Somirddy : సోమిరెడ్డిని ఆ జిల్లా దాటించేస్తారా?

కొన్ని నియోజకవర్గాలకు ఈసారి నేతలను వెదుక్కోవాల్సిన పరిస్థితి టీడీపీది. ఇప్పటికే పార్లమెంటు సభ్యులుగా పోటీ లో ఉండబోమని ముగ్గురు తేల్చేశారు. ఈమూడు స్థానాలకు వేరే వారిని ఎంపిక [more]

Update: 2021-10-23 12:30 GMT

కొన్ని నియోజకవర్గాలకు ఈసారి నేతలను వెదుక్కోవాల్సిన పరిస్థితి టీడీపీది. ఇప్పటికే పార్లమెంటు సభ్యులుగా పోటీ లో ఉండబోమని ముగ్గురు తేల్చేశారు. ఈమూడు స్థానాలకు వేరే వారిని ఎంపిక చేయాల్సి ఉంది. ప్రస్తుత ఎంపీ కేశినేని నాని పోటీ చేయనన్నారు. విజయవాడలో టీడీపీకి నేతల కొదవలేదు. రాజమండ్రిలోనూ అభ్యర్థి ఇబ్బంది ఉండకపోవచ్చు. నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన బీద మస్తాన్ రావు పార్టీ నుంచి వెళ్లిపోయారు. నెల్లూరులోనూ ఎవరో ఒకరు దొరుకుతారు.

హిస్టరీ చూస్తే….

ఒంగోలు పార్లమెంటుకే అభ్యర్థి సమస్యగా మారనుంది. దీని హిస్టరీ చూస్తే టీడీపీకి ఏడుపాగదు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఒంగోలు కు ఇప్పటి వరకూ రెడ్డి సామాజికవర్గం నుంచే ఎన్నికయ్యారు. 1999లో కరణం బలరాం తప్ప దాదాపు మూడు దశాబ్దాలుగా ఒంగోలు పార్లమెంటుకు రెడ్డి సామాజికవర్గం నేతలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులోనూ ఒంగోలు పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ గెలిచింది రెండు సార్లు మాత్రమే. ఒకటి 1984లో బెజవాడ పాపిరెడ్డి, 1999లో కరణం బలరాం. 1999 తర్వాత ఒంగోలు పార్లమెంటులో టీడీపీ జెండా ఎగురలేదు.

రెడ్డి సామాజికవర్గం….

ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఎర్రగొండపాలెం, దర్శి, ఒంగోలు, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. దర్శి, కొండపి తప్పించి మిగిలిన నియోజకవర్గాల్లో రెడ్డి సామాజికవర్గానిదే ఆధిపత్యం. గత ఎన్నికలలో చంద్రబాబు చేసిన ప్రయోగం ఫలించలేదు. అప్పటి వరకూ మంత్రిగా ఉన్న శిద్ధారాఘవరావును (వైశ్య సామాజికవర్గం)ను పోటీకి దింపినా ఫలితం లేదు. అందుకే ఈసారి ఇక్కడ రెడ్డి సామాజికవర్గాన్ని పోటీకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నారు.

నెల్లూరు జల్లా నేతలే…

ఒంగోలు పార్లమెంటుకు ఎంపీలుగా ఉన్నవారిలో ఎక్కువ మంది నెల్లూరు జిల్లా నేతలే. అయితే ఈసారి నెల్లూరు నుంచి నేతలను ఇక్కడకు దింపాలనుకుంటున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు బలంగా వినపడుతుంది. నెల్లూరులో సర్వేపల్లిలో ఆయన కుమారుడిని పోటీకి దింపి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేయించాలని చంద్రబాబు ప్రాధమికంగా నిర్ణయించారని తెలిసింది. మరి ఈ ప్రతిపాదనకు సోమిరెడ్డి ఒప్పుకుంటారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News