సోమిరెడ్డికి ఫైన‌ల్ ప‌రీక్షా… ఇంకో ఛాన్స్ ఉండ‌దా ?

తిరుప‌తి ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ రావ‌డంతోనే టీడీపీకి అష్టక‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఇప్పటికే అనేకానేక స‌మ‌స్యల‌తో విల‌విల్లాడుతోన్న టీడీపీకి ఇప్పుడు తిరుప‌తి ఉప ఎన్నిక‌ల వేళ ఇవి మ‌రింత [more]

Update: 2021-04-06 11:00 GMT

తిరుప‌తి ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ రావ‌డంతోనే టీడీపీకి అష్టక‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఇప్పటికే అనేకానేక స‌మ‌స్యల‌తో విల‌విల్లాడుతోన్న టీడీపీకి ఇప్పుడు తిరుప‌తి ఉప ఎన్నిక‌ల వేళ ఇవి మ‌రింత పెరిగిపోతున్నాయి. అధికార వైసీపీ వ‌రుస విజ‌యాల‌తో మాంచి దూకుడు మీద ఉంది. ఇక జ‌గ‌న్ తిరుప‌తి ఉప ఎన్న్ఇక కోస‌మే ఏకంగా ప‌ది మంది మంత్రుల‌కు బాధ్యత‌లు ఇవ్వడంతో పాటు వీరిని స‌మ‌న్వయం చేసుకునే బాధ్యత‌ను మంత్రి పెద్దిరెడ్డికి, టీటీడీ చైర్మన్ వైవి. సుబ్బారెడ్డికి అప్పగించారు. ఇటు టీడీపీ నేత‌ల‌ను స‌మ‌న్వయం చేసే బాధ్యత‌ను చంద్ర‌బాబు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి మీద పెట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అమ‌ర్‌నాథ్ రెడ్డికి సైతం ఇక్కడ బాధ్య‌త‌లు చూడ‌మ‌ని చెప్పినా ఆయ‌న ఇక్కడ ప‌ని చేసేందుకు అంత ఆస‌క్తిగాను లేరు… పైగా ఈ పార్లమెంటు ప‌రిధిలో ఆయ‌న‌కు ఏ మాత్రం ప‌ట్టులేదు. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం రాజంపేట పార్లమెంటు ప‌రిధిలో ఉంది. అందుకే చిత్తూరు, తిరుప‌తి పార్లమెంటు స్థానాల రాజ‌కీయాలు, నేత‌ల‌తో ఆయ‌న‌కు కాస్త గ్యాప్ ఎక్కువే.

సొంత నియోజకవర్గంలోనే…

చంద్రబాబు చెప్పిందే త‌డ‌వుగా సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి తిరుప‌తి ఉప ఎన్నిక కోసం యాక్టివ్ అయ్యారు. నేత‌ల‌ను క‌లుస్తూ స‌మావేశాలు పెడుతున్నారు. అయితే ఆయ‌న్ను రెండు జిల్లాల ప‌రిధిలో ఉన్న నేత‌లు ఎవ్వరూ ప‌ట్టించుకోవ‌డం లేదు క‌దా.. లైట్ తీస్కొంటున్నారు. ఇదే అద‌నుగా పార్లమెంటు ప‌రిధిలో ఉన్న ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో గ్రూపు రాజ‌కీయాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. తాము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప‌ట్టించుకోని సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి, పార్టీ అధిష్టానం ఇప్పుడు వ‌చ్చి బుజ్జగింపులు చేస్తే మేం వినాలా ? అని వారంతా లైట్ తీస్కొంటున్నారు. ఇంకా చెప్పాలంటే సోమిరెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం సర్వేపల్లిలోనే ఆయ‌న‌కు వ్యతిరేక వ‌ర్గం గ‌ట్టిగా ఉంది. ఇప్పటికే ఐదుసార్లు ఆయ‌న ఓడిపోయినా భ‌రిస్తూ వ‌చ్చామ‌ని.. నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ‌ను ఎద‌గ‌నీయ‌లేదు స‌రిక‌దా ? క‌నీసం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉండి కూడా ఇబ్బంది పెట్టార‌ని వారు వాపోతున్నారు.

నేతల మధ్య సమన్వయం లేక….

పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గ కేంద్రమైన తిరుప‌తిలో మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మను వెంట‌నే త‌ప్పించేసి.. ఆ ఫ్యామిలీకి కాకుండా మ‌రో నేత‌కు బాధ్యత‌లు ఇవ్వాల‌ని అక్కడ నేత‌లు కోరుతున్నారు. ఆమె ఒంటెత్తు పోక‌డ‌ల వ‌ల్లే పార్టీకి చాలా మంది నేత‌లు దూర‌మ‌య్యార‌ని అక్కడ నేత‌లు చెపుతున్నారు. ఇక ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం అయిన సత్యవేడులో జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే హేమలత వర్గీయుల మధ్య వివాదం మామూలుగా లేదు. వారిద్దరికి ఎంత మంది పార్టీ పెద్ద‌లు వ‌చ్చినా స‌ర్దిచెప్పలేక‌పోతున్నారు. ఇక మాజీ మంత్రి బొజ్జల నియోజ‌క‌వ‌ర్గం శ్రీకాళహస్తిలో టీడీపీ ఉనికి నామరూపాల్లేకుండా పోతోంది. అక్కడ ఆ పార్టీ ఇన్‌చార్జి బొజ్జల సుధీర్‌రెడ్డి కార్యకర్తలకు అందుబాటులో ఉండ‌డం లేదు సరిక‌దా ? ఆ ఫ్యామిలీయే ఎక్కువుగా హైద‌రాబాద్‌కు పరిమిత‌మ‌వుతోంది.

ఈయన వల్ల అవుతుందా?

ఇక సూళ్లూరుపేట‌, గూడురులో ఉన్నన్ని గొడ‌వ‌లు ఏ నియోజ‌క‌వ‌ర్గంలోనూ లేవనే చెప్పాలి. వీటిని స‌రిదిద్దకుండా సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి చిన్నా చిత‌కా నాయ‌కుల‌ను, త‌న‌తో పాటు ఉండే ఐదారుగురు నేత‌ల‌ను వెంటేసుకుని ఉప ఎన్నిక బాస్ నేనే అంటూ హ‌డావిడి చేయ‌డంపై పార్టీ అభ్యర్థి ప‌న‌బాక ల‌క్ష్మి సైతం అస‌హ‌నంతోనే ఉన్నార‌ట‌. ప‌న‌బాక గ‌తంలో నెల్లూరు నుంచి కాంగ్రెస్ త‌ర‌పున ఎంపీగా ప‌లుమార్లు గెలిచారు. ఆమెకు ఇప్పటికీ అక్కడ ఓ అనుచ‌ర‌గ‌ణం ఉంది. వారిని కూడా సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి ఏమాత్రం ప‌ట్టించుకోక‌పోవ‌డంతో తిరుప‌తి ఉప ఎన్నిక‌కు ముందే సోమిరెడ్డి పార్టీని ముంచేస్తార‌నే పార్టీ నేత‌లు గుస‌గుస‌లాడుకుంటున్నారు. ఇప్పటికే బాబు ఆయ‌న‌కు చాలా ఛాన్సులు ఇచ్చారు. ఈ ఫైన‌ల్ ఛాన్సును కూడా ఆయ‌న యూజ్ చేసుకోలేక‌పోతే నెక్ట్స్ టైం ఆయ‌న‌కు పార్టీలో ప్రయార్టీ ఉండ‌ద‌నే పార్టీ నేత‌లు గుస‌గుస‌లాడుకుంటున్నారు. ఈ టైంలో కూడా సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి అంద‌రు నేత‌ల‌ను స‌మ‌న్వయం చేసుకోలేక‌పోతున్నారే అన్న బాధ నెల్లూరు పార్టీ నేత‌ల్లో ఉంది.

Tags:    

Similar News