చౌహాన్ చిక్కకుండా ఉండేందుకేనా.....?

Update: 2018-10-31 16:30 GMT

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు పార్టీలో ప్రత్యేక స్థానం ఉంది. భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండోనేతగా ఆయన చరిత్ర సృష్టించారు. మొదటి నాయకుడు ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్. ాయన 2003 నుంచి ఇప్పటి వరకూ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ 13 ఏళ్ల నుంచి ఈ అత్యున్నత పదవిలో కొనసాగుతున్నారు. 1993 నుంచి 2003 వరకూ దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో దశాబ్దం పాటు కాంగ్రెస్ పాలించింది. 2003 ఎన్నికల్లో సింగ్ సారథ్యంలో ఎన్నికలకు వెళ్లిన హస్తం పార్టీ చతికల పడింది. నాటి ఎన్నికల్లో విజయఢంకా మోగించిన భారతీయ జనతా పార్టీ, దేశంలో రెండో అతిపెద్ద రాష్ట్రమైన (వైశాల్యంలో) మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఫైర్ బ్రాండ్ మహిళానేత ఉమా భారతిని నియమించింది. కర్ణాటకలో జాతీయ జెండా ఎగురవేత కేసులో కోర్టు ఆమెపై వ్యాఖ్యలు చేయడంతో పదవి నుంచి ఆమె వైదొలిగారు. ఆ తర్వాత బాబూలాల్ గౌర్ ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీలో అంతర్గత పరిస్థితుల కారణంగా గౌర్ కూడా రాజీనామా చేశారు.

అంతర్గత పరిస్థితుల వల్ల......

అనూహ్య పరిస్థితుల్లో అప్పటి వరకూ ఎంపీగా ఉన్న చౌహాన్ కు పార్టీ ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. 2009 నవంబరు 25న కొత్త బాధ్యతలను చేపట్టిన చౌహాన్ కు అప్పటి నుంచి వెనుదిరిగి చూసే పరిస్థితి కలగలేదు. ఢిల్లీ పార్టీ పెద్దలకు ఆయన మాట వేదవాక్కుగా నిలిచింది. రాష్ట్ర పార్టీ శ్రేణుకలు ఆయన మాట శిలాశాసనంగా మారింది. సత్పరిపాలన అందించడం ద్వారా పార్టీపై, ప్రభుత్వంపై పట్టు సాధించారు. అనంతరం 2008, 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించి తన నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు. 2009, 2014 లోక్ సభ ఎన్నికల్లో సైతం మెజారిటీ సీట్లను గెలిపిించి పార్టీ పెద్దల దృష్టిలో పడ్డారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 29 స్థానాలకు గాను 27 స్థానాలు పార్టీ ఖాతాలో పడటానికి చౌహాన్ కృషే కారణమని చెప్పకతప్పదు. కేవలంల కమలనాధ్ (బింద్వారా), జ్యోతిరాదిత్య సింధియా (గుణ) మాత్రమే నాటి ఎన్నికల్లో గెలిచారు.

రెండు స్థానాల నుంచి......

ఇంతటి విస్తృత చరిత్ర, ఘనమైన నేపథ్యం కలిగిన చౌహాన్ తాజాగా రెండు స్థానాల నుంచి బరిలోకి దిగడం ఆసక్తికర పరిణామం. ఈ నిర్ణయానికి గల కారణాలేమిటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. భుద్ని, విదీష స్థానాల నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. బుధ్నీ సిట్టింగ్ స్థానం. విదీష నుంచి గతంలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. విదీష్ చౌహాన్ స్వస్థలం. 1991 నుంచి 2005 వరకూ ఈ నియోజకవర్గం ఎంపీగా ఉన్నారు. బుధ్నీలో చౌహాన్ మొదటి నుంచి బంపర్ మెజారిటీతో ఎన్నికవుతున్నారు. ఎంపీగా ఉంటూ సీఎం కావడంతో చౌహాన్ 2006 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ కుమార్ పటేల్ ను 36,525 ఓట్ల మెజారిటీతో ఓడించారు. 2008 లో కాంగ్రెస్ అభ్యర్థి మహేంద్ర సింగ్ చౌహాన్ పై 84,805 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2013లో కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ సింగ్ రాజపుత్ పై 41,525 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెెస్ అభ్యర్థి చౌహాన్ ను ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎదుర్కొంటున్నారు. ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప శివరాజ్ ను నిలువరించడం హస్తం పార్టీకి అసాధ్యం. కాంగ్రెస్ గాని, ప్రభుత్వం వ్యతిరేక ప్రభంజనం వీస్తే తప్ప ఇక్కడ కమలం పార్టీని అడ్డుకోవడం కష్టం. సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం, ప్రభుత్వ వ్యతిరేకత, మసక బారుతున్న మోదీ ప్రభావం, పెట్రోలు, డీజిల్ ధరల పెంపు వంటి అంశాలు ప్రభావితం చేస్తాయేమోనన్న ఆందోళన అంతర్గతంగా లేకపోలేదు. అందుకనే శివరాజ్ సింగ్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారన్న వాదనను రాజకీయ విశ్లేషకులు వినిపిస్తున్నారు. అదే సమయంలో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి బలహీన నాయకుడని, ఆ పార్టీ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించడం గమనార్హం.

కొత్తేమీ కాకపోయినా......

ఇక విదీష్ చౌహాన్ కు కొత్తేమీ కాదు. ఆయన సొంత నియోజకవర్గం. ఇక్కడి నుంచి దాదాపు పదిహేనేళ్ల పాటు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. విదీష సిట్టింగ్ ఎమ్మెల్యే కల్యాణ్ సింగ్ ఠాకూర్. 239 పోలింగ్ బూత్ లు గల నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,90,472 మంది. గత ఎన్నికలలో పోటీ చేసి 16,966 ఓట్లతో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి శశాంక్ భార్గవ మళ్లీ అదే పార్టీ అభ్యర్థిగా ప్రస్తుతం బరిలో దిగారు. గతంలో తక్కువ తేడాతో ఓడిపోయానని, ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీ ఐక్యంగా పనిచేస్తుండటంతో విజయం తమదేనన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయంతోనే శివరాజ్ సింగ్ చౌహాన్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారని శశాంక్ ధ్వజమెత్తుతున్నారు. సిమోర్ జిల్లాలోని బుధ్ని చౌహాన్ సొంత నియోజకవర్గం కాదు. విదీష స్వస్థలం. పరిస్థితులు ప్రతికూలంగా మారినా సొంత నియోజకవర్గంలో ఏదో రకంగా ఒడ్డున పడతానన్న నమ్మకంతో చౌహాన్ విదీషను ఎంచుకున్నారన్న వాదన విన్పిస్తోంది. ఏది ఏమైనా రెండు చోట్ల పోటీ చౌహాన్ వంటి దిగ్గజ నాయకుడి ప్రతిష్ట పెంచదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయానికి గల తెరవెనక కారణాలేమిటో కాలం గడిచే కొద్దీ వెలుగులోకి రాకమానవు. ప్రస్తుతానికి అయితే రెండు చోట్ల విజయం ఖాయమన్న ధీమాను కమలనాధులు వ్యక్తం చేస్తున్నారు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News