‘‘ఫిగర్’’ లేకున్నా ఫోజులకేం తక్కువ లేదే….!!!

కర్ణాటకలో జరుగుతున్నరాజకీయ పరిణామాలను పరిశీలిస్తే సంఖ్యాబలం లేకున్నా సోకులకేం తక్కువలేదనట్లుంది. ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యల మధ్య కోల్డ్ వార్ ఇదే సూచిస్తుంది. [more]

Update: 2019-05-21 18:29 GMT

కర్ణాటకలో జరుగుతున్నరాజకీయ పరిణామాలను పరిశీలిస్తే సంఖ్యాబలం లేకున్నా సోకులకేం తక్కువలేదనట్లుంది. ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యల మధ్య కోల్డ్ వార్ ఇదే సూచిస్తుంది. ఇద్దరూ విడిపోతే ప్రభుత్వం పతనం ఖాయమని తెలిసీ మరీ మాటల దాడికి దిగుతుండటం రెండుపార్టీలనేతల్నీ ఆందోళనకు గురి చేస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరి మధ్య సయోధ్యకు చేసిన ప్రయత్నాలూ పెద్దగా ఫలించలేదనే చెప్పాలి.లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఇది మరింతముదిరే అవకాశం ఉంది తప్పించి చల్లారే ప్రసక్తి కన్పించడంలేదు.

తక్కువ సంఖ్యాబలంతో…

కర్ణాటక శాసనసభలో 104 స్థానాలతో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది. మరో ఏడుగురు సభ్యులు దొరికితే యడ్యూరప్ప ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 80, జనతాదళ్ ఎస్ కు 38 మంది సభ్యులున్నారు. భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రానివ్వ కూడదన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్, జేడీఎస్ లు కలిశాయి. అతి తక్కువ స్థానాలు వచ్చిన జనతాదళ్ ఎస్ నేత కుమారస్వామికి ముఖ్యమంత్రి పీఠాన్ని అయిష్టంగానే కాంగ్రెస్ అప్పగించింది. హైకమాండ్ ఒత్తిడితో విధిలేని పరిస్థితుల్లో కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఈ ప్రతిపాదనకు అంగీకరించాల్సి వచ్చింది.

ఏడాది నుంచీ అంతే…

దాదాపు ఏడాది కాలం నుంచి సంకీర్ణంలోని రెండు పార్టీల మధ్య పెద్దగా సఖ్యత లేదు. కుమారస్వామి తీసుకునేప్రతి నిర్ణయాలు సమన్వయ కమిటీ ఛైర్మన్ గా సిద్ధరామయ్య వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న లక్ష్యంతో ఈ లోక్ సభ ఎన్నికల్లో పొత్తుకు అంగీకరించినా కిందిస్థాయిలో రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరగలేదన్నది పోలింగ్ అనంతరం తేలింది. దీంతో రెండు పార్టీల మధ్య విభేదాలు మరింత ముదిరిపోయాయి. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అవుతారంటూ సాక్షాత్తూ మంత్రులే ప్రకటనలు చేస్తుండటం మంట పుట్టిస్తోంది.

ఎటువైపునకు దారితీస్తుందో…?

మరోవైపు కుమారస్వామి కూడా ఏమాత్రం తగ్గడం లేదు. మల్లికార్జున ఖర్గే కు సీఎం అయ్యే అర్హత ఉందని కుమారస్వామి వ్యాఖ్యానించారు.దీనికి కౌంటర్ గా జనతాదళ్ ఎస్ లోనూ ముఖ్యమంత్రి కాదగిన నేతలు అనేక మంది ఉన్నారని, కుమారస్వామి సోదరుడు రేవణ్ణ కూడా సీఎం పదవికి అర్హుడంటూ సిద్ధరామయ్య కౌంటర్ ఎటాక్ చేశారు. సిద్ధరామయ్య గతంలోనే తాను మరోసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రిని కావాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు. కేంద్రంలో జేడీఎస్ కు మంత్రి పదవులిచ్చి ఇక్కడ సీఎం పదవిని తీసుకోవాలన్నది సిద్ధూ ఆలోచన. అలాగే కుమారస్వామి కూడా అవసరమైతే రాజీనామాకు సిద్ధమని చెబుతున్నారు. ఇద్దరికీ తగినంత సంఖ్యాబలం లేకున్నా సీఎం పదవి కోసం కొట్లాటలకు దిగడం సంకీర్ణ సర్కారు మనుగడపై ప్రభావం చూపించక మానదు.

Tags:    

Similar News