నివురు గప్పిన నిశ్శబ్దం...!!

Update: 2018-12-06 15:30 GMT

ప్రచార సంరంభం ముగిసింది. నాయకుల వాడివేడి ఆవేశాలకు తెరపడింది. వాస్తవంగా లభించే సీట్లెన్ని? మేనేజ్ చేసుకోవాల్సిన స్థానాలెన్ని? ప్రలోభాలతో బుట్టలో వేసుకోవాల్సిన నాయకులెవరు? బలాలు,బలహీనతలు గుర్తించే పనిలో పడ్డారు నాయకులు. నిజానికి అన్ని ప్రధానపార్టీల నాయకులకు తమ బలాబలాల గురించి పక్కా తెలుసు. అయితే ప్రజలను మభ్యపెట్టకపోతే అసలుకే మోసం వస్తుంది. అందువల్లనే కచ్చితంగా ఓడిపోతామని తెలిసిన సీట్లలోనూ బంపర్ మెజార్టీ సాధిస్తామని ఘంటాపథంగా పార్టీలు చెబుతుంటాయి. తద్వారా క్యాడర్ లో జోష్ నింపుతారు. ప్రజల్లో ఎంతోకొంతమేరకు ఓటింగు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ ఎన్నికలు సైతం ఇందుకు మినహాయింపు కాదు. కొండొకచో అన్ని రాష్ట్రాలకంటే ఇక్కడ ఎక్కువ పార్టీలే బరిలో నిలుస్తున్నట్లు చెప్పుకోవచ్చు. రకరకాల సమీకరణలు, వర్గీకరణల కారణంగా కూటముల రూపంలో పార్టీలు బలమైన ప్రత్యర్థులుగా తలపడుతున్నాయి. ప్రధానపోటీ అధికార,విపక్షాల మధ్యనే ఉన్నప్పటికీ బహుముఖాలుగా వైరి పక్షాలు తలపడటం తెలంగాణలో కనిపిస్తుంది. పోటీ త్రిముఖం, చతుర్ముఖంగా మారడంతో ప్రచారం సైతం హోరెత్తింది. అభ్యర్థుల ఖర్చూ తడిసి మోపెడవుతోంది

ఆకాశమే హద్దు...

ఈసారి ఎన్నికల్లో అన్నిపార్టీలు ఆకాశమే హద్దు అన్నట్లుగా హామీలు గుప్పించాయి. 2014 లో తెలంగాణ ప్రాంతంలో రాష్ట్రవిభజన సెంటిమెంటు ప్రధానాస్త్రంగా పనిచేసింది. ఉద్యమం చేసిన తెలంగాణ రాష్ట్రసమితి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఎటువంటి భావోద్వేగాలకు తావు లేకుండా మంచిచెడ్డలను బేరీజు వేసుకుని ఓటు వేసుకునే సౌలభ్యం ఓటరుకు చిక్కింది. సెంటిమెంటు ఎవరిసొంతమూ కాదు. అయితే ఎన్నికల మేనిఫెస్టోలు మాత్రం అందరినీ భయపెడుతున్నాయి. దీనికి కారణం నేలవిడచిసాము చేసిన అంకెల గారడీలే. బడ్జెట్ తో, ఆర్థిక వనరులతో నిమిత్తం లేకుండా పార్టీలన్నీ హామీలు ఇచ్చేశాయి. వాటిని తీర్చడం సంగతి తర్వాత ముందు అధికారంలోకి వస్తే చాలన్నట్లుగా ప్రవర్తించాయి. దీని పర్యవసానం అధికారంలోకి రానున్న పార్టీ అనుభవించాల్సి ఉంటుంది. ఏదేమైనా రాజకీయపార్టీలు వాస్తవాలు విస్మరించి పక్కా స్వార్థపూరితంగా ఆలోచించడంతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఈసారి ఎన్నికల్లో 2014 ఎన్నికలకంటే రెట్టింపు హామీలు కనిపిస్తున్నాయి. నిధుల లభ్యత మాత్రం అంతంతగానే ఉంది. దీనిని ఎలా బ్యాలెన్సు చేసుకుంటారనేది వేచి చూడాల్సిన పరిణామం. మేనిఫెస్టోలను తమకు సమర్పించాలని కోరిన ఎన్నికల సంఘం వాటిని తీసుకోవడం మినహా అమలు సాధ్యాసాధ్యాలపై ద్రుష్టి సారించిన దాఖలా కనిపించదు.

పంపిణీ కాలం...

ఎన్నికలకు కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉంది. ఇది ప్రలోభాల కాలం. పంపిణీల సమయం. ఓటర్లకు ఇంటింటికీ డబ్బులు ఇచ్చేందుకు అభ్యర్థుల తాలూకు ఏజంట్లు, పార్టీ కార్యకర్తలు ప్రయత్నిస్తారు. కోట్ల రూపాయలు చేతులు మారే సమయమిదే. అధికార యంత్రాంగం దీనిని కట్టడి చేయడానికి శతవిధాలుగా కృషి చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. కానీ నిజానికి జరిగేది వేరు పంపిణీ సాగుతున్న సొమ్ములో పదిశాతం కూడా పట్టుపడదు. అందులోనూ పట్టుకునే సొమ్ము ఎక్కువగా ప్రతిపక్షాలకు చెందినదే అయి ఉంటుంది. దీనికి ప్రధానకారణం పోలీసు బలగాలు కొంతమేరకు పక్షపాతంతో వ్యవహరించడమేనని చెప్పవచ్చు. సామాజిక వర్గాల నాయకులను సంప్రతించి గంపగుత్తగా ఓట్ల కొనుగోలు యత్నాలకూ కొదవ లేదు. ఇప్పటికే ప్రధాన పార్టీల నాయకులు ఛోటామోటా నాయకులు, గల్లీ లీడర్లకు పెద్ద మొత్తాల్లో ఆఫర్లు ఇచ్చి ఓట్లను కొనుగోలు చేసే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. బూతుల వారీ ఓట్లను కొనుగోలు చేసి తమకు మెజార్టీ తెచ్చిపెట్టడమనేది ఆయా కాంట్రాక్టు నాయకుల బాధ్యత. యాభైశాతం ముందస్తుగా చెల్లించి పంపిణీ మధ్యలో మిగిలిన నిధులను సర్దుబాటు చేయడమూ సాగుతోంది. మొత్తం ఒకేసారి ఇచ్చేస్తే పోలీసులకు, ఎన్నికల అధికారులకు సులభంగా దొరికిపోతామోననే భయాలూ ఇందుకు కారణం.

పోల్ మేనేజ్ మెంట్.....

ముందస్తుగా ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ చివరి రెండు రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలే చాలా కీలకం. స్వింగ్ ఓటర్లను ఆకట్టుకోవడం, లోపాలు కనిపించకుండా న్యూట్రలైజ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ చివరి ఘడియలు అందుకు ఎంతో ఉపయుక్తం. ఆఖరి ఘడియల్లో తటస్థులను తమవైపు తిప్పుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు నాయకులు. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని సామదానభేదోపాయాలతో ఆకట్టుకునే యత్నాలు చేస్తారు. మందు, మద్యం, విలువైన కానుకలు ఇచ్చేందుకూ వెనకాడరు. గ్రామప్రాంతాల్లో పోలింగు బూతులకు ఓటర్లను తీసుకురావడంలో పెద్దగా ఇబ్బందులుండవు . కానీ పట్టణ ప్రాంతాల్లో ఓటర్లను బూత్ లకు రప్పించడం పార్టీలకు తలకు మించిన భారమే. ఎన్నికల రోజును సెలవు దినంగా భావించి ఎంజాయ్ చేయడం అలవాటై పోయింది. పట్టణ ప్రాంతాల్లో బహుముఖ పోటీలున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెసు, బీజేపీ, బీఎల్ఎఫ్ వంటి పార్టీలకు ఎంతోకొంత ఓటు బ్యాంకు ఉంది. తమ లాయల్ ఓట్లను సైతం ఆయా పార్టీలు పోలింగు బూత్ నకు తెచ్చుకోలేకపోతున్నాయి. పట్టణ ఓటర్లలో ఉన్న ఉదాసీనత ఇందుకు కారణం. దీనిని సమర్థంగా నిరోధించి అత్యధిక శాతం ఓటర్లను ఏపార్టీ పోలింగు బూత్ నకు రప్పించుకోగలుగుతుందో ఆపార్టీ గెలుపు అవకాశాలు మెరుగుపడతాయి. మొత్తమ్మీద సంక్లిష్టంగా మారిన రాజకీయ ముఖచిత్రంలో పోల్ మేనేజ్ మెంట్ ఈసారి చాలా కీలకం కాబోతోంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News