మెజారిటీ ఎంతనేనా....???

Update: 2018-11-27 16:30 GMT

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధ్నీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఇది నాలుగోసారి. గతంలో మూడుసార్లు ఇక్కడి నుంచి బరిలోకి దిగినప్పటికీ ఈ నియోజకవర్గం పెద్దగా రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించలేదు. కానీ ఈసారి బుధ్నీ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థిగా అరుణ్ యాదవ్ పోటీ చేస్తుండటంతో అందరి చూపూ బుధ్నీ పైనే కేంద్రీకృతమైంది. అరుణ్ యాదవ్ ఆషామాషీ నాయకుడు కాదు. దిగ్విజయ్ సింగ్ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సుభాష్ యాదవ్ కుమారుడే అరుణ్ యాదవ్. 46 సంవత్సరాల యాదవ్ యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పనిచేసిన అనుభవజ్ఞుడు. నిన్న మొన్నటి వరకూ కమల్ నాధ్ వచ్చేవరకూ పీసీసీ సారధిగా రాష్ట్ర కాంగ్రెస్ కు దిశానిర్దేశం చేసేవారు. శివరాజ్ సింగ్ కు ధీటైన ప్రత్యర్థిగా అరుణ్ యాదవ్ రంగంలోకి దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది.

మెజారిటీని చూస్తే......

వాస్తవానికి గత మూడుసార్లు చౌహాన్ కు వచ్చిన మెజారిటీని పరిశీలిస్తే ఈసారి ఆయన గెలుపు నల్లేరు మీద నడకగానే ఉండాలి. 2006లో ముఖ్యమంత్రి పగ్గాలు అందుకునే నాటికి చౌహాన్ లోక్ సభ సభ్యుడు. సీఎం కాగానే జరిగిన ఉప ఎన్నికల్లో 36, 525 ఓట్ల మెజారిటీతో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2008లో మెజారిటీని 41,525 ఓట్లకు పెంచుకున్నారు. 2013లో 84,805 భారీ మెజారిటీతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ మెజారిటీలను చూసిన తర్వాత చౌహాన్ కు ఎదురు లేదని ఎవరైనా భావించడం తప్పుకాదు. కాని మరోసారి పరిస్థితి అనుకున్నంత తేలిగ్గా లేదు. కాంగ్రెస్ అభ్యర్థి అరుణ్ యాదవ్ గట్టి పోటీ ఇస్తుండటంతో చౌహాన్ నియోజకవర్గంపై దృష్టి పెట్టక తప్పడం లేదు. కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా ఆయనను బరిలోకి దించింది. చౌహాన్ సామాజిక వర్గమైన కిరార్ ఓటర్లు ఎంతమంది ఉన్నారో యాదవులు కూడా దాదాపు అంతే సంఖ్యలో ఉన్నారు. నర్మద నదీ తీరం నుంచి ప్రచారాన్ని ప్రారంభించిన అరుణ్ యాదవ్ చౌహాన్ సర్కార్ తీరును ఎక్కడకక్కడ ఎండగడుతున్నారు. ఇసుక మాఫియాకు సీఎం కుటుంబం అండదండలు ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత, పెట్రో, డీజిల్ ధరల పెంపు, జీఎస్టీ వంటి అంశాలు ప్రజలపై వ్యతిరేక ప్రభావం చూపాయని, తద్వారా తాను లబ్ది పొందగలనని యాదవ్ ఆశిస్తున్నారు. జాతీయ స్థాయిలో మసకబారుతున్న మోదీ ప్రతిష్ట, సీబీఐలో లుకలుకలు తదితర అంశాలు తన గెలుపునకు దోహదపడతాయని విశ్వసిస్తున్నారు. నియోజకవర్గ ఓటర్లలో చౌహాన్ సామాజికవర్గానికి చెందిన కిరార్లు 25 వేల మంది ఉండగా, యాదవులు యాభై వేల మంది ఉన్నారు. 22 వేల మంది బ్రాహ్మణులున్నారు. ఈ అంకెలు తనకు అనువుగా ఉణ్నాయని అరుణ్ యాదవ్ అంచనా వేస్తున్నారు.

హాఫ్ చీఫ్ మినిస్టర్ గా.....

వాస్తవానికి బుధ్నా నియోజకవర్గం చౌహాన్ కు కొత్తేమీ కాదు. నియోజకవర్గం అంతా ఆయనకు కొట్టిన పిండి. 1990లోనే ఇక్కడి నుంచి గెలిచారు. తర్వాత లోక్ సభకు వెళ్లిపోయారు. 2003లో మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేసి దిగ్విజయ్ సింగ్ చేతిలో ఓడిపోయారు. అనూహ్యంగా రెండేళ్లు తిరక్కుండానే సీఎం పదవి ఆయనను వరించింది. 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచారు. 2008,2013 ఎన్నికల్లో విజయంతో మరింత పట్టు సాధించారు. అయినప్పటికీ చౌహాన్ ఈసారి ప్రచారంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భార్య సాధనా సింగ్, కుమారుడు కార్తికేయ చౌహాన్ తో పాటు 20 మంది ముఖ్యులను ప్రచారంలోకి దించారు. ముఖ్యంగా సాధానా సింగ్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇంటింటా తిరుగుతున్నారు. భర్త రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో నిమగ్నం కావడంతో ఆమె ఈ బాధ్యతలను చేపట్టారు. ఆమె చాలా ప్రతిభావంతురాలు. నియోజకవర్గంపై త్వరితగతిన పట్టు సాధించారు. భర్త తరుపున వ్యవహారాలు చక్కబెడుతూ అధికార కేంద్రంగా మారారు. కీలక నిర్ణయాలు, అధికారుల బదిలీలు ఆమె కనుసన్నల్లోనే సాగుతాయన్న ఆరోపణలున్నాయి. అందువల్లే కొంతమంది కార్యకర్తలు ఆమెను "హాఫ్ చీఫ్ మినిస్టర్" అని పిలుస్తుంటారు. ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. వారు ఏ సమస్య చెప్పుకున్నా వెంటనే పరిష్కరిస్తారు. ఈ కారణంగానే ఆమెను ప్రజలు "బాబీ" అని అప్యాయంగా పిలుస్తుంటారు.

చౌహాన్ కు తలనొప్పి ఇవే......

గత మూడు దఫాలుగా చౌహాన్ మెజారిటీ పెరుగుతూ వస్తోంది. ఈసారి లక్ష మెజారిటీ సాధిస్తామని సాధనాసింగ్ చెబుతున్నారు. కానీ అంత తేలిక కాదన్న సంగతిని క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియజేస్తున్నాయి. పల్లెల్లో తాగునీటి సమస్య, పి.హెచ్.సి.ల్లో వైద్యుల కొరత, నర్మద నుంచి నీటిని అన్ని ప్రాంతాలకు అందచేయకపోవడం, మద్దతు ధరలు లేకపోవడం, నర్మదా నదీ తీరప్రాంతంలో ఇసుక మాఫియా తదితర అంశాలు చౌహాన్ కు తలనొప్పిగా మారాయి. ఇవి ఎన్నికల్లో ప్రభావం చూపుతాయన్న ఆందోళన నెలకొంది. దీని ప్రభావం ఇప్పటికే తెలుస్తోంది. ప్రచారానికి వెళ్లిన సాధనా సింగ్ తదితరులను ప్రజలు నిలదీస్తున్నారు. మొత్తానికి కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ విజయానికి ఢోకా లేదన్నది విశ్లేషకుల అంచనా. మెజారిటీ తగ్గవచ్చు కాని గెలుపు తథ్యమన్నది పార్టీ ధీమాగా కనపడుతోంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News