తోడల్లుడు తొడ కొడుతున్నాడుగా?

అదే నాయకుడికి కావాల్సింది. ఓడినా కూడా నిబ్బరం కోల్పోకూడదు. వయసు తక్కువ అయినా కూడా ఆ వివేచన, దూరదృష్టి నారా లోకేష్ తోడల్లుడు శ్రీ భరత్ లో [more]

Update: 2020-04-10 06:30 GMT

అదే నాయకుడికి కావాల్సింది. ఓడినా కూడా నిబ్బరం కోల్పోకూడదు. వయసు తక్కువ అయినా కూడా ఆ వివేచన, దూరదృష్టి నారా లోకేష్ తోడల్లుడు శ్రీ భరత్ లో ఎక్కువగానే ఉన్నాయి. ఆయన తన ఓటమినికి ముందుగానే ఊహించారని కూడా అనిపిస్తుంది. తనకు పోటీ వైసీపీ కాదని, జనసేన నుంచి విశాఖ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన జేడీ లక్ష్మీ నారాయణ అని శ్రీభరత్ ఆనాడే గ్రహించి ఆయన మీదనే అప్పట్లో ఫోకస్ పెట్టాడు. పైగా ఆ ఓట్లు అన్నీ కూడా టీడీపీ నుంచి చీలుతాయని కూడా విశ్లేషించుకున్న మీదట శ్రీభరత్ అప్రమత్తం అయ్యాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. చివరికి మూడు వేల స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలుకావాల్సివచ్చింది.

ఠంచనుగా…..

తన తాత ఎంవీవీస్ మూర్తి బాటలోనే శ్రీ భరత్ వ్యవహరిస్తున్నాడని చెప్పాలి. పని ఉంటే తప్ప లేకపోతే ఠంచనుగా ఆయన టీడీపీ ఆఫీసుకు వస్తారు. అంతే కాదు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. ఓడిన మరుసటి రోజు నుంచి ప్రతీ నియోజకవర్గం నేతలతో డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టుకున్నాడు. విశాఖలో నలుగురు ఎమ్మెల్యేలూ టీడీపీ వారే. దాంతో ఆయన వైసీపీకి పట్టున్న ప్రాంతాల మీదనే దృష్టి పెట్టి గత ఏడాదిగా అక్కడే పార్టీ కార్యకలాపాలు ఎక్కువగా చేపడుతున్నారు.

యూత్ వింగ్ తో….

ఇక ముప్పయ్యేళ్ళ శ్రీ భరత్ సీనియర్లతో మర్యాదగా ఉంటూనే జూనియర్లను ఎక్కువగా చేరదీస్తున్నారు. రేపటి రోజున పార్టీ వారితోనే ఆధారపడిఉందని ఆయన సరిగ్గానే అంచనా వేసి వారికే పార్టీ పదవులు దక్కేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక పార్టీ సమన్వయ కమిటీలో మెంబర్ గా ఉన్న శ్రీభరత్ విశాఖలో పార్టీ తిరిగి పుంజుకునేలా తన వంతు బాధ్యతను తీసుకున్నారు. పార్టీకి తాత మాదిరిగానే ఆర్ధిక అండ అందిస్తున్నారని అంటున్నారు.

మూడు జిల్లాలకూ…..

ఇక గతంలో ఎంవీవీస్ మూర్తి ఉత్తరాంధ్ర మొత్తం పార్టీ బాధ్యతలు చూసేవారు. వారికి ఏ ఇబ్బంది వచ్చినా చంద్రబాబు దాకా కాకుండా తానే స్వయంగా పరిష్కరించేవారు. ఇపుడు శ్రీభరత్ కూడా అదే విధానం అనుసరిస్తున్నారు. ఆర్ధికంగా కూడా భరోసా ఇస్తూ మూడు జిల్లాల్లో పార్టీ పటిష్టం అయ్యేలా చూస్తున్నారు. చంద్రబాబు సైతం శ్రీ భరత్ కే ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు అప్పగించారు. మరో వైపు వైసీపీ సర్కార్ మీద కేవలం విమర్శలు చేయడమే పనిగా కాకుండా క్షేత్ర స్థాయిలో ప్రజలంతో మమేకం కావడానికే శ్రీ భరత్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఊరికే విమర్శలు చేయడం కన్నా జనంతో ఉంటే వారే తేడా తెలుసుకుంటారని, సరైన టైం లో ఆదరిస్తారని కూడా శ్రీభరత్ నమ్ముతున్నారు.

భవిష్యత్తు నేతగా…..

మొత్తానికి ఓడిన తరువాతనే శ్రీ భరత్ రొటేన్ రాజకీయం గేర్ మార్చి దూసుకుపోతున్నారని తమ్ముళ్ళే అంటున్నారు. శ్రీభరత్ కు ఉన్న మరో అదృష్టం తాత లెగసీ. చంద్రబాబుతో బంధుత్వం అన్నింటికీ మించి యువ నాయకుడు కావడంతో సమీప భవిష్యత్తులో విశాఖలో అతి ముఖ్య నేత అవుతారని తలపండిన సీనియర్లు చెబుతున్నారంటే నమ్మాల్సిందేనేమో.

Tags:    

Similar News