మళ్లీ మొదలు పెట్టారు…?

పాడిందే పాడరా .. పాలిటిక్స్ నాయకా.. అన్నట్లుంది ఆంధ్రపదేశ్ రాజకీయం. అధికారం అటుఇటు మారుతోంది. నాయకులు అటు,ఇటు కుప్పిగంతులు వేస్తున్నారు. కానీ అవే శపథాలు, అవే వ్యూహాలు, [more]

Update: 2021-04-13 06:30 GMT

పాడిందే పాడరా .. పాలిటిక్స్ నాయకా.. అన్నట్లుంది ఆంధ్రపదేశ్ రాజకీయం. అధికారం అటుఇటు మారుతోంది. నాయకులు అటు,ఇటు కుప్పిగంతులు వేస్తున్నారు. కానీ అవే శపథాలు, అవే వ్యూహాలు, అవే ఎత్తుగడలు. అవే సవాళ్లు. ప్రజలకు బోరు కొడుతోంది. నాయకుల తీరు మారడం లేదు. సీరియస్ గా చర్చించుకోవాల్సిన పాలిటిక్స్ ప్రజల దృష్టిలో చిల్లర రాజకీయాలను తలపిస్తున్నాయి. తిరుపతి ఎన్నికల పుణ్యమా? అని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మరోసారి నాయకుల నోళ్లపై నానుతోంది. మీ వాళ్లంతా రాజీనామాలు చేయండి. మా వాళ్లు రాజీనామాలు చేస్తారంటూ చంద్రబాబు సవాల్ విసిరారు. తిరుపతిని నెగ్గి చూపించండి. మేము కూడా రాజీనామాలకు తయారే అంటూ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతి సవాల్ విసిరారు. ఆయన కేవలం మంత్రి మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడికి సమకాలికుడు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో స్టూడెంట్ పాలిటిక్స్ కాలం నుంచి వీరిద్దరూ ప్రత్యర్థులే. అయితే చంద్రబాబు వ్యూహకర్తగా ఎవరినో ఒకరిని గెలిపించడానికి ప్రయత్నించేవారు. తెర వెనక చక్రం తిప్పేవారు. పెద్దిరెడ్డి నేరుగా పోటీలో తలపడేవారు. అంతే తేడా. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాదని, తెచ్చుకునే సత్తా తమకు లేదని ఇద్దరికీ తెలుసు. అయినా ప్లేయింగ్ టు ద గ్యాలరీ అన్నట్లుగా ప్రజల కోసం ఇలా సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటుంటారు.

సేమ్ సీన్.. రివర్స్ రోల్..

2019 ఎన్నికలకు ఏడాది ముందు ప్రత్యేక హోదా అంశం పెద్ద రచ్చగా మారింది. టీడీపీ ఎంపీలను రాజీనామా చేయమంటూ సవాల్ విసిరింది వైసీపీ. తాము రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించింది. చాలా తెలివిగా పావులు కదుపుతూ రాజీనామాలు ఇచ్చేసి, ఉప ఎన్నికలు రాకుండా చూసుకోగలిగింది. వైసీపీ ట్రాప్ లో పడి టీడీపీ తీవ్రంగా నష్టపోయింది. ప్రధాని మోడీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. కాంగ్రెసు పార్టీని అక్కున చేర్చుకుంది. ఇవన్నీ రాజకీయంగా చంద్రబాబుకు చాలా నష్టం చేకూర్చాయి. కాంగ్రెసు వ్యతిరేకతపై ఏర్పడిన టీడీపీ మూల సిద్ధాంతాన్ని వమ్ము చేశారు. చంద్రబాబు క్రెడిబిలిటీ ప్రశ్నార్థకం అయింది. ఎన్నికలలోనూ వైసీపీ ప్రత్యేక హోదాను ఒక అంశంగా చేస్తూ ప్రచారం చేసుకుంది. ప్రత్యేక హోదా కోసమే తాము బయటకి వచ్చేశామంటూ చెప్పుకోవడానికి టీడీపీ ప్రయత్నించింది. ఏదేమైనా ప్రజలు తమకు నచ్చిన వాళ్లకే పట్టం గట్టారు. చంద్రబాబు పాలనను తోసి పుచ్చారు. కేంద్రంపై అవిశ్వాస అస్త్రం పని చేయలేదు. కాంగ్రెసు అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెచ్చుకునేందుకే రాహుల్ తో చంద్రబాబు చేతులు కలిపారన్న ప్రచారమూ ఫలించలేదు. మళ్లీ ఇప్పుడు వైసీపీని ట్రాప్ లోకి లాగడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. ప్రత్యేక హోదా రాజీనామాల డిమాండ్ ముందుకు తెస్తోంది. తమకు పోయేదేం లేదు. ఇబ్బంది పడితే అధికారపార్టీయే అన్నది చంద్రబాబు ఆలోచన. కానీ ఇంకా మూడేళ్ల పైచిలుకు కాలవ్యవధి ఉండగా వైసీపీ తెలివి తక్కువ నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ ఆశించరు.

పొలిటికల్ కామెడీ డ్రామా…

నెరవేరని అంశాలతో , ప్రజల్లో ఏ మాత్రం విశ్వాసం లేని ప్రాతిపదికలు పెట్టుకుని నాయకులు హాస్యాన్ని పండిస్తున్నారు. పనితీరు ప్రాతిపదికగా రాజకీయాలు నడపటం లేదు. వాస్తవిక కార్యాచరణ ఆంధ్రప్రదేశ్ నాయకత్వంలో లోపించింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెంటికీ దూరదృష్టి లోపించింది. తానే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు శరణ్యంగా ప్రజలు భావించాలనే అత్యాశలో చంద్రబాబు దెబ్బతిన్నారు. ప్రతిపక్ష నాయకత్వాన్ని నాశనం చేయాలని వేసిన ఎత్తుగడలు వికటించాయి . ప్రత్యామ్నాయంగా పవర్ లోకి వచ్చిన పార్టీ వైసీపీ సైతం దార్శనికతతో వ్యవహరించడం లేదు. పప్పు బెల్లాలను తలపించే సంక్షేమ పథకాలతో కాలక్షేపం చేస్తోంది. మరోవైపు ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీతో జత కట్టి పవన్ కల్యాణ్ సొంత నిర్ణయాధికారాన్ని కోల్పోయారు. మొత్తమ్మీద నాయకుల రాజకీయ నాటకం ఏపీ భవిష్యత్తును అంధకార బంధురం చేస్తోంది. ఎన్నికల వంటి సందర్బాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్లు సరదా పంచే వినోదం మాత్రమే. ఢిల్లీ స్థాయిలో వీరెవరూ రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా పనిచేయడం లేదు.కేంద్రం వద్ద పట్టుబట్టడం లేదు. డబుల్ స్టేట్ మెంట్లతో నాయకులు ప్రజలకు సినిమా చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి తిరుపతిలో పర్యటిస్తే ఒక తరహా స్టేట్ మెంటు. మానుకుంటే మరో తరహా ప్రకటన. ప్రతిపక్షాలు బలపడ్డాయని అందుకే వైసీపీకి మద్దతుగా సీఎం రంగంలోకి దిగక తప్పడం లేదనే వాదన తెచ్చింది ప్రతిపక్షం. తీరా ఆయన పర్యటన రద్దు చేసుకుంటే తమ బలాన్ని చూసి భయపడి వాయిదా వేసుకున్నారంటున్నారు. ఇటువంటి ద్వంద్వ ప్రకటనల వల్ల విపక్షాల పట్ల ప్రజలకు గౌరవం పోతుందని నేతలు భావించకపోవడమే విచిత్రం.

ప్జజలు పట్టించుకోవట్టే…

యథా రాజా తధా ప్రజ అనేందుకు సరిగ్గా సరిపోతోంది ఏపీ ప్రజల ఆలోచన. నాయకుల తరహాలోనే ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. సమైక్యాంద్ర ఉద్యమం నుంచీ ఇదే తంతు. రాజకీయ పార్టీలు ప్రజలను రెచ్చగొట్టి ఉద్యమాలకు పురిగొల్పుతుంటాయి. అందులో పాల్గొన్న వారికి నాయకుల అండదండలుంటాయి. అంతలోనే చప్పున చల్లారిపోతుంటాయి. నిజంగా ప్రజల బావోద్వేగాలతో ముడిపడి ఉంటే ఏ ఆందోళన అయినా దీర్ఘకాలం కొనసాగుతుంది. తీవ్రత పెరుగుతుంది. కానీ పొలిటికల్ పార్టీలు ఉసి గొలిపితే సాగే ఉద్యమాలు క్రమేపీ చల్లబడిపోతుంటాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ లో ఏరకమైన ఉద్యమమూ సక్సెస్ కాదు. పార్టీల రాజకీయాల ప్రాబల్యం, నాయకుల వ్యక్తిగత ప్రయోజనాల కోణంలోనే ఆందోళనలు ఊపిరి పోసుకుంటున్నాయి. వాటిని కొనసాగించడం సాధ్యం కావడం లేదు. పాత చింతకాయ డిమాండ్లను పక్కనపెట్టి ఆల్లర్నేటివ్ అజెండాను ప్రజల ముందు పెట్టాలి. అప్పుడే కొత్త ఆలోచనలతో కూడిన నాయకత్వాన్ని ఆదరించేందుకు అవకాశం పెరుగుతుంది. లేకపోతే ఏ రాయి అయినా ఒకటే అన్నచందంగా ప్రజలు మారిపోతున్నారు. స్వచ్ఛంద ఓటింగ్ పట్ల నిరాసక్తత పెరుగుతొంది. తమ వాటా తమకు ఏదో రూపంలో ఇచ్చేయమని కోరుకుంటున్నారు. సంక్షేమ పథకాలపై అందుకే మక్కువ పెరుగుతుంది. సామాజిక ప్రయోజనాలు చిన్నవై పోతున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News