శిల్పాకు అలా కలసివస్తుందంతే?

వైసీపీ నేత శిల్పా కుటుంబానికి ప్రస్తుతం రాజకీయాలు కలసి వస్తున్నట్లే కన్పిస్తున్నాయి. నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ మరింత బలహీనం కావడమే ఇందుకు కారణం. శిల్పా రవిచంద్రారెడ్డి ఇప్పుడు [more]

Update: 2021-02-01 03:30 GMT

వైసీపీ నేత శిల్పా కుటుంబానికి ప్రస్తుతం రాజకీయాలు కలసి వస్తున్నట్లే కన్పిస్తున్నాయి. నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ మరింత బలహీనం కావడమే ఇందుకు కారణం. శిల్పా రవిచంద్రారెడ్డి ఇప్పుడు నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తన పని తాను చేసుకుపోతున్నారు. భూమా కుటుంబం వివాదంలో చిక్కుకోవడం శిల్పా రవిచంద్రారెడ్డి పరిస్థితులు అనుకూలంగా మారనున్నాయి. నంద్యాల నియోజకవర్గంలో భూమా కుటుంబం పట్టును క్రమంగా కోల్పోతుంది.

భూమా యాక్టివ్ గా లేక….

ఉప ఎన్నికల్లో గెలిచి సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలయిన భూమా బ్రహ్మానందరెడ్డి పెద్దగా యాక్టివ్ గా లేరు. ఆయన తన సోదరి వ్యవహారశైలిపట్ల కూడా ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. తనను పక్కన పెట్టి భూమా జగద్విఖ్యాతరెడ్డిని వచ్చే ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టాలని అఖిలప్రియ ప్రయత్నిస్తున్నారు. ఇది తెలుసుకున్న భూమా బ్రహ్మానందరెడ్డి మౌనంగా ఉన్నారు. అసలు పార్టీ లో ఉన్నారా? లేదా? అన్నది కూడా తెలియడం లేదు. ఇది శిల్పా రవిచంద్రారెడ్డికి అనుకూలంగా మారింది.

భూమా వర్గం….

ఇక కిడ్నాప్ కేసులో అఖిలప్రియ చిక్కుకోవడం, ఆళ్లగడ్డతో పాటు నంద్యాల నుంచి కూడా ఆమెకు సానుభూతి లభించకపోవడాన్ని కూడా శిల్పా వర్గీయులు గుర్తు చేస్తున్నారు. ఏవీ సుబ్బారెడ్డి కూడా నంద్యాల రాజకీయాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఆళ్లగడ్డ పాలిటిక్స్ పైనే దృష్టి పెట్టారు. దీంతో నంద్యాల నియోజకవర్గంలో భూమా అనుచరులు క్రమంగా దూరమవుతున్నారు. తద్వారా టీడీపీ కూడా పట్టుకోల్పోతుంది.

పార్టీలో చేర్చుకుంటూ….

దీన్ని అవకాశంగా తీసుకున్న శిల్పా రవిచంద్రారెడ్డి టీడీపీ సానుభూతి పరులను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. శిల్పా మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు పరిచయాల కారణంగా ఆయన తమ వర్గంలోకి లాగేసుకుంటున్నారు. టీడీపీ మాత్రం ఇక్కడ ఏ విధమైన చర్యలు పార్టీ బలోపేతానికి చేపట్టడం లేదు. ఫలితంగా నంద్యాలలో శిల్పా కుటుంబానికి ఎదురులేకుండా పోతుందన్న వాదన వినిపిస్తుంది. ఇప్పటికైనా టీడీపీ నంద్యాలలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తుందో? లేదో? చూడాలి.

Tags:    

Similar News