అక్కడ అది చేయగలిగితే… ఎదురులేదటగా

ఆరు నెలలు కొంత ఉపశమనం లభించినప్పటికీ, ఆరు నెలల్లోనే తన బలమేంటో నిరూపించుకోవాల్సిన అవసరం శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఉంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ [more]

Update: 2020-03-31 17:30 GMT

ఆరు నెలలు కొంత ఉపశమనం లభించినప్పటికీ, ఆరు నెలల్లోనే తన బలమేంటో నిరూపించుకోవాల్సిన అవసరం శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఉంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన శాసనసభ లో బలపరీక్షలో కూడా నెగ్గారు. దీంతో మరో ఆరు నెలల పాటు శివరాజ్ సింగ్ చౌహన్ కు ఇబ్బందులు ఏమీ లేనట్లే. అయితే ఆరునెలల్లో జరగబోయే ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా పది సీట్లను ఆయన గెలుచుకోవాల్సి ఉంటుంది.

ఇప్పటికే బలం పెంచుకుని….

మధ్యప్రదేశ్ లో బీజేపీకి 107 మంది సభ్యుల బలం ఉంది. దీనికి తోడు ఐదుగురు ఇతర పార్టీల సభ్యులు మద్దతు తెలిపారు. వారిలో బహుజస్ సమాజ్ పార్టీకి చెందిన ఇద్దరు, సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఒకరు, ఇద్దరు స్వతంత్ర సభ్యులు ఉన్నారు. అంటే 112 సభ్యుల మద్దతు బీజేపీకి ఇప్పటికే ఉంది. మొత్తం 230 సభ్యులు మధ్యప్రదేశ్ లో ఉన్నారు. 25 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే కనీసం ఐదు స్థానాలు గెలుచుకోవడం శివరాజ్ సింగ్ చౌహాన్ ముందున్న లక్ష్యం.

ఆ 22 చోట్ల…..

ఇవన్నీ దాదాపు కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానాలే. 22 మంది కాంగ్రెస్ సభ్యులు రాజీనామా చేయడంతో ఆ స్థానాల్లోనే తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారు. అంతేకాకుండా రాజీనామా చేసిన వారికే తిరిగి ఉప ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో పార్టీలో అసంతృప్తి లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గత ఎన్నికలలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.

వీరిని సంతృప్తి పర్చగలిగతే….?

అయితే ఈ 22 నియోజకవర్గాల్లో బీజేపీ నేతలతో ముందుగా శివరాజ్ సింగ్ చౌహన్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి జ్యోతిరాదిత్య సింధియా కూడా హాజరవుతారని చెబుతున్నారు. వీరిని సంతృప్తి పర్చ గలిగితే 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం నల్లేరు మీద నడకే అవుతుందని చౌహాన్ భావిస్తున్నారు. ఇందుకోసం సీనియర్ నేతల సాయం కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద 22 నియోజకవర్గాల్లో బీజేపీ నేతల్లో ఉన్న అసంతృప్తిని తొలగించడమే ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహన్ ముందున్న లక్ష్యం.

Tags:    

Similar News