ఎవరి నమ్మకం వారిదేనా?

ఎవరి లెక్కలు వారికున్నాయి. తన అవసరం వారికుందని ఇద్దరూ బలంగా నమ్ముతున్నారు. కానీ లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం మాత్రం ఎవరిది పైచేయి అవుతుందనేది చూడాలి. [more]

Update: 2019-05-10 18:29 GMT

ఎవరి లెక్కలు వారికున్నాయి. తన అవసరం వారికుందని ఇద్దరూ బలంగా నమ్ముతున్నారు. కానీ లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం మాత్రం ఎవరిది పైచేయి అవుతుందనేది చూడాలి. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ల సంకీర్ణ ప్రభుత్వానికి చివరి రోజులు వచ్చాయంటూ ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తుండటం విశేషం. ప్రధానంగా కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో ముందు వరుసలో ఉన్నారు. ముఖ్యమంత్రి కుమారస్వామి పనితీరును బహిరంగంగానే తప్పుపడుతున్నారు.

కలసి పోటీ చేసినా….

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 21 స్థానాల్లోనూ, జనతాదళ్ ఎస్ 7 స్థానాల్లోనూ బరిలోకి దిగాయి. అయితే మాండ్య, హాసన, తుముకూరు, మైసూరు, చిక్కబళ్లాపూర్ నియోజకవర్గాల్లో ఒకరినొకరు సహకరించుకోలేదన్నది సుస్పష్టం. లోక్ సభ ఎన్నికలు రెండు పార్టీలను మరింత బలోపేతం చేస్తాయని అధిష్టానం భావిస్తే… అందుకు భిన్నంగా రెండు పార్టీల నేతలు, క్యాడర్ మధ్యగ్యాప్ ను మరింత పెంచాయనే చెప్పాలి.

సీన్ మారుతుందా?

దీంతో లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం కర్ణాటకలో సీన్ మారుతుందంటున్నారు. అతి చిన్న పార్టీగా ఉన్న జేడీఎస్ ను అధికారం నుంచి తప్పించడం ఖాయమని కాంగ్రెస్ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య మరోసారి అందలమెక్కుతారని కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నాయి. కేంద్రంలో జేడీఎస్ అవసరం తమకు రాదని కాంగ్రెస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.

రాహుల్ పైనే నమ్మకం….

ఈ నేపథ్యంలో కుమారస్వామి, దేవెగౌడలు సయితం పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ముప్పు తప్పదని వారిరువురూ గ్రహించినట్లు కనపడుతోంది. అయితే రాహుల్ గాంధీ కుమారస్వామిని తప్పించే సాహసం చేయకపోవచ్చన్నది దేవెగౌడ విశ్వాసం. కుమారస్వామిని పదవి నుంచి దించినా కాంగ్రెస్ అందలమెలా ఎక్కుతుందని జేడీఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలో గాని, రాష్ట్రంలో గాని తమ అవసరం హస్తం పార్టీకే ఉందని చెబుతున్నారు. మొత్తం మీద కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు సంకీర్ణ సర్కార్ కు ముప్పుగా మారనుందన్నది మాత్రం వాస్తవం.

Tags:    

Similar News