సోనియాతో స్వింగ్ అవుతుందా...???

Update: 2018-11-24 15:30 GMT

కష్టాలలో కూరుకున్న కాంగ్రెసు పార్టీని కాసింత గట్టెక్కించడానికి హైదరాబాదు వచ్చిన సోనియా భావోద్వేగాలను పండించడానికి ప్రయత్నించారు. తెలంగాణకు అమ్మ అంటూ పార్టీ శ్రేణులు చెబుతూ వచ్చిన విషయాన్ని అందిపుచ్చుకుని కొంత సెంటిమెంటును రంగరించారు. అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఆరోగ్య కారణాల రీత్యా ఎక్కడికీ వెళ్లని సోనియా తెలంగాణకు రావడం విశేషమనే చెప్పాలి. రాష్ట్ర అవతరణ తర్వాత తొలి ఎన్నికలలో ఘనవిజయం సాధిస్తామని పార్టీ శ్రేణులు నమ్మబలికాయి. కానీ అంచనా తప్పింది. ఆ తర్వాత పార్టీ క్రమేపీ బలహీనపడుతూ వచ్చింది. ఒకానొక దశలో తిరిగి పట్టాలపైకి ఎక్కడం కష్టమని పార్టీ వర్గాలే చెప్పే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యం నుంచి క్రమేపీ మిగిలిన అన్ని శక్తులను కలుపుకుంటూ తాజాగా ప్రజాకూటమి కట్టింది. బలోపేతంగా కనిపిస్తున్న టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు సంసిద్ధమైంది. టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐ కలుస్తాయని తెలిసిన తర్వాత ఈ కూటమికి కొంత నైతికస్థైర్యం చిక్కింది. కాంగ్రెసులోనూ కొత్త ఉత్సాహం తొంగి చూసింది. ఈ పరిస్థితులను మరింతగా దృఢ పరచుకోవాలనే ఉద్దేశంతోనే సోనియాను రంగంలోకి దింపారు. ఆరోగ్యం పూర్తిగా సహకరించకపోయినా పార్టీ విజ్ణప్తిని ఆమె తోసిపుచ్చలేకపోయారు.

ఆలస్యం..ఆటంకమా..?

ప్రచారానికి సోనియాను రప్పించడం సమయోచితమైన ఆలోచనే. నామినేషన్ల ఉపసంహరణ చివరి వరకూ కూటమిలో గందరగోళం కొనసాగుతూనే వచ్చింది. ఎవరెన్నిస్థానాల్లో నిలుచుంటారో, ఎవరికి రెబల్స్ బెడద ఉంటుందో తెలియని అయోమయం రాజ్యం చేసింది. మిత్రులకు కేటాయించిన స్థానాల్లో కాంగ్రెసు రెబల్స్ బెడద వెన్నాడుతూ వచ్చింది. పార్టీ తరఫున పోటీ చేయాలని అయిదేళ్ల నుంచి ఎదురుచూస్తున్నవారు బెట్టు చేశారు. ఏదేమైనప్పటికీ అహ్మద్ పటేల్ సహా కాంగ్రెసు అగ్రనాయకత్వం రంగంలోకి దిగి చాలావరకూ అసమ్మతులను బుజ్జగించగలిగింది. పార్టీలోని సీరియస్ నెస్ కు ఇది దర్పణం పట్టింది. అయితే ఒకవైపు టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుంటే ఇంకా హస్తం పార్టీ ఒక్క అడుగు కూడా బయట వేయలేకపోవడం లోటుగానే కనిపించింది. రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యం. విజయం సాధిస్తామని హస్తం పార్టీ ఎంత బలంగా విశ్వసిస్తున్నప్పటికీ రాజకీయాల్లో ప్రతిరోజూ ఎంతో విలువైనది. దానిని సద్వినియోగం చేసుకునే దిశలో జాప్యం కూటమికి పరీక్ష పెడుతోంది.

బాబు, రాహుల్ జట్టు కడితే..

సోనియా గాంధీ సభతో ప్రచారానికి శంఖారావం పూరించినట్లే చెప్పాలి. ప్రజాకూటమి ప్రజల్లోకి వెళ్లేందుకు ఇదొక మహాఘట్టమని కాంగ్రెసు చెబుతోంది. ఈ ఊపును కొనసాగించేందుకుగాను చంద్రబాబు , రాహుల్ గాంధీ ఈనెల 28, 29 తేదీల్లో ప్రచారం నిర్వహించబోతున్నారు. ఏయే స్థానాల్లో ఎవరెవరు పోటీ పడబోతున్నారనే అంశం ఖాయమైపోయింది. అందువల్ల వ్యక్తిగతంగా నియోజకవర్గాల వారీ ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లే. పార్టీ పరంగా ఈసారి ప్రచారాలు తక్కువగానే ఉండవచ్చు. స్థానికంగా ఉండే కీలకమైన నాయకులందరూ శాసనసభకు అభ్యర్థులుగా ఉన్నారు. ఉత్తమ్, జానా వంటి సీనియర్లు తమ సొంత నియోజకవర్గాలలో తిరగాల్సిన అవసరం ఏర్పడింది. టీఆర్ఎస్ వారిని టార్గెట్ చేస్తూ, ఓడించేందుకు గట్టి ఏర్పాట్లే చేపడుతోంది. తాము నెగ్గడంతో పాటు పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఇదంత సులభమైన విషయమేమీ కాదు. ప్రచార తారలను రంగంలోకి దింపినప్పటికీ వారి పర్యటనలు వినోదానికే పరిమితమవుతాయనే భావన ఉంది. అందువల్లనే టీడీపీ , కాంగ్రెసు అగ్రనాయకులు అయిన చంద్రబాబు, రాహుల్ పర్యటనలు కలిసి వస్తాయని కాంగ్రెసు నాయకులు భావిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాదు పరిసరాల్లోని 20 నియోజకవర్గాలపై ప్రభావం పడేలా వీరి రోడ్డు షోలను నిర్వహిస్తామని టీడీపీ, కాంగ్రెసు చెబుతున్నాయి.

ఓటు బదిలీ సంగతేమిటి..?

తాజాగా జరిగిన అనేక సర్వేల్లో టీఆర్ఎస్ ఓటింగు 37 శాతం వరకూ ఉంటుందని వెల్లడైంది. కాంగ్రెసు 29శాతానికి పరిమితమవుతోంది. టీడీపీ, సీపీఐ, టీజేఎస్ ల కు లభిస్తాయనుకుంటున్న ఓట్లన్నిటినీ సంఘటితం చేయడమెలా ? అన్నదే ఇప్పుడు ప్రజాకూటమి ఎదుర్కొంటున్న ప్రధాన ప్రశ్న. ఒక పార్టీ విధేయ ఓటు మరొక పార్టీకి బదిలీ అవ్వాలంటే బలమైన కారణాలు చెప్పగలగాలి. ఓటర్లను ఒప్పించగలగాలి. లేకపోతే ఆ ఓట్లు మరొకవైపునకు స్వింగ్ అయ్యే చాన్సు పెరుగుతుంది. ఇది కూటమి ఆశలకు గండి కొడుతుంది. ఈ ఓటు బదిలీ సాధ్యం కాదని టీఆర్ఎస్ బలంగా విశ్వసిస్తోంది. ప్రజాకూటమిలోని పరస్పర విరుద్ధశక్తుల ఓట్లను బలంగా ఆకర్షించేందుకు అధికారపార్టీ ప్రయత్నిస్తోంది. సోనియా సభలో చాటుకున్న ఐక్యతను కూటమి నాయకులు నియోజకవర్గాల్లో సైతం ప్రదర్శించగలిగితే కొంతమేరకు ప్రయోజనం ఉంటుంది. లేకపోతే ఒకే ఒక శక్తిగా దూసుకుపోతున్న టీఆర్ఎస్ దూకుడుకు కళ్లెం వేయడం కష్టమే.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News