సోముకు అంతా అలా కలసి వచ్చినట్లయింది

కమలం సుదీర్ఘ వ్యూహానికి ఏపీ లో తెర తీసినట్లే కనిపిస్తుంది. రాజమండ్రికి చెందిన సోము వీర్రాజు ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా అధిష్టానం నియమించడంతో పార్టీని [more]

Update: 2020-07-28 03:30 GMT

కమలం సుదీర్ఘ వ్యూహానికి ఏపీ లో తెర తీసినట్లే కనిపిస్తుంది. రాజమండ్రికి చెందిన సోము వీర్రాజు ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా అధిష్టానం నియమించడంతో పార్టీని నమ్ముకున్నవారివైపే కాషాయదళం దృష్టి పెట్టినట్లు స్పష్టం అయ్యింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా సోము వీర్రాజు పదవులు ఉన్నా లేకపోయినా బిజెపి బలోపేతానికి తన జీవితం మొత్తం ధారపోస్తూనే ఉన్నారు. ఆయనకు గతంలోనే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు దక్కాలిసి ఉన్నా కమలం లో వెంకయ్య నాయుడు వర్గం పదేపదే అడ్డుతగలడంతో చిక్కినట్లే చిక్కి నిరాశ చెందాలిసి వచ్చేది. అయితే సోము వీర్రాజు ఏ నాడు పార్టీ లైన్ దాటలేదు. తన అసంతృప్తిని కూడా ఎప్పుడు బయటపెట్టలేదు. ఇక ఆ ఛాన్స్ లేనట్లే అని అంతా భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా అధిష్టానం దూకుడు గా రాజకీయాలు సాగించే వీర్రాజుకు వీరతిలకం దిద్దేసింది.

సామాన్య కార్యకర్త నుంచి …

సోము వీర్రాజు స్వస్థలం రాజమండ్రి రూరల్ పరిధిలో ఉండే కాతేరు గ్రామం. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వీర్రాజు రాజకీయాల్లోకి రావడానికి రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ ప్రేరణ అని చెబుతూ ఉంటారు. జై ఆంధ్రా ఉద్యమ సమయంలో ఆ ఉద్యమం కోసం ఉండవల్లి చేసిన ప్రసంగాలకు సోము వీర్రాజు ఆకర్షితుడయ్యాడు. సిద్ధాంత పరంగా ఉండవల్లి కాంగ్రెస్ లో సోము వీర్రాజు బిజెపి లో ఉన్నా ఆయన ఉండవల్లి పట్ల గురు భావం ప్రదర్శిస్తారు. యువకుడిగా ఉన్నప్పుడే ఆరెస్సెస్ భావజాలానికి ఆకర్షితుడై సోము వీర్రాజు బిజెపి జండా పట్టారు. నాటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసింది లేదు. పార్టీ ఉద్యమాల్లో చురుగ్గా సాగుతూ ఆర్ ఎస్ ఎస్ క్రమశిక్షణలో పెరిగి పెద్దయ్యారు వీర్రాజు. 1994 లో ఆయన కృషిని గుర్తించిన అధిష్టానం నాటి కడియం అసెంబ్లీ స్థానానికి టికెట్ ఇచ్చింది. ఆ తరువాత కూడా రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుంచి అవకాశం కల్పించినా ఆర్ధిక బలం లేక పార్టీ గాలి లేకపోవడంతో ఆయనకు రాజ యోగం పట్టలేదు.

అవకాశాలు వచ్చినా…..

పార్టీకి మంచి ఊపు వచ్చిన వాజ్ పేయి వేవ్ లో రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి తాను పోటీ చేయకుండా గిరజాల వెంకట స్వామినాయుడు కు టికెట్ ఇప్పించి ఆయన విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆ తరువాత నాయుడు తో సోము వీర్రాజు గ్రూప్ తో వివాదాల నేపథ్యంలో ఆయన స్థానంలో ఎస్ పి బి పి కె సత్యనారాయణ కు టిక్కెట్ దక్కించి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు. నాడు వాజ్ పేయి ఒక్క ఓటు తో అధికారం కోల్పోవడంతో వచ్చిన వేవ్ లో టికెట్ తెచ్చుకునే స్థాయి అవకాశం ఉన్నా గెలిచే అవకాశాలు ఉన్న రెండు సార్లు ఆ అవకాశాన్ని వాడుకోలేదు వీర్రాజు. పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం పై ఆయన పెట్టిన శ్రమ తన కెరియర్ ఎదుగుదలలో వినియోగించుకోవడంలో వీర్రాజు వెనుకబడ్డారంటారు ఆయన సన్నిహితులు.

హరిబాబు తరువాత …

సుదీర్ఘ కాలం ఆంధ్రప్రదేశ్ బిజెపి పగ్గాలు అందుకున్న కంభంపాటి హరిబాబు తరువాత సీనియారిటీ లో చూసుకుంటే సోము వీర్రాజు కు అధిష్టానం పార్టీ పగ్గాలు అప్పగించాలి. 2014 ఎన్నికలకు ముందు ఎపి లో బిజెపి, టిడిపి, జనసేన కూటమి కట్టడంలో సోము కీలక పాత్రే పోషించారు. ఈ హిట్ కాంబినేషన్ కారణంగానే వీర్రాజు కు ఎమ్యెల్సీ అవకాశం పార్టీ కల్పించింది. దీనితో పాటు బిజెపి అధ్యక్ష బాధ్యతలు అందుకుంటారని అంతా భావించారు. అయితే బిజెపి లో ఉన్న టిడిపి కోవర్ట్ ల కారణంగా మరోసారి సోము వీర్రాజు కి ఛాన్స్ పోయిందంటారు. విభజన తరువాత కాంగ్రెస్ నుంచి కమలంలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడతానని బెదిరించడంతో ఎన్నికలముందు ఆయనకు అధ్యక్ష బాధ్యతలను అధిష్టానం కట్టబెట్టింది. అలా మరోసారి అందని ద్రాక్షగానే ఎపి అధ్యక్ష బాధ్యతలు దూరం అయ్యాయి సోము కి. అయినప్పటికి ఆయన కినుక వహించలేదు.

సోము కు అదే బలం …

ఒకే పార్టీలో ఉంటూ జయాపజయాలతో సంబంధం లేకుండా సోము వీర్రాజు సాగడం ఆయన ఎదుగుదలకు ప్రధాన కారణం. ఎన్నో ఆటుపోట్లు రాజకీయాలు అంటే ఆర్ధికంగా ఉన్న వారే చేయాలనే రోజుల్లో కూడా ఎలాంటి అండదండలు లేకపోయినా తన తెలివి తేటలనే ఆయన పెట్టుబడిగా ముందుకు నడిచారు. నమ్మిన పార్టీ చేతిని ఏనాడు వీడలేదు. అధిష్టానమే సుప్రీం గా విధేయుడిగా సాగారు. తన మాటకారితనంతో పాటు ప్రతి అంశంపై అవగాహన పెంచుకుని అందరికి అర్ధం అయ్యేలా మాట్లాడటం ఆయనకు ప్లస్ పాయింట్. పార్టీ గీతను ఎప్పుడు దాటని ఆర్ ఎస్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారికే ఇప్పుడు కాషాయదళం పెద్ద పీట వేయడం మొదలు పెట్టింది. ఇటీవల కర్ణాటకలో రాజ్యసభ టికెట్ల అంశంలో కూడా పార్టీ విధేయులకే టిక్ పెట్టి తన కొత్త ఫార్ములా బయటపెట్టింది బిజెపి. తెలంగాణ లో సైతం దూకుడుగా వెళ్ళే బండి సంజయ్ వంటి వారికి బాధ్యతలు అప్పగించి అయారాం గయారాం లకు ఇకపై పెద్దగా అవకాశాలు ఉండవనే సందేశం చెప్పకనే చెప్పేసింది. అదే రీతిలో ఎపి లో సైతం పార్టీని నమ్ముకున్న నమ్మకస్తులకే వీర ఖడ్గాన్ని అందించినట్లు వీర్రాజు నియామకం స్పష్టం చేసేసింది.

అత్యంత క్లిష్ట సమయం …

ఎపి లో బిజెపి ఎదుగుదల అంత సులువైన అంశం అయితే కాదు. ఒక పక్క ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్ష టిడిపి. మరో పక్క అత్యధిక సీట్లతో పాటు సోషల్ ఇంజనీరింగ్ లో చేయి తిరిగిన వైఎస్ జగన్ నేతృత్వంలో దూసుకుపోతున్న వైసిపి లను నిలువరించడం వారి వ్యూహాలకు ప్రతి వ్యూహాలతో సాగడం కత్తిమీద సామే. దీనికి సుదీర్ఘ వ్యూహం అవసరం. ఆ వ్యూహం అధిష్టానం తో ఎప్పటికప్పుడు చర్చిస్తూ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా వెళ్ళాలి. ఎపి లో బిజెపి దూసుకుపోతుంది అని అంతా లెక్కేసిన ప్రతీ సారి టిడిపి తన రాజకీయ వ్యూహాలతో చెక్ పెడుతూ ఆ పార్టీని ఆడుకుంటూ వచ్చేది. దీనికి కమలంలో కొందరు పెద్దలు టిడిపి పట్ల సానుకూలంగా వ్యవహారం సాగించడమే అన్నది బహిరంగ రహస్యం. ఇలాంటి పరిస్థితుల్లో సోము వీర్రాజుకు ఇక ఎప్పటికి దక్కదని అంచనా వేసుకున్న వారికి షాక్ ఇస్తూ కమలం ఎపి అధ్యక్ష పగ్గాలు అందించడం మాత్రం రెండు ప్రధాన పార్టీలకు ముఖ్యంగా విపక్ష టిడిపి కి మింగుడు పడని అంశమే. సోము వీర్రాజు తన పై పార్టీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు లేదో చూడాలి.

Tags:    

Similar News