మాటలు మాత్రం కోటలు.. కూటమికి బీటలు

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు దూకుడు పార్టీకి ఇబ్బందిని తెచ్చిపెడుతున్నాయి. ఆయన కామెంట్స్ తో పాటు నిర్ణయాలు కూడా కూటమిలోని జనసేన పార్టీ సయితం [more]

Update: 2021-02-16 00:30 GMT

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు దూకుడు పార్టీకి ఇబ్బందిని తెచ్చిపెడుతున్నాయి. ఆయన కామెంట్స్ తో పాటు నిర్ణయాలు కూడా కూటమిలోని జనసేన పార్టీ సయితం ఇరుకున పెట్టేలా చేస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిర్ణయించక ముందే తమ అభ్యర్థే బరిలో ఉంటారని సోము వీర్రాజు ప్రకటించారు. దీంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా వెళ్లి అక్కడ పార్టీ నేతలతో సమావేశమై ఇంకా అభ్యర్థి ఎంపిక జరగలేదని చెప్పాల్సి వచ్చింది.

అంతా హడావిడి తప్ప…

పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అంతకు ముందు చేసిన హడావిడి ఏమాత్రం కన్పించలేదు. ఎన్నికల్లో కనీసం పోటీ చేసేందుకు అనేక చోట్ల అభ్యర్థులు కూడా లేకపోవడం ఆపార్టీ పరిస్థితికి అద్దం పడుతుంది. కానీ సోము వీర్రాజు వ్యాఖ్యలు మాత్రం కోటలు దాటుతున్నాయి. తమ అభ్యర్థులను వైసీపీ బెదిరిస్తుందని తమ చేతకాని తనాన్ని డైవర్ట్ చేసేందుకు సోము వీర్రాజు ప్రయత్నిస్తున్నారన్నది వాస్తవం. నిజానికి జనసేన, బీజేపీలు కలసి పోటీ చేయాలనుకున్నా అనేక చోట్ల అభ్యర్థులు ఎవరూ ముందుకు రావడం లేదు.

ఎవరు చేరకుండానే…?

ఇక టీడీపీ, వైసీపీ నుంచి అనేక మంది మాజీ మంత్రులు, ఎంపీలు తమ పార్టీలో చేరుతున్నారని గత కొంతకాలంగా సోము వీర్రాజు ప్రకటిస్తూనే వస్తున్నారు. సోము వీర్రాజు అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత ఏ ఒక్కరూ పార్టీ కండువా కప్పుకోలేదు. ఇటీవల టీడీపీ నేత పడాల అరుణ మాత్రమే బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. సోము వీర్రాజు టీం 13 జిల్లాల్లో చేరికలకు ప్రయత్నిస్తున్నా అది సాధ్య పడటంలేదు. పంచాయతీ ఎన్నికలు రావడంతో ఇప్పుడు నేతలు కూడా ఎవరు చేరే అవకాశాలు లేవంటున్నారు.

ఏకపక్ష ప్రకటనలతో…..

బీసీలను ముఖ్యమంత్రిని చేస్తామని సోము వీర్రాజు ఏకపక్షంగా ప్రకటన చేయడం కూడా ఇబ్బందికరంగా మారింది. సోము వీర్రాజు వ్యాఖ్యలను పార్టీలో ఉన్న నేతలే తప్పు పడుతున్నారు. కూటమి కడుతున్నప్పుడు చర్చ చేయకుండా ఎలా ప్రకటిస్తారని కొందరు నేతలు ఆయనను ప్రశ్నించినట్లు తెలిసింది. తిరుపతి ఉప ఎన్నికకు ఏ మాత్రం పార్టీని సన్నద్ధం చేయకుండా కేవలం మాటలతో సోము వీర్రాజు కాలక్షేపం చేస్తున్నారన్న టాక్ అయితే పార్టీలో బలంగా ఉంది.

Tags:    

Similar News