సోము… మరో పరిమళ్ నత్వానీ… ?

వైసీపీ రాజ్యసభ సభ్యుల ఎంపికలో గత ఏడాది ఒక చిత్రం చోటు చేసుకుంది. ముఖేష్ అంబానీ అంతటివాడు ఏకంగా తన మనిషిగా ఉన్న పరిమళ్ నత్వానీని వెంటబెట్టుకుని [more]

Update: 2021-06-07 06:30 GMT

వైసీపీ రాజ్యసభ సభ్యుల ఎంపికలో గత ఏడాది ఒక చిత్రం చోటు చేసుకుంది. ముఖేష్ అంబానీ అంతటివాడు ఏకంగా తన మనిషిగా ఉన్న పరిమళ్ నత్వానీని వెంటబెట్టుకుని ప్రత్యేక విమానంలో తాడేపల్లికి రావడంతో జగన్ ఆయనని పెద్ద మనిషిని చేయడానికి ఓకే అనాల్సి వచ్చింది. దీని వెనక బీజేపీ పెద్దలు కూడా ఉన్నారన్నది బహిరంగ రహస్యం. నిజానికి గుజరాత్ కి చెందిన పరిమళ్ నత్వానీకి ఏపీతో ఏ విధంగా చూసుకున్నా సంబంధం అసలు లేనే లేదు. కానీ కొన్ని అలా జరిగిపోతూంటాయి. మరి బీజేపీ కోటాలో నత్వానీకి వైసీపీ ఎంపీ టికెట్ ఇచ్చిన జగన్ రేపటి రోజున శాసనమండలిలో మరో సీటు ఇవ్వడానికి రెడీ అవుతున్నారా అన్నదే చర్చట.

మాజీగా సోము …?

సోము వీర్రాజు బీజేపీకి, ఆరెస్సెస్ కి వీర విధేయుడు. ఆయన మంచితనం బహు దొడ్డది. లేకపోతే వాజ్ పేయి వేవ్ లో రాజమండ్రీ నుంచి ఎంపీగా తాను పోటీ చేయకుండా సత్యనారాయణరావుని నిలబెట్టారు. అలా అధికారానికి దూరం అయిన సోము వీర్రాజు జీవితంలో మొదటి అధికార పదవి అంటే ఎమ్మెల్సీనే. 2015లో ఆయన శాసనమండలిలో ప్రవేశించారు. నాడు తెలుగుదేశం తో బీజేపీకి ఉన్న పొత్తు కారణంగా ఆయనకు ఇది సాధ్యపడింది. ఆ పదవీకాలం తాజాగా ముగిసింది. కనుచూపు మేరలో ఆయనకు మళ్ళీ చట్టసభలలో పదవి దక్కే చాన్స్ అయితే లేదు.

సాఫ్ట్ కార్నర్ …?

ఇక సోము వీర్రాజు రాజకీయం ఎపుడూ చంద్రబాబు మీదనే గురి పెడుతూ ఉంటుంది. ఆయన తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా కూడా బాబునే టార్గెట్ చేశారని తమ్ముళ్ళు నిన్నటిదాకా అంటూ వచ్చారు. అదే సమయంలో సోము జగన్ని పెద్దగా నిందించరు అన్న మాట కూడా ఉంది. జగన్ సీఎం అయ్యాక బీజేపీ నేతలలో సోముకు మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆయన విమర్శలు చేసినా పెద్దగా పట్టించుకోరు. ఒక విధంగా సోము పట్ల జగన్ సాఫ్ట్ కార్నర్ తో ఉంటారని అంటారు. రేపటి రోజున వైసీపీకి మండలిలో 18 దాకా ఎమ్మెల్సీ పదవులు దక్కనున్నాయి. అందులో ఒక్క సీటు అయినా సోముకి ఇస్తారా అన్నదే ఇపుడు చర్చగా ఉందిట.

సిఫార్స్ చేస్తారా..?

సోము వీర్రాజు ఏపీ బీజేపీకి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన చేతిలో అధికార‌ పదవి ఉంటే మరింత ధీమాగా పార్టీ బండి లాక్కురాగలరని కేంద్ర పెద్దల భావన. ఆయనను బీజేపీ రాష్ట్రాల నుంచి ఏరి కోరి రాజ్యసభని చేసేంత సీన్ లేదు. అలాగని ఆయన ఉన్న ఉదుటన‌ ఎమ్మెల్యే కాలేరు. అందువల్ల ఉన్న మార్గమల్లా ఎమ్మెల్సీగా మరో మారు పంపించడమే. జగన్ తో బీజేపీ పెద్దలకు ఎటూ మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి సోము వీర్రాజుని ఎమ్మెల్సీ చేయమని అడిగే చాన్స్ ఉంది. ఎక్కడో గుజరాత్ వాసి పరిమళ్ నత్వానీనే ఎంపీగా చేసిన జగన్ తమ ప్రాంతం వాడు, తన పట్ల కాస్తా సానుకూలత ఉన్న సోము వీర్రాజుని ఎమ్మెల్సీని చేయడం పెద్ద కష్టమైనది కాబోదు అంటున్నారు. మొత్తానికి జగన్ తలచుకుంటే సోము జాతకం మారిపోవడం ఖాయమే అన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News