ప్రత్యేకంగా చేసిన ప్రయత్నమేదీ?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ముందు అతి పెద్ద సవాల్ ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడాదిలోనే అన్ని సంక్షేమ పథకాలను గ్రౌండ్ చేసే పనిలో పడ్డారు జగన్. [more]

Update: 2020-07-30 02:00 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ముందు అతి పెద్ద సవాల్ ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడాదిలోనే అన్ని సంక్షేమ పథకాలను గ్రౌండ్ చేసే పనిలో పడ్డారు జగన్. అభివృద్ధిని పక్కన పెట్టి మరీ సంక్షేమ పథకాలకే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు, ఎన్నికల మ్యానిఫేస్టోలో పేర్కొన్న అంశాలను కూడా వరసగా అమలు చేస్తూ వస్తున్నారు. అయితే ఒక్క విష‍యంలో మాత్రం ఆయనకు వచ్చే ఎన్నికల ప్రచారంలో ప్రజలకు వివరణ ఇచ్చుకోక తప్పదు.

ఎన్నికల ముందు వరకూ…..

జగన్ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఎన్నో సార్లు దీక్షలు చేశారు. యువభేరిలు నిర్వహించారు. ప్రత్యేక హోదా వల్లనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందని జగన్ పదే పదే తన ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అంతేకాదు తనకు 25 ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తెస్తానని ఏపీ ప్రజలకు మాట ఇచ్చారు. జగన్ కోరినట్లుగానే ఆయన పార్టీకి 22 మంది ఎంపీలను ఏపీ ప్రజలు ఇచ్చారు.

ఏడాది కాలంలో…..

అయితే ప్రత్యేక హోదా మీద గత ఏడాది కాలంలో జగన్ చేసింది.. సాధించింది శూన్యమనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ పూర్తి స్థాయి మెజారిటీ ఉండటంతో జగన్ ఏమీ చేయలేకపోతున్నది మాట వాస్తవం. అదే సమయంలో అనేక అంశాలలో జగన్ కు ప్రత్యక్షంగా మద్దతు ఇస్తూ వస్తున్నారు. అనేక కీలక బిల్లుల విషయంలో బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచారు. కేంద్రం మాత్రం ప్రత్యేక హోదాను పక్కన పెట్టేసింది. ఇవ్వమని తేల్చి చెప్పేసింది.

వచ్చే ఎన్నికల నాటికి…..

గత ఏడాది నుంచి ప్రత్యేక హోదా కోసం జగన్ ప్రత్యేకంగా ప్రయత్నించింది కూడా ఏమీ లేదనే చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోదీని కలసినప్పుడు వినతిపత్రంలో ఒక అంశంగానే ప్రత్యేక హోదా ఉంది తప్పించి కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే ప్రయత్నం ఏదీ లేదనే చెప్పాలి. ఇదే సమయంలో ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేసినా ప్రత్యేక హోదా మాత్రం వచ్చే ఎన్నికల నాటికి జగన్ కు క్వశ్చన్ మార్క్ గానే మిగలనుంది. మరి జగన్ ప్రజలకు ఏ విధంగా ప్రత్యేక హోదాపై వివరణ ఇచ్చుకుంటారో చూడాలి.

Tags:    

Similar News