స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్…దీనికో ప్రత్యేకత ఉంది…. తెలుసా?

భారత సైన్యంలో అనేక విభాగాలు ఉన్నాయి. సిఖ్ రేంజిమెంట్, గూర్ఖా రేంజి మెంట్ వంటి విభాగాల గురించి అందరికీ తెలిసిందే. ఈ విభాగాల్లో ఎక్కువగా ఆయా ప్రాంతాల [more]

Update: 2020-09-19 16:30 GMT

భారత సైన్యంలో అనేక విభాగాలు ఉన్నాయి. సిఖ్ రేంజిమెంట్, గూర్ఖా రేంజి మెంట్ వంటి విభాగాల గురించి అందరికీ తెలిసిందే. ఈ విభాగాల్లో ఎక్కువగా ఆయా ప్రాంతాల వారు పని చేస్తుంటారు. ఒక్కో విభాగం ఒక్కో నైపుణ్యం కలిగి ఉంటుంది. అలాంటి వాటిల్లో స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) ఒకటి. దీని గురించి చాలా మందికి తెలియదు. సైనిక సంబంధమైన వ్యక్తులకు తప్ప మరొకరికి దీని గురించి తెలియదు. అసలు ఇలాంటి ప్రత్యేక విభాగం ఉన్న సంగతి చాలా మందికి తెలియనే తెలియదు. జూన్ లో చైనాతో జరిగినఘర్షణల కారణంగా యుద్ధానికి సంబంధించిన అనేక విషయాలు తెలిసివచ్చాయి. తాజాగా వెలుగులోకి వచ్చింది స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్. దాని శక్తియుక్తులు, బలం, తెగువ, పోరాట పటిమ , పట్టుదల చూసిన తరవాత ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. తమకూ ఇలాంటి దళం ఉండాలని ఏ దేశమైనా కోరుకుంటుంది.

బిజూ పట్నాయక్ సలహాతో……

తాజాగా చైనాతో ఘర్షణల సమయంలో ఫ్రాంటియర్ ఫోర్స్ నిర్వహించిన పాత్ర చూసిన తరవాత యావత్ దేశం వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. వారి తెగువ, సాహసం గురించి విన్నాక ప్రతి పౌరుడూ జేజేలు పలుకుతున్నాడు. ఈ నేపథ్యంలో ఫ్రాంటియర్ ఫోర్స్ గురించి తెలుసుకోవాలని అమితాసక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేకంగా చైనాతో పోరాడటానికి దీనికి రూపకల్పన చేశారు. 1962లో చైనాతో యుద్ధంలో పరాజయం తరవాత పోరాట విద్యలో ఆరితేరిన ఒక ప్రత్యేకదళం ఆవశ్యకతను నాటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గుర్తించారు. నాటి ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ( ఐబీ), ఒకప్పుడు భారత వైమానిక దళంలో పనిచేసిన బిజూపట్నాయక్ సలహా మేరకు వెంటనే మెరికల్లాంటి సైనికులతో అదే ఏడాది దీనిని ఏర్పాటు చేశారు. బిజూపట్నాయక్ తరవాత రోజుల్లో రాజకీయ రంగ ప్రవేం చేశారు. ఒడిశా సీఎం అయ్యారు. తరవాత కాంగ్రెస్ తో విభేదించారు. జనతా పార్టీకి చేరువయ్యారు. అనంతరం సొంతంగా బిజూ జనతాదళ్ పార్టీని స్థాపించారు. ఆయన కుమారుడు నవీన్ పట్నాయక్ ప్రస్తుతం మఖ్యమంత్రిగా పని చేస్తున్నారు.

టిబెట్ శరణార్థులనే…..

టిబెట్ శరణార్థులను స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ లో నియమించారు. ఇందుకు ఓ ప్రత్యేక కారణం ఉంది. టిబెట్ ను చైనా ఆక్రమించుకున్నాక వారిలో ఆ దేశంపై కోపం, కసి పెరిగింది. అదే సమయంలో తమకు ఆశ్రయం కల్పించిన భారత్ అంటే వారిలో గౌరవం, భక్తిబావం కలిగింది. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో బౌద్ధమత గురువు దలైలమా నాయకత్వంలో ప్రవాస టిబెట్ ప్రభుత్వం పనిచేస్తోంది.టిబెట్ చైనా పరిధిలోని ప్రాంతం కాదని అదో ప్రత్యేక దేశమని టిబెటన్లు భావిస్తుంటారు. దీంతో సమయం వచ్చినప్పుడు బీజింగ్ కు తగిన గుణపాఠం చెప్పాలన్నది వారి కోరిక. ఈ ఉద్దేశాన్ని గమనించిన భారత ప్రభుత్వం ఫ్రాంటియర్ ఫోర్స్ లోకి వారినే తీసుకుంది. ఉమ్మడి ఉత్తర్ ప్రదేశ్ లోని చకరాత లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఆ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ కు వంద కిలోమీటర్ల దూరంలో చకరాత ఉంది. దీని కార్యకలాపాలను నేరుగా ప్రధాని పర్యవేక్షిస్తారు. సైన్యానికి కూడా దీని గురించి తెలియదు. నిఘా సంస్థ ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ – ఆర్ ఏ డబ్యూ) ఆధ్వర్యంలో పని చేస్తుంది. కల్నల్ రణబీర్ సింగ్ దీనికి ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాల నుంచి ఈ దళం యుద్ధవిద్యల్లో శిక్షణ తీసుకుని ఆరితేరింది. కొండలు, పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయడం దీని ప్రత్యేకత. ప్రతికూల పరిస్థితుల్లోనూ ముందుకు సాగడంలో దీనికి ఎవరూ సాటిరారు. గెరిల్లా యుద్ధం చేయడం దీని ప్రత్యేకత. రాకెట్ లాంచర్లు, గ్రెనెడ్ లాంచర్లు, అడ్వాన్స్డ్ ఆడియో కమ్యూనికేషన్, థర్మల్ ఇమేజింగ్ కెమేరా, స్పెషల్ టాక్టికల్ గేర్స్ వంటి అధునాతన ఆయుధాలుఫ్రాంటియర్ ఫోర్స్ వద్ద ఉన్నాయి.

అనేక సమయాల్లో……

సిక్కులకు పవిత్రమైన స్వర్ణ దేవాలయంలో 1984లో జరిగిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ లో ఈ దళం కీలక పాత్ర పోషించింది. తమకు ప్రత్యే దేశం కావాలన్న పంజాబ్ ఖలిస్థాన్ వేర్పాటువాదులను ఏరివేసేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వర్ణ దేవాయంలో తలదాచుకున్న సిక్కు ఉగ్రవాదులను ఏరివేయడంలో ఈ దళం కీలకపాత్ర పోషించింది. 1971లో బంగ్లాదేశ్ యుద్ధ సమయంలోనూ ఫ్రాంటియర్ ఫోర్స్ పాత్రను జాతి కొనియాడింది. 1999లో పాకిస్థాన్ తో జరిగిన కార్గిల్ యుద్ధంలోనూ నిరుపమానమైన సేవలు అందించింది. తాజాగా చైనాతో జరిగిన ఘర్షణల్లో ఫ్రాంటియర్ ఫోర్స్ ప్రశంసనీయ పాత్ర పోషించింది. ముఖ్యంగా గల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు ను కాపాడటంలో కీలకంగా వ్యవహరించింది. చిరకాల శత్రువైన చైనాను నిలువరించడం లో తనకు సాటిలేదని నిరూపించుకుంది. జాతి తనమీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంది. భారత కీర్తి ప్రతిష్టలను దశదిశలా వ్యాపింపచేసింది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News