మహారాజ్ మళ్లీ…!

మధ్యప్రదేశ్ లో మామాగా మహరాజ్ గా పిలుచుకునే శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్ప కూలిపోతుందని తెలిశాక శివరాజ్ [more]

Update: 2020-03-24 17:30 GMT

మధ్యప్రదేశ్ లో మామాగా మహరాజ్ గా పిలుచుకునే శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్ప కూలిపోతుందని తెలిశాక శివరాజ్ సింగ్ చౌహాన్ పేరే ఎక్కువగా విన్పించింది. అయితే ఎక్కడో అనుమానం. మోడీ, షాలు మరో నేతను ముఖ్యమంత్రిగా నిర్ణయిస్తారని వార్తలు వచ్చాయి. ప్రధానంగా కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాలకు స్వస్తి చెప్పి బీజేపీ కేంద్ర నాయకత్వం తిరిగి శివరాజ్ సింగ్ చౌహాన్ కే మధ్యప్రదేశ్ పగ్గాలు అప్పగించింది.

నాలుగో సారి…..

61ఏళ్ల వయసున్న శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగోసారి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2005 నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకూ ఆయనే మధ్యప్రదేశ్ సీఎగా వ్యవహరించారు. బీజేపీలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండో నేత శివరాజ్ సింగ్ చౌహాన్. ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రిగా రమణ్ సింగ్ పదిహేనేళ్లు పనిచేశారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రికార్డును అధిగమిస్తారు.

గత ఎన్నికల్లోనూ….

నిజానికి 2018 ఎన్నికల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లిన బీజేపీ నైతికంగా ఓటమి చెందలేదనే చెప్పాలి. 107 స్థానాలతో కాంగ్రెస్ కు బలమైన పోటీ ఇచ్చింది. పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీకి అన్ని సీట్లు రావడానికి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వమే కారణమని చెప్పాలి. ఆయనపై వ్యతిరేకత ఇప్పటికీ ప్రజల్లో లేదని బీజేపీ నేతలు సయితం అంగీకరిస్తారు. ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతతోనే 7 సీట్ల తేడాతో గత ఎన్నికల్లో అధికారం కోల్పోవాల్సి వచ్చింది.

ఉప ఎన్నికల్లో గెలిస్తేనే?

ఇక కాంగ్రెస్ కు కూడా అరకొర సీట్లు వచ్చినా తన ప్రభుత్వాన్ని కాపాడుకోలేకపోయింది. ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక్కరే ప్రమాణస్వీకారం చేశారు. అంతకు ముందు ఆయన బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికయ్యారు. మరి కొద్దిరోజుల్లోనే శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశముది. దీంతో పాటు త్వరలో జరిగే 25 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు శివరాజ్ సింగ్ చౌహాన్ కు పరీక్షగా నిలవనున్నాయి. వీటిలో మెజారిటీ స్థానాలు సాధిస్తేనే బీజేపీ ప్రభుత్వం మనుగడ సాధ్యమవుతుంది. లేకుంటే ఆరు నెలల్లోనే మళ్లీ కాంగ్రెస్ కు అధికారం అప్పగించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News