పెద్దన్నల పంతాలు....సిరియాలో మరణాలు

Update: 2018-04-15 17:30 GMT

పశ్చిమాసియా దేశమైన సిరియా ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఒకప్పటి ఆప్ఘనిస్థాన్ గుర్తుకు రాకమానదు. ఇప్పుడు సిరియా మాదిరిగానే ఏడో దశకంలో ఆప్ఘాన్ అగ్రరాజ్యాల పరోక్ష యుద్ధానికి సమిధగా మారింది. నాటి సోవియట్ యూనియన్, అమెరికాల మధ్య ఆసియా దేశంపై పట్టు కోసం దశాబ్దాల పాటు పోరాడాయి. ఆ ప్రయత్నం విజయవంతం కాగపోగా ఆప్ఫాన్ శిధిలావస్థకు చేరింది. ఇప్పటికీ దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లుతోంది. శాంతి కనుచూపుమేరలో కనపడటం లేదు. భవిష్యత్తుపై భరోసా ప్రజలకు కలగడం లేదు. ఇప్పటికీ అక్కడ వేల సంఖ్యలో అమెరికన్ సేనలు తిష్టవేసినా పరిస్థితుల్లో మార్పు లేదు. అంతర్జాతీయ సమాజం ఆర్థికంగా ఎంత సాయం చేస్తున్నా కనుచూపు మేరలో కోలుకునే పరిస్థితి కనపడటం లేదు. ఇప్పటికీ సంక్షోభంలోనే కొట్టుమిట్టాడుతోంది.

అమాయకుల ప్రాణాలు.....

సిరియా కూడా ఇందుకు భిన్నం కాదు. 2012 నుంచి కొనసాగుతున్న అంతర్యుద్ధం వల్ల దేశం చిక్కి శల్యమైంది. నిరంతర దాడులు, ప్రతి దాడులతో దద్దరిల్లుతోంది. అమాయక పౌరులు, చిన్నారులు పెద్దసంఖ్యలో హతులవుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక, అనుకూల దళాల మధ్య పోరు నిరంతరం కొనసాగుతోంది. ప్రజలు కొంపా గోడు వదిలి...తట్టాబుట్టా సర్దుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొరుగుదేశాలకు వలస పోతున్నారు. సిరియా సమస్యకు కారణాలు అనేకం. ఒక్కసారి చరిత్రలోకి తొంగిచూస్తే ఆధిపత్య పోరాటమే అసలు సమస్యకు కు కారణమని అర్థమవుతోంది. మొదటి నుంచి సిరియా ఒకప్పటి సోవియట్ యూనియన్ (ప్రస్తుత రష్యా) గూటి పక్షే. అమెరికా వ్యతిరేకి. ఇప్పటికీ అదే పరిస్థితి.

షియా వర్సెస్ సున్నీలు....

టర్కీ, లెబనాన్, జోర్డాన్ సరిహద్దులుగా గల ఈ చిన్న దేశంలో 75 శాతం ప్రజలు సున్నీలు. 12 శాతం మంది షియాలు. మిగిలిన వారిలో క్రైస్తవువులు, ఇతరులు ఉన్నారు. మైనార్టీలైన షియాలదే ఆధిపత్యం. అధ్యక్షుడు బహర్ అల్ అసద్, ప్రభుత్వం, సైన్యంలోని కీలక వ్యక్తులు షియాలే. షియాలను గద్దెదించేందుకు సున్నీలు పోరాడుతున్నారు. వారికి పరోక్షంగా అమెరికా అండదండలు అందిస్తోంది. అమెరికాకు బ్రిటన్, ఫ్యాన్స్ వంతపాడటం సహజమే. తాజా దాడుల్లో బ్రిటన్, ఫ్రాన్స్ కూడా పాల్గొన్నాయి. వీటికి తోడు సున్నీ రాజ్య స్థాపన కోసం పోరాడుతున్న ఐఎస్ఐఎస్ (ఐసిస్) అసద్ ను గద్దె దించాలన్న పట్టుదలతో ఉంది. అమరికా కూటమికి సౌదీ అరేబియా వంటి సున్నీ దేశాల మద్దతు ఉంది. అధ్యక్షుడు అసద్ కు షియా దేశమైన ఇరాన్ అండ ఉంది. ఇక రష్యా సంగతి సరే సరి. ఇంతకాలం ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో సిరియా తరుపున రష్యా తన వీటో హక్కుతో అమెరికాను అనేక సార్లు అడ్డుకుంది. సిరియా వ్యతిరేకులను అడ్డుకునేందుకు ఆ దేశానికి రష్యా పలు విధాలుగా సాయం అందిస్తోంది. ఆర్థిక వనరుల దగ్గర నుంచి సైనిక పరంగా చేయూతనందిస్తోంది. రష్యా లేకపోతే అసద్ ప్రభుత్వం ఎప్పుడో పతనమై పోయి ఉండేది.

నాలుగు లక్షల మంది మరణించారని.....

తాజా దాడులకు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ చెబుతున్న కారణం ఒకే ఒక్కటి. అది రాజధాని డమాస్కస్ శివార్లలోని డౌమా పట్టణంపై సిరియా సర్కార్ రసాయన దాడులకు పాల్పడటం. విషతుల్యమైన రసాయనిక ఆయుధాలను వాడటం నేరమని పశ్చిమ దేశాలు పేర్కొంటున్నాయి. కానీ ఈ దేశాలు పరోక్షంగా సాగిస్తున్న పోరువల్ల ఏళ్ల తరబడి ఎంతో మంది అమాయకులు బలవుతున్నారు. వాటి గురించి ఇవి మాట్లాడవు. అదే విధంగా సిరియా శరణార్థుల విషయంలో ఎంతమాత్రం జాలి చూపని ఈ దేశాలు అక్కడి ప్రజల గురించి మాట్లాడటం ఆశ్చర్యం కల్గిస్తుంది. స్వదేశంలో వ్యక్తమవుతున్న ప్రజా వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడులకు తెగబడ్డాడన్నది అంతర్జాతీయ విశ్లేషకుల అంచనా. ఏళ్ల తరబడి కొనసాగుతున్న అంతర్యుద్ధం వల్ల జరిగిన జన హననం, ప్రజల ఇబ్బందులు చూస్తే గుండె తరుక్కుపోతుంది. అంతర్యుద్ధంలో ఇప్పటి వరకూ నాలుగు లక్షల మంది అభాగ్యులు మరణించారని అంచనా. కొందరు చిత్రహింసలతో, మరికొందరు ఆకలి బాధలతో, ఇంకొందరు సరైన చికిత్స అందక కన్నుమూశారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం అరెస్ట్ చేసిన 75 వేల మంది పౌరుల ఆచూకీ తెలియడం లేదు. సంక్షోభం మూలంగా 56 లక్షల మంది వలస వెళ్లారని ఐరాస మానవహక్కుల కమిషనర్ చెబుతున్నారు. ప్రతి గంటకూ 50 కుటుంబాలు వలస వెళ్లుతున్నాయని అంచనా. కాల్పుల విరమణ పాటించాలన్న ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ పిలుపును పట్టించుకునే వారే లేరు. పెద్దదేశాల పంతాలు, పట్టింపుల ముందు పేద దేశాల ప్రజల గోడు ఏపాటిది? వారిగోడును, బాధను ఆలకించేదెవరు?

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News