అయ్యయ్యో…‘‘చేయి’’ జారి పోతుందా?

ఎట్టిపరిస్థితుల్లో సంకీర్ణ సర్కార్ ను లోక్ సభ ఎన్నికల వరకూ కాపాడుకోగలిగితే ఆ తర్వాత కొంత కుదుటపడవచ్చన్నది కాంగ్రెస్ అగ్రనేతల ఆందోళన. సంకీర్ణ సర్కార్ ను కూలదోసేందుకు [more]

Update: 2019-01-22 18:29 GMT

ఎట్టిపరిస్థితుల్లో సంకీర్ణ సర్కార్ ను లోక్ సభ ఎన్నికల వరకూ కాపాడుకోగలిగితే ఆ తర్వాత కొంత కుదుటపడవచ్చన్నది కాంగ్రెస్ అగ్రనేతల ఆందోళన. సంకీర్ణ సర్కార్ ను కూలదోసేందుకు భారతీయ జనతా పార్టీ పెద్దయెత్తున ప్రయత్నాలు చేస్తుండటంతో కాంగ్రెస్ తన పార్టీ ఎమ్మెల్యేలందరినీ రిసార్ట్ కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే రిసార్ట్ లోనూ ఘర్షణలు చోటు చేసుకోవడంతో ఇక రిసార్ట్ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు రిసార్ట్స్ నుంచి వెళ్లిపోయారు. తమ మీద నమ్మకం లేకనే ఇలా రిసార్ట్స్ లో బంధించారా? అని ప్రశ్నిస్తూ అసహనం వ్యక్తం చేస్తుండటంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఒక్కొక్కరినీ పంపంచి వేస్తోంది.

కుమారస్వామికి వ్యతిరేకంగా…

ఇక రిసార్ట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమస్యల గురించి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి వేణుగోపాల్, పీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావులు తెలుసుకున్నట్లు చెబుతున్నారు. నియోజకవర్గ సమస్యలతో పాటుగా, వారు ఆశించింది..ఆశిస్తున్నది ఏంటో కూడా తెలుసుకున్నారు. ఎక్కువ మంది నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించగా, కొందరు తమకు మంత్రి పదవి కావాలని అడగడం కూడా విశేషం. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉండేందుకు వీలు లేదని కుండబద్దలు కొట్టేశారట. మెజారిటీ స్థానాలు దక్కినా కాంగ్రెస్ ముఖ్యమంత్రి పదవి చేపట్టకపోవడాన్ని అధికసంఖ్యలో శాసనసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొందరైతే తాము కుమారస్వామి సీఎంగా ఉంటే పార్టీలో ఉండలేమని కూడా చెప్పడంతో కంగు తినడం కాంగ్రెస్ నేతల వంతయింది.

గవర్నర్ ను కలిసేందుకు….

కాంగ్రెస్ లో గొడవలను ఆసరాగా చేసుకుని భారతీయ జనతా పార్టీ మరోసారి అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు సంపాదించుకున్న బీజేపీ మరో ఏడుగురి సభ్యుల మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అవిశ్వాసం పెడితే కాంగ్రెస్, జేడీఎస్ లకు చెందిన ఎమ్మెల్యేలు కొందరు తమవైపు వస్తారన్న ధీమాతో కమలం పార్టీ ఉంది. యడ్యూరప్ప అదే పనిలో ఉన్నారంటున్నారు. త్వరలో గవర్నర్ ను కలవాలన్న ఉద్దేశ్యంతో యడ్యూరప్ప ఉన్నట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానం ప్రభుత్వంపై పెడితే అసంతృప్త నేతలందరూ బయటకు వస్తారన్నది కమలం పార్టీ వ్యూహంగా కన్పిస్తోంది.

ఏం చేయాలన్న దానిపై….

అయితే కాంగ్రెస్ దీనికి విరుగుడుగా ఏం చేయాలన్న దానిపై సీరియస్ గా చర్చిస్తోంది. అవిశ్వాస తీర్మానం బీజేపీ కనుక పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సంకీర్ణ సర్కార్ గట్టెక్కడం కష్టమే. అవిశ్వాసం సందర్భంగా అనేకమంది నేతల నుంచి గొంతెమ్మ కోర్కెలు వినపడటం ఖాయం. ఇప్పటికే ఇటీవల మంత్రి వర్గ విస్తరణ చేపట్టి కాంగ్రెస్ చేతులు కాల్చుకుంది. అవిశ్వాస తీర్మానం రాకుండా చేయాలంటే ఏదో ఒకటి కాంగ్రెస్ చేయాల్సిందేనని సీనియర్ నేతలు భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గందరగోళం తామే సృష్టించి కొందరు బీజేపీ నేతలపై సస్పెన్షన్ వేటు వేస్తే తాత్కాలిక ఉపశమనం లభిస్తుందన్న ఆలోచనలో కూడా హస్తం పార్టీ నేతలు ఉన్నట్లు సమచారం. ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారోనన్న భయం మాత్రం ఆ పార్టీని వీడలేదనే చెప్పాలి. దీంతో పాలన గాడి తప్పిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News