ప్రత్యేక హోదా… మళ్ళీ మోగుతుందా…?

ఎప్పటి ప్రత్యేక హోదా. మరెప్పటిది దాని బాధ. ఏపీ జనాలకే సోయి లేకుండా పోయే. ఇక ఆ విభజన హక్కు కూడా కాలగర్భంలో కలసిపోయింది. అది ముగిసిన [more]

Update: 2021-01-30 09:30 GMT

ఎప్పటి ప్రత్యేక హోదా. మరెప్పటిది దాని బాధ. ఏపీ జనాలకే సోయి లేకుండా పోయే. ఇక ఆ విభజన హక్కు కూడా కాలగర్భంలో కలసిపోయింది. అది ముగిసిన అధ్యాయం అని ఒకటికి పదిసార్లు కాషాయం పార్టీ పెద్దలు చెప్పేశాక దాన్ని ముట్టుకుంటే ఏ పార్టీకైనా కూడా కరెంట్ షాకే తగులుతుంది మరి. ఇక ఏపీలో ఒకసారి బీజేపీ, టీడీపీకి, మరో సారి జగన్ కి ఎన్నికల ఆయుధంగా పనికివచ్చి పవర్ ని ఇచ్చిన ప్రత్యేక హోదా ను ఇపుడు మళ్లీ వాడుకోవాలని ఎవరు చూసినా ఫలితం శూన్యమేనా అన్న చర్చ కూడా ఉంది.

కోరి మరీనా…?

అయితే ప్రత్యేక హోదా మీద భ్రమలు ఎవరికీ లేకపోయినప్పటికీ దాన్ని రివర్స్ చేసి వాడుకోవడానికి మాత్రం ఏపీ సీఎం జగన్ తన వంతు ప్రయత్నాలు చేస్తారని తెలుస్తోంది. అందుకే ఆయన కోరి మరీ అమిత్ షా కు అందించిన అనేకానేక విన్నపాల్లో దీన్ని కూడా ఒక కచ్చితమైన వ్యూహంతోనే చేర్చారు అంటున్నారు. ప్రత్యేక హోదా అంటే బీజేపీకే ఆ బాణం నేరుగా తగులుతుంది. కక్కలేక మింగలేక అన్నట్లుగా సీన్ ఉంటుంది. కనీసం సంజాయిషీ అయినా చెప్పుకునే ఇరకాటం ఆ పార్టీది అవుతుంది. ఇక టీడీపీ హోదాను ముంచేసిన పార్టీగా ఉంటే, పాచిపోయిన లడ్డూలతో ప్యాకేజీని పోల్చిన పవన్ కోరి వెళ్ళి మరీ బీజేపీతో జత కట్టడంతో హోదా సూటిపోట్లు ఆయనకూ బాగానే తగులుతాయి.

జగన్ కేమీ లేదా…?

సరే ఇంతమందిని ఇబ్బంది పెట్టిన ప్రత్యేక హోదా సమస్య జగన్ కి రాజకీయంగా మేలు చేస్తుందా అంటే ఆయనకు 2019 ఎన్నికల్లో గరిష్టంగా 22 మంది ఎంపీలని ఇచ్చింది. కేవలం జగన్ని విశ్వసించి మాత్రమే ఆంద్రా ఓటర్లు ఆయనకు ఓటేశారు. ప్రత్యేక హోదా తెచ్చే సత్తా జగన్ కి ఉందని వారు నిండారా నమ్మారు. కానీ ఇరవై నెలల పాలన పూర్తి అయినా కూడ జగన్ మాత్రం హోదా ఊసుని అపుడపుడు వినతిపత్రాల ద్వారానే తలుస్తున్నారు తప్ప సీరియస్ గా దాని మీద ఏ పోరాటం చేయడంలేదు అన్నది జనాలు గుర్తించారు. అందువల్ల ప్రత్యేక హోదా గురించి ఎక్కువగా మాట్లాడితే అందరితో పాటు జగన్ కి కూడా అది ముప్పతిప్పలు పెట్టే అస్త్రమే అవుతుంది.

సౌండ్ తగ్గించాలనే…?

అందుకే జగన్ ఎక్కడా బహిరంగ సభల్లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు, కనీసం ప్రభుత్వ వేదికల మీద కూడా ఆ ప్రస్థావన తేకుండా చాలా జాగ్రత్త పడతారు. కానీ ఇలా అపుడపుడు అది కూడా ఏపీ బీజేపీ కాస్తా నోరు పెద్దది చేస్తున్న సందర్భాల్లో మాత్రమే ఢిల్లీ పెద్దలకు వినతిపత్రాల రూపంలో ప్రత్యేక హోదా గురించి ముందుకు తెస్తారు. అంటే దానర్ధం బీజేపీ కి పక్క బెదురు పుట్టించాలనే. పైగా బీజేపీ సౌండ్ ని తగ్గించాలన్న వ్యూహం లో భాగంగానే జగన్ ఇలా చేస్తున్నారు అనుకోవాలి. అందుకే తిరుపతి ఎన్నికల్లో కూడా ప్రత్యేక హోదా ఒక ఇష్యూ కాదు అని అంతా అంటున్నారు. నిజానికి ఏపీ జనాలు తాము విభజన తోనే అతి పెద్ద మోసానికి గురి అయ్యామని భావిస్తున్నారు. దానితో పోలిస్తే ఇది చాలా చిన్న విషయంగానే చూస్తున్నారు. అందువల్ల బీజేపీ చెప్పినా చెప్పకపోయినా ప్రత్యేక హోదా అన్నది ఇక ముగిసిన అధ్యాయమే.

Tags:    

Similar News