సింహాచలం భూముల కధ తేల్చేస్తారా..?

సింహాచలం భూముల వివాదం ఈనాటిది కాదు, పాతికేళ్ళ పై చిలుకు కధ దాని వెనక ఉంది. సింహాచలం దేవస్థానానికి వేలాది ఎకరాలు భూములు దాతలు ఇచ్చినవి ఉన్నాయి. [more]

Update: 2020-11-16 00:30 GMT

సింహాచలం భూముల వివాదం ఈనాటిది కాదు, పాతికేళ్ళ పై చిలుకు కధ దాని వెనక ఉంది. సింహాచలం దేవస్థానానికి వేలాది ఎకరాలు భూములు దాతలు ఇచ్చినవి ఉన్నాయి. ఒకపుడు అయితే వీటి సంగతి ఎవరికీ పట్టలేదు కానీ పెరుగుతున్న సిటీతో పాటు నడి మధ్యకు దేవాలయ భూములు కూడా వచ్చేశాయి. పైగా మెట్రో సిటీ గుర్తింపు ఉంది. దాంతో గజం వేలల్లో పలుకుతోంది. ఈ పరిణామాలతో సింహాచలం భూముల మీద పెద్దల కన్ను పడింది. రాజకీయ నాయకులు, కబ్జాదారులు, పలుకుబడి కలిగిన వారంతా కన్ను వేశారు. వీరి మధ్యలో పేదలు, మధ్యతరగతి వర్గాలు చిక్కుకుని విలవిలలాడుతున్నారు.

మోసపోయారా…?

సింహాచలం భూములకు పట్టాలు లేకుండా కొందరు దళారీలు మధ్యతరగతి వర్గాలకు ఒకపుడు చవకగా అమ్మేశారు. దాంట్లో ఇల్లు కట్టుకుని కాపురం ఉంటున్న వారంతా ఉద్యోగ జీవులు, వేతన జీవులు. ఇక వామపక్షాలు దేవుడి భూముల్లో పేదలకు ఇళ్ళు కావాలంటూ ఆందోళన చేశాయి. ఆ విధంగా చాలా మందికి అక్కడ జాగాలు ఇప్పించాయి కూడా అయితే వీటి మీద దేవస్థానం పెద్దలు కోర్టుకు వెళ్లడంతో అది వివాదమైంది. ఒక లెక్కన చూసుకుంటే సింహాచలం భూముల మీద వివిధ కోర్టుల్లో దాదాపుగా 1200 కేసులు ఉన్నాయి. ఇంత పెద్ద వివాదం ఉన్న భూములు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడా లేవంటే నమ్మాల్సిందే.

చిత్తశుధ్ధి ఉందా…?

ఇప్పటికి చంద్రబాబు మూడు సార్లు, వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి అంతా ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఏడాదిన్నరగా జగన్ సీఎం గా ఉంటున్నారు. అందరూ విశాఖ వచ్చినపుడు చెప్పే మాట ఒక్కటే సింహాచలం భూముల సంగతి తేల్చేస్తామని. చంద్రబాబు అయితే అప్పట్లో అంటే ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉన్నపుడు భూముల క్రమబద్ధీకరణకు జీవో ఇచ్చినా కొందరు కోర్టుకు వెళ్ళడంతో అది ఆగిపోయింది. ఇక విభజన ఏపీకి ఆయన సీఎంగా వచ్చిన వెంటనే విశాఖలో తొలి క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. అందులో సింహాచలం భూముల విషయం గురించి తీర్మానం చేశారు. వంద రోజుల్లో పరిష్కారం చూపుతామంటూనే అయిదేళ్ళూ గడిపేసారు. వైఎస్ హయాంలో కూడా పరిష్కారం చూపాలనుకున్నా కోర్టు కేసులే అడ్డం వచ్చాయని చెబుతారు.

కమిటీల వేసి మరీ …

ఇక జగన్ సీఎం కాగానే మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటు చాలా మంది ప్రజా ప్రతినిధులు, ఇతర ఉన్నత అధికారులతో కమిటీని వేశారు. ఏడాది గడిచింది. ఇపుడు ఆ కమిటీలో విజయసాయిరెడ్డి పేరు కూడా చేర్చారు. మరి ఈ కమిటీ అయినా అధ్యయనం చేసి పరిష్కారం చూపుతుందా అన్నది ఆసక్తిగా బాధిత జనం చూస్తున్నారు. మరో వైపు ఇదేదో తేలిపోతే దేవస్థానం తన భూములను కాపాడుకోవడమే లీజుకు ఇవ్వడం ద్వారా ఆదాయం గడించడమో చేస్తుందని అంటున్నారు. అయితే వైసీపీ సీరియస్ గానే ఈ విషయంలో ఉందని అంటున్నారు. విశాఖ రాజధానిగా ప్రకటించిన వైసీపీకి ఈ భూముల కధను తేల్చడం చాలా ముఖ్యం. అవసరం అయితే ప్రభుత్వ కార్యకలాపాలకు కూడా కొంత భూమిని తీసుకుంటారని అంటున్నారు. దానికి తోడు భూముల మీద కోర్టుకు వెళ్ళిన స్వామీజీ స్వరూపానంద కూదా జగన్ కి అనుకూలంగా ఉంటారని పేరు. దాంతో తొందరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని మంత్రి అవంతి శ్రీనివాస్ అంటున్నారు. అదే కనుక జరితే వైసీపీ అతి పెద్ద విజయం సాధించినట్లే మరి.

Tags:    

Similar News