అంతా ఆయన చుట్టూనే…!!

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పదవి పిచ్చిపట్టుకుందా? ఆయన మరోసారి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా? సంకీర్ణ సర్కార్ ను అస్థిరపరుస్తుంది సిద్ధరామయ్యేనా? అంటే జనతాదళ్ ఎస్ వర్గాలు అవుననే అంటున్నాయి. [more]

Update: 2019-01-31 16:30 GMT

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పదవి పిచ్చిపట్టుకుందా? ఆయన మరోసారి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా? సంకీర్ణ సర్కార్ ను అస్థిరపరుస్తుంది సిద్ధరామయ్యేనా? అంటే జనతాదళ్ ఎస్ వర్గాలు అవుననే అంటున్నాయి. గత కొన్నాళ్లుగా బారతీయ జనతా పార్టీతో ఇబ్బంది పడుతున్న సంకీర్ణ ప్రభుత్వం ఇప్పుడు రెండు పార్టీల్లో వివాదం తలెత్తడానికి సిద్ధరామయ్యే కారణమంటున్నారు. సిద్ధరామయ్య మరోసారి ముఖ్యమంత్రి కావాలనే ఈ ప్రయత్నాలు ప్రారంభించారని చివరకు దళపతి దేవెగౌడ సయితం ఆరోపించడం విశేషం.

విరుద్ధ ప్రకటనలతో…..

నిజానికి సిద్ధరామయ్య సంకీర్ణ సర్కార్ ఏర్పడిన తొలిరోజుల్లో విరుద్ధమైన ప్రకటనలు చేశారు. తాను ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారు. తాను రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా చెప్పారు. అదే సందర్భంలో ప్రజలు కోరుకుంటే మరోసారి ముఖ్యమంత్రిని అవుతానని కూడా అన్నారు. అయితే వివిధ ప్రాంతాల్లో పలు సందర్భాల్లో చేసిన ప్రకటనగా పార్టీ నేతలు సిద్ధూ ప్రకటనలను లైట్ గా తీసుకున్నారు. కానీ ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే ఎవరికైనా సిద్ధూ హ్యాండ్ ఇందులో ఉందనే అనిపిస్తుంది.

ఎమ్మెల్యేలకు అండగా…..

సంకీర్ణ సర్కార్ లో సిద్ధరామయ్య సమన్వయ సమితి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ పదవితో ఆయన ఎమ్మెల్యేలకు బాగా దగ్గరయ్యారు. తమ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలన్నా, పదవులు కావాలన్నా సిద్ధరామయ్యను ఎమ్మెల్యేలను తరచూ కలుస్తుండటం పరిపాటిగా మారింది. వారందరితో ఓపిగ్గా మాట్లాడే సిద్ధరామయ్య నియోజకవర్గ సమస్యల విషయంలో తక్షణం స్పందిస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సిద్ధరామయ్యకు మహానేతగా కనపడుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కుమారస్వామి తమ సమస్యలను పట్టించుకోవడం లేదని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆరోపణ.

తమ నేత అంటూ…..

యడ్యూరప్ప ఆపరేషన్ కమల్ కు తెరలేపినప్పుడు కూడా సిద్ధరామయ్య కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకోగలిగారు. మంత్రి వర్గ విస్తరణలోకూడా సిద్దూ అనుకూలురుకే చోటు దక్కడంతో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు హైకమాండ్ వద్ద సిద్ధూ పలుకుబడి గురించి చర్చించుకోవడం ప్రారంభమయింది. లోక్ సభ ఎన్నికలూ సిద్ధూ నేతృత్వంలోనే వెళ్లాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ నిర్ణయించడం కూడా సిద్ధూ పలుకుబడి పెరగడానికి కారణంగా చెప్పొచ్చు. ఇలా ఎమ్మెల్యేలందరూ సిద్ధూను తమ నాయకుడిగా ఓన్ చేసుకోవడం తప్పేమీ కాదంటున్నారు. దీనికి కుమారస్వామి, దేవెగౌడ అలా ఉలిక్కిపడాల్సిన పనిలేదంటున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి ఎలా అవుతారన్న ప్రశ్న కూడా కాంగ్రెస్ నేతల నుంచి వస్తుంది. మొత్తం మీద ఇప్పుడు కర్ణాటక రాజకీయాలు సిద్ధూ చుట్టూనే తిరుగుతున్నాయి.

Tags:    

Similar News