ఆల్వేస్ అవర్ బాస్…!!

ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ తేదీ వరకూ సఖ్యతతో మెలిగినట్లు కనపడినా ఆ తర్వాత అసలు రూపం బయటకు వస్తోంది. ముఖ్యమంత్రిగా కుమరస్వామి పరిపాలన ఏడాది పూర్తయింది. [more]

Update: 2019-05-12 17:30 GMT

ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ తేదీ వరకూ సఖ్యతతో మెలిగినట్లు కనపడినా ఆ తర్వాత అసలు రూపం బయటకు వస్తోంది. ముఖ్యమంత్రిగా కుమరస్వామి పరిపాలన ఏడాది పూర్తయింది. కర్ణాటకలో కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ల సంకీర్ణ సర్కార్ దినదిన గడం నూరేళ్ల ఆయుష్షులానే ఉంది. ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్, జేడీఎస్ నేతల మధ్య మాటల యుద్ధం అనేక సార్లు జరిగింది. మంత్రి వర్గ విస్తరణ తర్వాత అసంతృప్తులు మరింత బయటపడ్డాయి.

కుమారస్వామిపై అసంతృప్తి….

ముఖ్యమంత్రిగా కుమారస్వామి పనితీరును కాంగ్రెస్ నేతలే తప్పుపడుతున్నారు. రెండు పార్టీల మధ్య సఖ్యత కోసం సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఛైర్మన్ గా నియమించారు. సమన్వయ కమిటీ సమావేశాలు మొక్కుబడిగానే సాగాయన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయం. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలేవీ కుమారస్వామి అమలు పర్చడం లేదని బాహాటంగానే విమర్శలు చేశారు. కొందరు అసంతృప్త ఎమ్మెల్యేలు ఇప్పటికే బీజేపీతో టచ్ లోకి వెళ్లారు.

ఏకపక్ష ధోరణిపై…..

అయినా కుమారస్వామి తీరు మారలేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అధికారుల బదిలీల దగ్గర నుంచి నామినేటెడ్ పదవుల పందేరం వరకూ ఏదీ న్యాయంగా జరగలేదంటున్నారు. నిధుల విడుదల విషయంలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పట్ల వివక్ష చూపుతున్నారన్నది వారి ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా కుమారస్వామి సోదరుడు మంత్రి రేవణ్ణ విషయంలోనూ వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

సిద్ధూ ముఖ్యమంత్రి అంటూ….

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం తమ దూకుడును మరింత పెంచారు. కాబోయే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంటూ అనేకమంది కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. దీనిని కుమారస్వామి తప్పుపడుతున్నారు. అసలు కాంగ్రెస్ ఉద్దేశ్యం ఏంటో చెప్పాలని ఆయన ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర, పీసీసీ చీఫ్ దినేష్ గుండూరావును నిలదీసినట్లు తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ అధినాయకత్వమే తేల్చి చెప్పాలని, వారి నోళ్లను మూయించకుంటే తమ దారి తాము చూసుకోక తప్పదని కుమారస్వామి హెచ్చరించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద లోక్ సభ ఎన్నికల ఫలితాలకు ముందే సంకీర్ణంలో లుకలుకలు ప్రారంభమయ్యాయి.

Tags:    

Similar News