శిల్పా ఫ్యామిలీకి ఈసారి ఛాన్స్….జగన్ మనసులో?

కర్నూలులో శిల్పా కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. భూమా కుటుంబానికి వ్యతిరేకంగా పార్టీలు మారుతూ వస్తున్న శిల్పా ఫ్యామిలీ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తమ సత్తాను [more]

Update: 2021-04-06 12:30 GMT

కర్నూలులో శిల్పా కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. భూమా కుటుంబానికి వ్యతిరేకంగా పార్టీలు మారుతూ వస్తున్న శిల్పా ఫ్యామిలీ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తమ సత్తాను మరోసారి చాటనుంది. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల, ఆత్మకూరు నియోజకవర్గాల నుంచి శిల్పా కుటుంబ సభ్యులు విజయం సాధించారు. శిల్పా చక్రపాణిరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి, నంద్యాల నుంచి శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విజయం సాధించారు.

మంత్రి వర్గ విస్తరణలో….

మరి కొద్ది నెలల్లో మంత్రి వర్గం విస్తరణ ఉన్న నేపథ్యంలో శిల్పా కుటుంబంలో ఒకరికి మంత్రి పదవి గ్యారంటీ అని అంటున్నారు. శిల్పా మోహన్ రెడ్డి తన వారసుడికి నంద్యాల పగ్గాలు అప్పగించి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. శిల్పా రవిచంద్రారెడ్డి యువకుడు కావడంతో ఆయనకు ఛాన్స్ లేదు. అయితే నంద్యాల నియోజకవర్గంలో ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను వైసీపీ ఖాతాలో వేయగలిగారు. మున్సిపాలిటీల్లోనూ తనదే పైచేయి ఉండేలా చూసుకున్నారు.

నంద్యాల నియోజకవర్గంలో….

ఇక ఆత్మకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శిల్పా చక్రపాణిరెడ్డి పంచాయతీ ఎన్నికలలో దాదాపు క్లీన్ స్వీప్ చేశారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లోనూ తన సత్తా చూపేందుకు ప్రయత్నాలు చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో 27 వార్డులుండగా గతంలో టీడీపీ తరుపున 24 మంది నామినేషన్లు వేశారు. వీరిలో దాదాపు 15 మంది వరకూ టీడీపీలో చేరిపోయినట్లే. దీంతో ఇక్కడ మున్సిపాలిటీ వైసీపీ పరంఅయింది. బీజేపీ అభ్యర్థులు బరిలో ఉండటంతో ఎన్నిక జరుగతుంది తప్ప ఇక్కడ పోటీ నామమాత్రమే అని చెప్పాలి.

శిల్పా చక్రపాణిరెడ్డికి…..

దీంతో శిల్పా చక్రపాణిరెడ్డికి ఈసారి విస్తరణలో మంత్రి పదవి ఖాయమంటున్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లా నుంచి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఉన్నారు. మరో రెడ్డి సామాజికవర్గానికి ఛాన్స్ లేదని చెబుతున్నా శిల్పా కుటుంబానికి న్యాయం చేయాలన్న ఉద్దేశ్యంతోనే జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. శిల్పా చక్రపాణిరెడ్డి తనకు ఉన్న ఐదేళ్ల ఎమ్మెల్సీ పదవి కాలాన్ని కూడా వదిలేసుకుని వచ్చి వైసీపీలో చేరడంతో ఆయనకు ఖచ్చితంగా జగన్ ప్రాధాన్యత ఇవ్వనున్నారని చెబుతున్నారు. మొత్తం మీద కర్నూలు జిల్లాలో శిల్పా కుటుంబం మరోసారి రాజకీయంగా ఉన్నత పదవులు అందుకునే అవకాశముంటుందంటున్నారు.

Tags:    

Similar News