కాపు నేతే కాబోయే సీఎం.. బీజేపీ ప్ర‌చారం వెనుక?

రాజ‌కీయాల్లో కావాల్సింది ప్రచార‌మే. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. కానీ, ఆ ప్రచారం దారి త‌ప్పకూడ‌దు. న‌ర్మగ‌ర్భంగానూ ఉండరాదు. కానీ, ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నేత‌ల్లో జ‌రుగుతున్న ప్రచారం [more]

Update: 2020-10-04 09:30 GMT

రాజ‌కీయాల్లో కావాల్సింది ప్రచార‌మే. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. కానీ, ఆ ప్రచారం దారి త‌ప్పకూడ‌దు. న‌ర్మగ‌ర్భంగానూ ఉండరాదు. కానీ, ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నేత‌ల్లో జ‌రుగుతున్న ప్రచారం వెనుక చాలా వ్యూహ‌మే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. బీజేపీ రాష్ట్ర సార‌థిగా సోము వీర్రాజు ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా తాము అధికారంలోకి వ‌స్తామ‌ని ఆయ‌న చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ.. జ‌న‌సేన‌తో క‌లిసి అధికారంలోకి వ‌స్తామ‌ని కూడా చెబుతు న్నారు సోము వీర్రాజు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అదే స‌మ‌యంలో ఆయ‌న ఈ ద‌ఫా రాష్ట్రానికి కాపు నేతే సీఎం అవుతార‌ని ఆయ‌న ప్రచారం చేస్తుండ‌డం చ‌ర్చకు వ‌స్తోంది.

ఎత్తుగడలో భాగమే……

వాస్తవానికి బీజేపీకి సార‌థ్యం వ‌హిస్తున్న సోము వీర్రాజు కూడా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. ఇక‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా అదే సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌. మ‌రి రేపు బీజేపీ- జ‌న‌సేన కూట‌మి నిజంగానే అధికారంలోకి వ‌స్తే.. వీరిద్దరిలో ఎవ‌రు ప‌గ్గాలు చేప‌డ‌తారు ? సోము వీర్రాజు వ్యూహం ఏంటి ? అనేది చ‌ర్చనీయాంశంగా మారింది. దీనికి స‌మాధానంగా కొంద‌రు సీనియ‌ర్లు ఏమంటున్నారంటే.. కాపుల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు సోము వీర్రాజు వ్యూహాత్మకంగా వేసిన ఎత్తుగ‌డ‌లో భాగ‌మ‌ని చెబుతున్నారు.

ఇతర పార్టీల నేతలను….

కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను, క్రియాశీల కార్యకర్తలను బీజేపీలోకి ఆహ్వానించే పనిలో భాగంగా.. ఈ వ్యాఖ్యలు చేస్తున్నార‌ని చెబుతున్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. కాపు నేత సీఎం అవుతారని చేస్తున్న ప్రచారం వెనుక‌.. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో బ‌లంగా ఉన్న బీజేపీ ఓటు బ్యాంకును త‌మవైపు తిప్పుకొనేందుకేన‌ని అంటున్నారు. అంతేకాదు. కొంద‌రు ఇత‌ర పార్టీ నేత‌ల‌కు కూడా సోము వీర్రాజు గేలం వేస్తున్నార‌ని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు పార్టీలోకి వస్తే తగిన గుర్తింపుతో పాటు పదవులు ఇస్తామని ఆశల వల విసురుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తూర్పు గోదావరి జిల్లాలో…..

ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతను బీజేపీ నేతలు కలిసి సంప్రదింపులు జరిపారని ప్రచారం జ‌రుగుతోంది. పార్టీలో చేరితే అత్యున్నత స్థాయి క‌ల్పిస్తామ‌ని కూడా ఆశ పెట్టడంతోపాటు.. ప్రభుత్వంలోనూ ప‌ద‌వి ఇస్తామ‌ని చెప్పారని గుస‌గుస వినిపిస్తోంది. అయితే, ఇదంతా వింటున్న విశ్లేష‌కులు.. ఆలు లేదు చూలు లేదు.. అన్నట్టుగా సోము వీర్రాజు వ్యవ‌హారం ఉంద‌ని అంటున్నారు.

Tags:    

Similar News