కొర్రీ వేయడంతో…?

గత 25 రోజుల నుంచి సాగుతున్న మహారాష్ట్ర రాజకీయాలకు ఎండ్ పడనుంది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. నిజానికి ఈరోజే ముఖ్యమంత్రిగా [more]

Update: 2019-11-17 17:30 GMT

గత 25 రోజుల నుంచి సాగుతున్న మహారాష్ట్ర రాజకీయాలకు ఎండ్ పడనుంది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. నిజానికి ఈరోజే ముఖ్యమంత్రిగా శివసేన ప్రమాణస్వీకారం చేయాలనుకున్నారు. కానీ శరద్ పవార్ మెలిక పెట్టడంతో ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. మరో నాలుగు రోజుల సమయం పట్టే అవకాశముంది. ఇప్పటికైతే శివసేన ప్రభుత్వానికి మద్దతివ్వాలని కాంగ్రెస్, ఎన్సీపీలు నిర్ణయించుకున్నాయి.

ఉమ్మడి ప్రణాళికతో…..

కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు కలసి ఉమ్మడి ప్రణాళికను కూడా రూపొందించుకున్నాయి. దాదాపు 45 అంశాలతో కూడిన ఉమ్మడి ప్రణాళికను కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు అంగీకరించాయి. అయితే శరద్ పవార్ తాను సోనియాతో సమావేశం అయిన తర్వాతనే ప్రభుత్వ ఏర్పాటుపై క్లారిటీ ఇస్తామని మెలిక పెట్టారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ శివసేనతో ముందుగానే కుదుర్చుకోవాల్సిన ఒప్పందాలను ఖరారు చేసుకోవాల్సి ఉంది.

ఆదిత్య థాక్రేకు నో…..

తొలుత శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాలనుకున్నారు. కానీ ఎన్సీపీ, కాంగ్రెస్ లు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. నిన్న గాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన ఆదిత్య థాక్రేను ముఖ్యమంత్రిగా చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని రెండు పార్టీలు భావిస్తున్నాయి. శివసేకు కూడా ఇది మంచిది కాదని సూచిస్తున్నాయి. కుమారుడి కోసమే ఉద్ధవ్ థాక్రే బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారన్న అపవాదును ఎదుర్కొనాల్సి ఉంటుంది.

ఉద్ధవ్ స్వీకరిస్తారా…?

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆదిత్య థాక్రే వర్లి నియోజవర్గం నుంచి గెలిచిన సంగతి తెలిసిందే. ఆదిత్య థాక్రే ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి రెండు పార్టీలు అంగీకరించకపోవడంతో ఉద్ధవ్ థాక్రే ఆ పదవి చేపట్టేందుకు ముందుకు వచ్చారని తెలిసింది. అయితే ఆయన ఏ సభలో సభ్యుడు కాదు. ఎమ్మెల్సీ లేదా ఏదైనా ఎమ్మెల్యే స్థానాన్ని ఖాళీ చేయించి ఉప ఎన్నికల్లో పోటీ చేయించాల్సి ఉంది. ఆరు నెలల సమయం ఉండటంతో ఇది పెద్ద కష్టమేమీ కాదని శివసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ పదవిని ఉద్ధవ్ థాక్రే చేపడతారా? మరెవరైనా సీనియర్ నేతకు అప్పగిస్తారా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News