శృతి మించి…పోయారుగా

ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా వార్ మామూలుగా నడవడం లేదు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలు సోషల్ మీడియాను విస్తృతంగా [more]

Update: 2019-08-29 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా వార్ మామూలుగా నడవడం లేదు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలను, పార్టీలో జరుగుతున్న అంశాలను వైసీపీ సోషల్ మీడియాలో ఎక్కువగా ఉపయోగించుకుంటోంది. అలాగే అధికారంలో ఉన్న వైసీపీని విమర్శించడానికి విపక్షాలు సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించుకుంటాయి.

ఒకరిపై ఒకరు….

అయితే సోషల్ మీడియాలో పోస్టులు శృతి మించిపోతుండటంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే వరకూ వెళ్లింది. వరదల సమయంలో వైఎస్ జగన్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం అమెరికా వెళితే దానిపై తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం సెటైర్లతో జగన్ ను ట్రోల్ చేసింది. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా ఎద్దేవా చేస్తూ పోస్టింగ్ లు పెడుతున్నారు. అసభ్య పదజాలాన్ని కూడా కొందరు ఉపయోగిస్తున్నారు.

అధికార పేజీ నుంచి….

ఇక ఇటీవల వైసీపీ అధికార పేజీ నుంచి వచ్చిన ఒక పోస్టింగ్ కలకలం రేపింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విరాళాలు సేకరించేందుకు ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆన్ లైన్ లో విరాళాలు సేకరిస్తున్నారు. ఈ విరాళాలను తమ అధినేత పుట్టిన రోజున కానుకగా ఇవ్వాలని వారు నిర్ణయించారు. సోషల్ మీడియాలో పెద్ద యెత్తున పవన్ ఫ్యాన్స్ ఈ విరాళాల సేకరణకు దిగింది.

నల్లధనాన్ని మార్చడానికే…..

అయితే వైసీీపీ సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ పుట్టిన రోజు నాడు రెండు వేల కోట్ల రూపాయల నల్లధనం మారుతుందని, చంద్రబాబు వద్ద ఉన్న రెండు వేల కోట్ల బ్లాక్ మనీ వైట్ గా మారుతుందని, దీని వెనక తానా సభ్యులున్నారంటూ పోస్టింగ్ పెట్టారు. ఈ పోస్ట్ వైసీపీ అధికారిక పేజీ నుంచి రావడంతో పవన్ కల్యాణ్ కూడా సీరియస్ అయ్యారు. పవన్ సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా వార్ ఆగినట్లు కనపడటం లేదు.

Tags:    

Similar News