సోము పై వాయిస్ పెరుగుతుందా?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు వచ్చి ఏడాది కూడా కాలేదు. అప్పుడే ఆయనపై వ్యతిరేక గళాలు విన్పించడం ప్రారంభమయ్యాయి. సోము వీర్రాజు కు అసలు అధ్యక్ష [more]

Update: 2020-12-21 13:30 GMT

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు వచ్చి ఏడాది కూడా కాలేదు. అప్పుడే ఆయనపై వ్యతిరేక గళాలు విన్పించడం ప్రారంభమయ్యాయి. సోము వీర్రాజు కు అసలు అధ్యక్ష పదవి రాకుండానే అప్పట్లో కొందరు అడ్డుపడ్డారన్నది వాస్తవం. సోము వీర్రాజుకు తప్ప ఎవరికి పదవి ఇచ్చినా పరవాలేదని అధిష్టానం వద్ద రాజీ మార్గానికి కూడా కొందరు తెరతీశారు. అయితే సోము వీర్రాజుకే పార్టీ పగ్గాలు అప్పగిస్తూ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకోవడం కొందరికి మింగుడుపడ లేదు.

మూడు వర్గాలుగా…

ఎవరు అవునన్నా కాదన్నా బీజేపీలో మూడు వర్గాలు మాత్రం బలంగా ఉన్నాయి. ఒకటి టీడీపీ అనుకూల వర్గం, మరొకటి వైసీపీకి మద్దతు తెలిపే వర్గం. మూడోది నికార్సయిన బీజేపీ వర్గం. ఈ మూడో వర్గానికి చెందిన వారే సోము వీర్రాజు. ఆయనతో కలిపి నికార్సయిన బీజేపీ వర్గంలో కొద్ది మంది నేతలు మాత్రమే ఉన్నారు. వారే ఇప్పుడు సోము వీర్రాజు చుట్టూ ఉన్నారు. మిగిలిన వారంతా ఏదో ఒక పార్టీతో అనుబంధం ఉన్నావారే.

టీడీపీయే టార్గెట్…..

అయితే సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా వచ్చిన నాటి నుంచి టీడీపీని ఎక్కువగా టార్గెట్ చేస్తున్న మాట వాస్తవం. వైసీపీపై విమర్శలు చేస్తున్నా అదే స్థాయిలో ఆయన టీడీపీపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. ఏపీలో బీజేపీ రెండో పొజిషన్ లోకి రావాలంటే టీడీపీ బలాన్ని తగ్గించాలి. అందుకే సోము వీర్రాజు టీడీపీని టార్గెట్ గా చేసుకున్నారు. కానీ ఇది కొందరు టీడీపీ అనుకూల నేతలకు రుచించడం లేదు.

సీఎం రమేష్ వ్యాఖ్యలే…..

ప్రధానంగా టీడీపీ నుంచి వచ్చి బీజేపీలో చేరిన వారిలో ఈ అసంతృప్తి ఎక్కవుగా కన్పిస్తుంది. ఇటీవల రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. నాయకులు వ్యక్తిగత ఎజెండాలను పక్కన పెట్టాలని సీఎం రమేష్ చేసిన కామెంట్స్ సోము వీర్రాజును ఉద్దేశించి చేసినవే. వైసీపీ నేతలపై కేసులు పెట్టేందుకు అవసరమైన మెటీరియల్ బీజేపీ వద్ద ఉందని, వారిపై కేసులు పెట్టాలని సీఎం రమేష్ కోరారు. దీనిని బట్టి చూస్తుంటే రానున్న కాలంలో సోము వీర్రాజు పై సొంత పార్టీ నేతల నుంచి మరింత ఎటాక్ ఎక్కువయ్యే అవకాశాలు బాగా కన్పిస్తున్నాయి.

Tags:    

Similar News