అప్పన్న భూములలో అందరి హ్యాండూ..?

సింహాచలం మహా పుణ్య క్షేత్రం అని మహాకవి ఆధ్యాత్మిక భావనలతో పాట ఒకటి రాశారు. భక్తులు కూడా తన వద్ద ఉన్న సర్వస్వం ఒలిచి స్వామికి అర్పించుకుంటారు. [more]

Update: 2021-09-16 09:30 GMT

సింహాచలం మహా పుణ్య క్షేత్రం అని మహాకవి ఆధ్యాత్మిక భావనలతో పాట ఒకటి రాశారు. భక్తులు కూడా తన వద్ద ఉన్న సర్వస్వం ఒలిచి స్వామికి అర్పించుకుంటారు. ఎన్నో మొక్కులు తీర్చుకుంటారు. అలాంటి స్వామి వారి ఆలయానికి విజయనగరం రాజులు ధర్మకర్తలుగా ఉంటూ వేలాది ఎకరాల భూములు కైంకర్యాల కోసం గతంలో ఇచ్చారు, దాతలు కూడా అలాగే వితరణ చేశారు. అయితే వాటికి అప్పట్లో రికార్డులు సరిగ్గా లేక చాలా భూములు ఆక్రమణకు గురి అయ్యాయి. దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చాక కూడా భూములు ఆక్రమణలకు గురి కావడం ఆశ్చర్యంగానే ఉంది. అప్పన్న భూములు మటుమాయం అయ్యాయని అధికార వైసీపీనే కాదు, విపక్ష టీడీపీ కూడా అంటోంది. ఏకంగా మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ హోదాలో ఉన్న అశోక్ గజపతిరాజు కూడా సింహాచలం భూముల మీద అధికార పార్టీ కన్ను పడిందని చెబుతున్నారు.

గందరగోళమే …

అప్పన భూములు ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో ఈ రోజుకూ సరైన లెక్క లేదు. పదహారు వందల ఎకరాలు అంటారు. అది కాస్తా పదకొండు వందల ఎకరాల దాకా రికార్డులలో ఉందని అంటారు. మరి ఇందులో నుంచి 846 ఎకరాల భూములు మాయం కావడం అంటే ఎవరి పుణ్యమని ఆస్తిక జనుల నుంచే కాదు బాధ్యత ఉన్న పౌరుల నుంచి కూడా వస్తుంది. వైసీపీ టీడీపీ పెద్దలు ఈ రోజుకూ నిజాలు చెప్పకుండా ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకుంటూ మీరు దోషి అంటే మీరు దొంగ అని తిట్టుకుంటూనే కాలక్షేపం చేస్తున్నారు. ఇందులో ఫక్తు రాజకీయమే తప్ప సింహాచలం భూముల పరిరక్షణ అన్నది ఉందా అంటున్నారు. అశోక్ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా ఉండగానే వందలాది ఎకరాలు మాయం అయ్యాయి కాబట్టి బాధ్యుడు ఆయనే అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారు. మరి చేతిలో అధికారం ఉంది కదా మీరే అసలైన దోషులను బయటపెట్టండి అంటున్నాయి ఇతర విపక్షాలు, ప్రజా సంఘాలు.

మటు మాయం వెనక ?

సింహాచలం భూములకు కాళ్ళూ చేతులు లేవు. కబ్జాదారులే వాటిని కాటేస్తారు. అలా కనుక చూసుకుంటే ఎవరు అధికారంలో ఉంటే వారికి చెందిన మనుషులే భూములను చాప చుట్టేశారు అన్నది స్థానికుల మాటగా ఉంది. ఇక్కడ ఎవరూ పతిత్తులు కారు, ఎవరికీ పాప భీతి కూడా లేదు. అవకాశమే వారిని అలా ప్రేరేపిస్తోంది అని అంటున్నారు. ఒకప్పుడు అప్పన్న భూములు ఎక్కడో దూరంగా ఉండేవి. కానీ ఇపుడు నగరం విస్తరించింది. దాంతో నడిబొడ్డుకు వచ్చేశాయి. పైగా భూముల ధరలు కూడా ఒక్కసారిగా పెరిగిపోవడంతో సెంటీమీటర్ స్థలం కూడా కబ్జాకు గురి అవుతోంది. మరి సింహాచలం కొండ చుట్టూతా విశాలంగా పరచుకున్న బంగారం లాంటి అప్పన్న భూములను ఊరకే వదిలేయగలరా. అందుకే అందరూ కలిసే కబ్జా చేశారని అంటున్నారు.

చిత్తశుద్ధి ఉంటే …?

ఇక్కడ వైసీపీ ప్రభుత్వానిదీ, మాన్సాస్ ట్రస్ట్ దీ ఒక్కటే మాట. అప్పన్న భూములు కాపాడాలని, దోషులకు కఠిన శిక్ష పడాలని, ఆ విషయంలో విజయసాయిరెడ్డి, అశోక్ ఒకే మాట మీద ఉన్నారు. కానీ ఈ ఇద్దరు నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. అశోక్ ను అధర్మకర్తని విజయసాయిరెడ్డి అంటే జైలుకెళ్ళొచ్చి బెయిల్ మీద ఉన్న వారు కూడా నీతులు చెబుతున్నారు అంటూ అశోక్ సెటైర్లు వేస్తున్నారు. చూడబోతే సింహాచలం భూముల వ్యవహారం పూర్తిగా రాజకీయ విమర్శలకే పరిమితం అవుతోంది. ఎందరో దాతలు ఇచ్చిన భూములను కాపాడల్సిన ధర్మకర్తలే చేతులెత్తేస్తే మరిన్ని కబ్జాలతో అప్పన్న ఆలయం చిక్కిపోక తప్పదని భక్తులు అంటున్నారు. నాడు టీడీపీ వెనక ఉన్న శక్తులు నేడు వైసీపీ వెనక ఉన్నాయి. అందువల్ల దోషులు తప్పించుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా కామందులే తెర వెనక ఉన్న అసలు దోషులు అంటున్నారు. మరి వారికి అండదండలుగా ఉన్న రాజకీయ కామందుల సంగతేంటి. అందువల్ల ఈ రోజుకైనా చిత్తశుద్ధితో అప్పన్న భూములను పరిరక్షిస్తేనే ప్రజలు మెచ్చుకుంటారు తప్ప ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటే హర్షించరు అన్నదే నిజం.

Tags:    

Similar News