అడుగులు ఎటు.. వైపు?

చరిత్రలో ఆరేళ్లు పెద్ద కాలమేమీ కాదు. కానీ పయనం ఎటువైపు సాగుతుందో తెలుసుకునేందుకు సరిపోతుంది. సుదీర్ఘపోరాటం తర్వాత తెలుగు ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా ఆవిర్భవించాయి. ఉమ్మడి [more]

Update: 2020-06-03 15:30 GMT

చరిత్రలో ఆరేళ్లు పెద్ద కాలమేమీ కాదు. కానీ పయనం ఎటువైపు సాగుతుందో తెలుసుకునేందుకు సరిపోతుంది. సుదీర్ఘపోరాటం తర్వాత తెలుగు ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా ఆవిర్భవించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పునర్విభజించి తెలంగాణను సాకారం చేసింది భారత పార్లమెంటు. దక్షిణభారతంలో అతిపెద్ద రాష్ట్రం రెండు పరిపాలన ప్రాంతాలుగా సాధికారికంగా రూపుదాల్చాయి. భావోద్వేగాలు, ప్రజల విశ్వాసాల సంగతి పక్కనపెడితే పాలన సౌలభ్యం దృష్ట్యా ఇది అనివార్యమైన పరిణామమే. దేశంలో తెలుగు వాళ్ల హక్కుల కోసం ఒకే మాటగా రాజకీయ పోరాటం చేసే బలాన్ని కోల్పోయిన మాట వాస్తవం. అయితే అనేక రకాలుగా కలిసొచ్చే అంశాలూ ఉన్నాయి. హిందీ తర్వాత రెండు పెద్ద రాష్ట్రాలలో తెలుగు పరిపాలనభాషగా ఉంటుంది. రెండు రాష్ట్రాల ప్రాతినిధ్యం పార్లమెంటులో కనిపిస్తుంది. ఉమ్మడిగా హక్కుల కోసం పోరాడితే ఢిల్లీలో ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రం చేదోడువాదోడుగా నిలుస్తుంది. తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు ఘనంగానే కనిపిస్తుంది. కానీ ఒక ప్రాంతంపై మరో ప్రాంతం నేతల పెత్తనం , స్వార్థ రాజకీయాలు రాష్ట్రానికి ఒకింత చేటు చేశాయి. అభివృద్ధి విస్తరించడానికి బదులుగా కేంద్రీకృతమైంది. ప్రజల్లో ఏదో నష్టపోతున్నామనే భావన నెలకొంది. అయినప్పటికీ నాయకులు ఉదాసీన ధోరణిని కనబరిచారు. ఢిల్లీ పెద్దల నిర్లక్ష్యం ఫలితంగానే 1970 లలో విభజితం కావాల్సిన రాష్ట్రం మరో నాలుగు దశాబ్దాలు ఉమ్మడి పాలనలో కొనసాగింది. అదంతా చరిత్ర. కానీ రాష్ట్ర విభజన తర్వాత పరిణామాలు చూస్తే దేశానికే ఆదర్శమైన కొన్ని విధానాలను ప్రవేశపెట్టడంలో రెండు రాష్ట్రాలు విజయవంతమయ్యాయి.

ఆదర్శ పథకాలు…

తెలుగు రాష్ట్రాలు విభజన తర్వాత కొన్ని ఆదర్శపథకాలను ప్రవేశపెట్టాయి. తర్వాత కాలంలో వాటిని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాల్సిన అనివార్యత ఏర్పడింది. ముఖ్యంగా తెలంగాణ రైతాంగం చాలా దీనస్థితిని అనుభవించే దశ నుంచి సాగునీటి వనరులను సమర్థంగా వినియోగించుకునే ప్రణాళిక రచన సాకారమైంది. కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి జలసిరులకు ప్రభుత్వం భారీగా వెచ్చించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అయితే లక్షల కోట్ల రూపాయలతో ఈ తరహా ప్రాజెక్టుల నిర్మాణం ఎప్పటికీ సాధ్యమయ్యేది కాదని కచ్చితంగా చెప్పవచ్చు. అలాగే ఆంధ్రప్రాంతంలో ఎన్నో దశాబ్దాల కల అయిన పోలవరానికి ముందడుగు పడింది. దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జలవనరులే ప్రధాన సమస్య కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు భవిష్యత్ తరాలకు అవసరమైన జలవనరులకోసం శాశ్వత పథకాలు చేపట్టడం ఘనవిజయం. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధుకు శ్రీకారం చుట్టారు. ఇదే మోడల్ గా తీసుకుంటూ కేంద్రప్రభుత్వమూ కిసాన్ సమ్మాన్ ను మొదలు పెట్టింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేర్చే వాలంటీర్ల వ్యవస్థలు దేశంలోనే వినూత్న పరిణామంగా చెప్పాలి.

ఆగని పంచాయతీలు…

కలిసి నడిస్తే పరిష్కారం కాని సమస్యలంటూ ఉండవు. కేంద్రప్రభుత్వం ఎన్నికల హడావిడితో సుదీర్ఘమైన కసరత్తు లేకుండానే విభజన చట్టాన్ని మమ అనిపించేసింది. రాజకీయ ప్రయోజనం అందుకోవాలనే యావతో శాస్త్రీయమైన, ఇరుపక్షాలకు సంతృప్తికరమైన తీరులో విభజన చేయలేకపోయింది. ఫలితంగా అనేక రకాలైన సందేహాలు, సమస్యలు మిగిలి పోయాయి. తొమ్మిది, పది షెడ్యూళ్లోని విద్యాసంస్థలు, కార్పొరేషన్ల ఆస్తుల పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉంది. జలవనరుల సమస్య చెప్పనే అక్కర్లేదు. ఇటు టీఆర్ఎస్ అటు టీడీపీ హయాంలో రెండు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిని కల్పించుకున్నాయి. ఫలితంగా రెండు రాష్ట్రాలు నష్టపోయాయి. ఏపీలో వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత ఎన్నడూ లేనంత సుహృద్భావం వెల్లివిరిసింది. ఒకే రాష్ట్రమన్నంతగా ఉమ్మడిగా జలాల వినియోగానికి లక్షల కోట్ల రూపాయలతో సంయుక్తంగా ప్రాజెక్టులు చేపట్టాలని భావించారు. కానీ జల వివాదాలు మళ్లీ తలెత్తాయి. ముఖ్యంగా తెలంగాణలో ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనతో అధికార టీఆర్ఎస్ ఇరకాటంలో పడింది. శ్రీశైలం నుంచి మిగులు వరద జలాలను వాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పోతిరెడ్డి పాడు విస్తరణ ప్రాజెక్టు విభేదాలకు బీజం వేసింది. రాజకీయ ఒత్తిడులతో తెలంగాణ ప్రభుత్వం దీనిపై తీవ్రంగా స్పందించింది. కృష్ణాబోర్డు ద్వారా దీనిని నిలిపివేయించేలా ఆదేశాలు జారీ చేసింది. దీంతో గోదావరి నదీ జలాలపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ సర్కారు ఫిర్యాదు చేసింది. కాళేశ్వరం సహా అన్ని పనులు నిలిపివేయమని తెలంగాణను బోర్డు ఆదేశించింది. ఇవి రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు ఇబ్బందికరమే.

ఆర్థిక కష్టాలు…

ఆర్థికంగా రెండు రాష్ట్రాలు ఇబ్బందికరమైన పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాలతో అవసరానికి మించి సంక్షేమ పథకాలను అమలు చేయడంతో ఖజానాలు దివాళా తీశాయి. విభజన సమయంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి సంత్రుప్తికరంగానే ఉన్నప్పటికీ దీర్ఘకాలిక ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు ఒక్కసారిగా చేపట్టడంతో పరిస్థితి దారుణంగా దెబ్బతింది. సోదర రాష్ట్రంతో ఉద్యోగుల వేతనాల పెంపుదల సహా ఆంధ్రప్రదేశ్ సైతం అమలు చేయాల్సి వచ్చింది. దాంతో పాటు సంక్షేమ పథకాలు తప్పనిసరి అయ్యాయి. ఫలితంగా అప్పుల మొత్తం లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ప్రతి ఏటా 50 వేల కోట్ల రూపాయల పైచిలుకు సంక్షేమ పథకాలపైనే వెచ్చిస్తున్నాయి. జీతభత్యాలు, పాత అప్పులకు వాయిదాలు, ఇతర ఖర్చులు పోను పైసా కూడా మిగిలే స్థితి లేదు. అందువల్ల కొత్తగా మళ్లీ అప్పులకు వెళుతున్నారు. రానున్న అయిదేళ్లలో ప్రభుత్వ ఆదాయం రెట్టింపు కావాలి. లేకపోతే పునర్విభజన తర్వాత రెండు రాష్ట్రాలు చేసిన అప్పులకు వాయిదాలు సైతం చెల్లించలేక చేతులు ఎత్తేయాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండు రాష్ట్రాలకు కలిపి చూస్తే అయిదు లక్షల కోట్ల రూపాయల పైచిలుకు రుణం చేరిపోయింది. పైపెచ్చు రోజురోజుకీ పథకాల సంఖ్యను విస్తరించుకుంటూ పోతున్నారు. దీని ప్రభావం అభివ్రుద్ధి పనులపై పడుతుంది. ఈవిషయంలో మాత్రం తెలుగు రాష్ట్రాలు పునరాలోచన చేసుకోవాలి. సంక్షేమ పథకాలు అర్హులకు మాత్రమే అందేలా చూసుకుంటే కనీసం నలభైశాతం వ్రుథావ్యయాన్ని అరికట్టవచ్చని అంచనా.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News