరికీ పట్టించుకోరని కూడా సెటైర్లు వేశారు. చంద్రబాబు ఇపుడు మూర్తి కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని గగ్గోలు పెడుతున్నారు కానీ నిజంగా ఆ ఫ్యామిలీ మీద ప్రేమ ఉంటే తాను అయిదేళ్ల పాటు సీఎంగా ఉన్న కాలంలో ఆ అక్రమ భూములను ఎందుకు క్రమబద్ధీకరించలేదని లాజిక్ పాయింట్ తీశారు మంత్రి గారు. అంటే చంద్రబాబు అలా వదిలేయడం వల్లనే తమ ప్రభుత్వం అక్రమ భూములను స్వాధీనం చేసుకునే చాన్స్ వచ్చిందని ఆయన చెబుతున్నారు అన్న మాట. ఇక ఎంవీవీఎస్ మూర్తి విషయం తీసుకుంటే ఆయన రాజ్యసభ కోరుకుంటే బాబు ఆయన్ని ఎమ్మెల్సీని మాత్రమే చేశారు. కనీసం మంత్రిని చేస్తారని ఎదురుచూసినా ఫలితం లేకపోయిందని నాడే ఆయన కుమిలారు అంటారు.

టికెట్ డౌటేనా….

ఇక మూర్తి మరణానంతరం శ్రీభరత్ రాజకీయం పూర్తిగా తల్లి తరఫున తండ్రి, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు సలహా సూచనలతోనే సాగుతోంది అంటారు. నిజానికి 2019 ఎన్నికల్లో టీడీపీ కనుక ఎంపీ టికెట్ ఇవ్వకపోతే నాడే శ్రీభరత్ వైసీపీలోకి వస్తాడని టాక్ అయితే వచ్చింది. కానీ చంద్రబాబు ఏమనుకున్నారో కానీ చివరాఖరున టికెట్ ఇచ్చారు. తన కుమారుడిని భీమిలీ నుంచి తప్పించి మంగళగిరికి షిఫ్ట్ చేసుకున్నారు. మొత్తానికి నాడు చాలా గందరగోళమే నడిచింది. ఇక 2024 ఎన్నికల నాటికి పల్లా శ్రీనివాస్ ని ఎంపీ అభ్యర్ధిగా నిలబెడదామని కూడా బాబుకు ప్లాన్ ఉన్నట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. అందుకే ఆయనకు విశాఖ పార్లమెంట్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారని కూడా అంటారు. బీసీ వర్గానికి చెందిన ఆయన‌తోనే విశాఖ సీటు కొట్టాలని బాబు ప్లాన్ అని చెబుతున్నారు.

ఫ్యాన్ నీడనేనా…?

ఈ పరిణామాల నేపధ్యం నుంచి చూసుకుంటే మాత్రం శ్రీ భరత్ వైసీపీలోకి వస్తారా అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. వైసీపీ కూడా తెలివిగానే ఆయన్ని టార్గెట్ చేసింది అంటున్నారు. విశాఖ జిల్లాలో పవర్ ఫుల్ లీడర్లు, కుటుంబాలు ఉంటే తమ వైపు ఉండాలని, లేకపోతే రాజకీయంగా దూరంగానైనా ఉండాలన్న ఎత్తుగడలతో వైసీపీ ఉందని అంటున్నారు. బలమైన సీఎం గా జగన్ ఉన్నారు. ఆయన తలచుకుంటే ఎవరి మీదనైనా దాడులు జరిగిపోతాయి. మరి ఇన్నాళ్ళూ వ్యాపారాలు, వ్యవహారాలు చేస్తూ సాఫీగా సాగుతున్న కొన్ని రాజకీయ జీవితాలు ఇపుడు విశాఖలో జరుగుతున్న పరిణామాలతో బెంబేలెత్తుతున్నాయట. మరి బిగ్ షాట్ గా ఉన్న మూర్తి కుటుంబం నుంచే మొదలుపెడితే అంతా దారికి వస్తారన్న వ్యూహంతోనే ఇదంతా చేశారని అంటున్నారు. చూడాలి మరి మూర్తి కుటుంబం వైసీపీలో వస్తే జగన్ రెండవ మాట లేకుండా కండువా కప్పుతారు. అపుడది చంద్రబాబు కే వణుకు పుట్టిస్తుంది. తన కుటుంబ సభ్యుడే పార్టీని వీడితే అంతకంటే బాబుకు భారీ దెబ్బ ఉండదు మరి.

Tags:    

Similar News