సిద్ధూ మళ్లీ…మరోసారి…??

కర్ణాటక రాజకీయాల్లో సిద్ధరామయ్య స్టయిలే వేరు. తన ప్రత్యర్థి దేవెగౌడ కుటుంబంతో సఖ్యతగానే మెలుగుతున్నట్లు కనపడుతూనే మరోవైపు తన ఆధిపత్యం కోసం ఆయన నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు. [more]

Update: 2019-07-01 16:30 GMT

కర్ణాటక రాజకీయాల్లో సిద్ధరామయ్య స్టయిలే వేరు. తన ప్రత్యర్థి దేవెగౌడ కుటుంబంతో సఖ్యతగానే మెలుగుతున్నట్లు కనపడుతూనే మరోవైపు తన ఆధిపత్యం కోసం ఆయన నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం నిత్యం ఏదో వివాదాల్లో నలుగుతూనే ఉంది. భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను పక్కన పెడితే సంకీర్ణ సర్కార్ లో ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ నేతల మధ్య సఖ్యత లేదన్న సంగతి అందరికీ తెలసిందే.

సిద్ధహస్తుడే కాని….

కాంగ్రెస్ లో అసమ్మతులను, అసంతృప్తులను బుజ్జగించడంతోనే పూర్తి సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఇందులో సిద్ధరామయ్య సిద్ధహస్తుడనే చెప్పాలి. ఎప్పటికప్పుడు తలెత్తుతున్న అసంతృప్తులను సంతృప్తపర్చడంలో సిద్ధరామయ్య దిట్ట. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఇప్పటి వరకూ సంకీర్ణ సర్కార్ మనుగడ సాగించిందనడంలో అతిశయోక్తి లేదు. అయితే సిద్ధరామయ్య ను కాంగ్రెస్ అధిష్టానం సమన్వయ కమిటీ ఛైర్మన్ గా నియమించిందీ అందుకేనంటారు. దేవెగౌడకు చెందిన జనతాదళ్ ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరి ముఖ్యమంత్రిగా ఎదిగిన సిద్ధరామయ్యకు ఆ పార్టీలో ఇప్పటికీ బలమైన నమ్మకస్తులున్నారు.

అసంతృప్తితో ఉండి…..

అయితే సిద్ధరామయ్య గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యమంత్రి కుమారస్వామి తన మాటకు విలువ ఇవ్వలేదని ఆయన బహిరంగంగానే చెబుతుండటం విశేషం. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జరిగిన బడ్జెట్ సమావేశాల నుంచి, ఉన్నతాధికారుల బదిలీల విషయంలో సిద్ధూ మాట చెల్లుబాటు కాకుండా పోయింది. దీంతో ఎప్పటికప్పుడు సిద్ధరామయ్య కుమారస్వామికి తన అసంతృప్తి సంకేతాలను పంపుతూనే ఉన్నారు.

తాజా వ్యాఖ్యలతో…..

తాజాగా సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు సంకీర్ణ సర్కార్ లో కలకలం రేపుతున్నాయి. తన మాట వినేవారు ఎవరూ ప్రభుత్వంలో లేరని ఆయన మీడియా ముందు వాపోయారు. తాను నిస్సహాయుడినని, తనలాగా స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే వారు ఇప్పుడు లేరని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సంకీర్ణ సర్కార్ లో ఏ పనీ సక్రమంగా జరగడం లేదని ఆయన పరోక్షంగా కుమార స్వామిపై విమర్శలు చేశారు. తాను ప్రకటించిన కొత్త తాలూకాల విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో మరోసారి సిద్ధరామయ్య కుమారస్వామిని టార్గెట్ చేశారంటున్నారు.

Tags:    

Similar News