రాజకీయ అస్త్రం దొరికినట్లేనా?

ఏ ముహూర్తాన ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాటి యూపీఏ సర్కార్ ప్రకటించిందో కానీ హోదా ఇవ్వకుండా బాధను మాత్రం కేంద్ర పాలకులు మిగిల్చారు. అడ్డగోలు విభజనపై [more]

Update: 2019-12-05 06:30 GMT

ఏ ముహూర్తాన ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాటి యూపీఏ సర్కార్ ప్రకటించిందో కానీ హోదా ఇవ్వకుండా బాధను మాత్రం కేంద్ర పాలకులు మిగిల్చారు. అడ్డగోలు విభజనపై ఆగ్రహంగా ఉన్న అనాటి పదమూడు జిల్లాల ఏపీని శాంతపరచేందుకు ప్రత్యేక హోదాను తాయిలంగా ముందుంచారని కూడా అంటారు. ఓ రాజకీయ ఆయుధంగా యూపీయే సర్కారే ప్రత్యేక హోదాను మార్చేశాక దాన్ని అందిపుచ్చుకోవడంలో బీజేపీ కంటే ఘనాపాటి ఎవరు ఉంటారు. ఆ విధంగా ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా వాడేసుకున్నాక గద్దెనెక్కి అధికారం పట్టేశాక తాపీగా హోదా ఇవ్వడం సాధ్యపడదని కాషాయం పెద్దలు చెప్పేస‌రికి ఏపీ ప్రజల ఆగ్రహం నసాలానికి అంటింది. ఎందుకంటే ప్రజల సెంటిమెంట్ హోదాగా మారింది కాబట్టి. అయితే మొదట్లోనే హోదా మీద అంతా కలసి గట్టిగా తగులుకుంటే ఫలితం ఉండేదేమో కానీ నాడు పొత్తులతో అక్కడా ఇక్కడా అధికారం పంచుకున్న టీడీపీ, బీజేపీలు ఈ విషయంలో కిమ్మనలేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్యాకేజి ఇచ్చినా సరేనన్నారు. అలా హోదాకు శాశ్వతంగా పాతర వేశారు.

పదునైన బాణంగా…

ఇక ఏపీలో టీడీపీ వదిలేసిన హోదా విపక్ష వైసీపీకి పదునైన ఆయుధంగా మారింది. ఊరూ వాడా ప్రత్యేక హోదా నినాదాన్ని వినిపిస్తూ జగన్ చేయాల్సిందంతా చేశారు. చివరికి దాని కారణంగానే బీజేపీ కూటమి నుంచి టీడీపీ విడిపోవాల్సివచ్చింది కూడా. టీడీపీ అయిదవ ఏడాది ధర్మ పోరాటాలు చేస్తూ హోదా ఎందుకు ఇవ్వరని మోడీని ప్రశ్నించినా కధ అప్పటికే కంచికి చేరిపోయింది. మరో వైపు ఏపీలో బలమైన పార్టీలుగా ఉన్న టీడీపీ, వైసీపీ ప్రత్యేక హోదా విషయంలో కలవకపోవడం, ఉద్యమాలు సైతం అనైక్యతతో సాగడం కమలనాధులకు కలసివచ్చింది. దాంతో కేంద్రంపై ఎవరూ వత్తిడి పెట్టకపోయారు. మరో వైపు బీజేపీ హోదా ఇవ్వను కాక ఇవ్వను అనడం, టీడీపీ అవకాశవాద ఆందోళన నేపధ్యంలో హోదా కోసం రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలకు పొలిటికల్ మైలేజ్ బాగానే దక్కింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో జగన్ అధికారంలోకి రావడం కూడా జరిగింది.

జగన్ రూట్లోనే….

ముల్లుని ముల్లుతోనే తీయాలన్న సామెత చందంగా ఇపుడు జగన్ రూట్లోనే పవన్ పయనిస్తున్నారు. బాబుని జగన్ ప్రశ్నించినట్లుగానే జగన్ని పవన్ నిలదీస్తున్నారు. రాయలసీమ పర్యటనలో భాగంగా ఆయన ప్రత్యేక హోదా ఎందుకు అడగరూ అంటూ జగన్ మీద గట్టిగానే విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా తెస్తామంటూ పాతిక మంది ఎంపీలను అడిగితే 22 మంది ఎంపీలను ప్రజలు ఇచ్చారు కదా. ఆ బలం చాలదా అంటూ జగన్ ని డైరెక్ట్ గానే అటాక్ చేస్తున్నారు. ప్రధాని మోడీని హోదా గురించి అడిగే ధైర్యం లేదా అని కూడా నిగ్గదీస్తున్నారు. నిజానికి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని అందరికీ తెలుసు. అయితే ఇదే హోదా పేరు చెప్పి 2014 ఎన్నికల్లో బీజేపీ టీడీపీ లాభపడ్డాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ బంపర్ విక్టరీ కొట్టింది. ఇపుడు హోదాను పట్టుకుంటే తమకూ రాజకీయ హోదా వస్తుందన్న ఆలోచనతోనే జనసేనాని సరైన ఆయుధాన్నే సంధిస్తున్నారని రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి.

కార్నర్ అవుతారా…?

జగన్ హోదా అడిగినా కేంద్రం ఇవ్వదు, అది అందరికీ తెలుసు. హోదా అన్నది 2015 లోనే సమాధి అయిపోయింది. ఇక ఇపుడు జగన్ గట్టిగా ప్రత్యేక హోదా అంటే అసలుకే ఎసరు బీజేపీ పెడుతుంది, దాంతో అరకొర సాయం కూడా ఆగిపోతుంది, కేంద్రంలో విభేదాలు కూడా వస్తాయి. ఇదే ఇపుడు విపక్షాలకు కావాల్సింది. టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకటరావు ప్రత్యేక హోదా గురించి జగన్ కి లేఖ రాసినా, పవన్ దాని మీద జగన్ని గట్టిగా నిలదీసినా ఒక్కటే టార్గెట్. అదే పొలిటికల్ టార్గెట్. అంతే.

Tags:    

Similar News