అభిశంసనకు ముందే రాజీనామా?

పరిపాలన సజావుగా సామే తప్ప గేందుకు భారత రాజ్యాంగ నిర్మాతలు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో భాగంగా మూడు కీలకమైన శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలను ఏర్పాటు [more]

Update: 2020-10-15 16:30 GMT

పరిపాలన సజావుగా సామే తప్ప గేందుకు భారత రాజ్యాంగ నిర్మాతలు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో భాగంగా మూడు కీలకమైన శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అదే సమయంలో వాటికి పరిమితులనూ నిర్దేశించారు. మూడూ మఖ్యమైనవేనని ఒకదాని అధికారాల పరిధిలోకి మరొకటి చొరబడరాదని, పరస్పరం వ్యవస్థలు గౌరవించుకోవాలని, సంయమనం పాటించాలని విస్పష్టంగా పేర్కొన్నారు. అదే సమయంలో న్యాయవ్యవస్థకు కొన్ని ప్రత్యేక అధికారాలను కల్పించారు. అదే న్యాయ సమీక్ష అధికారం. శాసన వ్యవస్థ చేసే చట్టాల లోపాలను సమీక్షించే, కార్యనిర్వాహక వ్యవస్థ చేసే పొరపాట్లను సరిదిద్దే అధికారాన్ని కట్టబెట్టారు. అదే సమయంలో విధి నిర్వహణలో భాగంగా న్యాయవ్యవస్థ అత్యంత సంయమనం
పాటించాలని నిర్దేశించింది.

ఆరుగురు న్యాయమూర్తులు…..

న్యాయమూర్తులు పరిధులను అతిక్రమిస్తే పార్లమెంట్ ద్వారా అభిశంసించి వారిని తొలగించే అధికారాన్ని కూడా కట్టబెట్టింది.ఏడు దశాబ్దాల స్వతంత్ర భారత న్యాయవ్యవస్థను స్థూలంగా పరిశీలిస్తే దాని పనితీరులో పెద్దగా అభ్యంతరాలు కనపడవు. అదే సమయంలో కొందరు న్యాయమూర్తుల వైఖరి వల్ల కొంత వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతిన్న విషయాన్ని విస్మరించలేం. అయితే ఏ ఒక్క న్యాయమూర్తి ఇప్పటివరకూ అభిశంసనకు గురికాలేదు. అభిశంసన అంచుల వరకూ వచ్చి ఆగిపోవడమే తప్ప పార్లమెంట్ తొలగించే పరిస్థితి ఎదురుకాలేదు. ఆరుగురు న్యాయమూర్తులు ఆరోపణలు, విమర్శలకు గురయ్యారు. వారిలో మొదటివారు వి.రామస్వామి. తరవాత సుమిత్రాసేన్, జేబీ పార్దివాలా, పీడీ దినకరన్, సీవీ నాగార్జునరెడ్డి, దీపక్ మిశ్రా లపై అభిశంసన ప్రయత్నాలు సాగాయి. వీరంతా అభిశంసనకు ముందో, తరవాతో రాజీనామా చేయడం, లేదా నిర్దోషులుగా బయట పడటం వల్ల అభిశంసన
మచ్చకు లోనుకాలేదు.

రాజీనామాలతో…..

స్వతంత్ర భారత చరిత్రలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి వి.రామస్వామిపై ఆరోపణలు వచ్చాయి. తమిళనాడుకు చెందిన ఆయన పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసే కాలంలో తన కార్యాలయంలో ఫర్నిచర్, ఇతర వసతుల కోసం నిధులు దుర్వినియోగం చేశారన్నది అభియోగం. సుప్రీంకోర్టు బార్ అసోసియషన్ కూడా ఆయనను అభిశంసించాలని తీర్మానించింది. 1993మేలో పార్లమెంటులో ఆయన తరఫున ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ న్యాయనిపుణుడు కపిల్ సిబాల్ వాదించారు. నాడు అధికారంలో ఉన్న పీవీ నరసింహారావు ప్రభుత్వం అభిశంసనకు మద్దతు ఇవ్వక పోవడంతో తీర్మానం పార్లమెంటులో వీగిపోయింది. అనంతరం ఆయన రాజీనామా చేయడంతో వివాదం సద్దుమణిగిపోయింది. 2011లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి రూ.33.23లక్షల కోర్టు నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణతో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. రాజ్యసభలో తీర్మానం ఆమోదం పొంది లోక్ సభలోకి తీర్మానం వచ్చే సమయంలో సేన్ రాజీనామా చేయడంతో సమసిపోయింది.

ఆరోపణలపై ముగింపు…..

మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయామూర్తి పీడీ దినకరన్ పై అవినీతి, భూకబ్జా తదితర ఆరోపణులు రావడంతో ఆయనను సిక్కిం హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ బదిలీని అక్కడి న్యాయవాదులు సైతం వ్యతిరేకించారు. చివరికి అభిశంసన చర్యలు ప్రారంభించక ముందే దినకరన్ 2011 జులైలో రాజీనామా చేయడంతో వ్యవహారం ముగిసింది. రిజర్వేషన్లపై తీర్పులో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో గుజరాత్ హైకోరు్ట న్యాయమూర్తి జేబీ పార్దివాలాపై అభిశంసన నోటీసులు నాటి ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీకి రాజ్యసభ సభ్యులు నోటీసులిచ్చారు. ఈ మేరకు అన్సారీ నుంచి నోటీసులు రాగానే పార్దివాలా వివాదాస్పద వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో సమస్య అంతటితో ముగిసింది. కులతత్వానికి సంబంధించి 2015, 17ల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తి సీవీ నాగార్జునరెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిలబడలేదు. దీంతో అభిశంసన ప్రయత్నాలు నిలిచిపోయాయి. 2018లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై కాంగ్రెస్ పార్టీ అభిశంసనకు ముందుకు వచ్చింది. ఈ ప్రయత్నాలు కూడా ఫలించలదు. అన్ని వ్యవస్థలూ విఫలమవుతున్న నేపథ్యంలో ప్రజల ఆశలు న్యాయవ్యవస్థపైనే ఉన్నాయి. అదీ విఫలమైతే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి. అందువల్ల న్యాయవ్యవస్థ కడిగిన ముత్యంలా ఉండాలని ప్రజలు ఆశించడంలో తప్పేమీ లేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News