మాట వినడం లేదప్పా….??

కర్ణాటకలో మాండ్య పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. సంకీర్ణ ధర్మాన్ని మాండ్య పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు పాటించడం లేదు. నేరుగా కాంగ్రెస్ జెండాలు [more]

Update: 2019-04-06 16:30 GMT

కర్ణాటకలో మాండ్య పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. సంకీర్ణ ధర్మాన్ని మాండ్య పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు పాటించడం లేదు. నేరుగా కాంగ్రెస్ జెండాలు పట్టుకుని సుమలత వెంట తిరగడం కాంగ్రెస్ పార్టీకి చికాకు తెప్పిస్తుంది. మాండ్య నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా సినీనటి, అంబరీష్ సతీమణి సుమలత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. సుమలతకు మాండ్య టిక్కెట్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ జనతాదళ్ ఎస్ అధినేత దేవెగౌడ పట్టు బట్టి తన మనవడి కోసం మాండ్యను తన పార్టీకి దక్కించుకున్నారు.

చికాకు పుట్టిస్తున్నారు…

మాండ్యలో దేవెగౌడ మనవడు నిఖిల్ గౌడను ప్రకటించినప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అంబరీష్ పట్ల తమకు అభిమానం ఉందని, తమకు ఎంతో మేలు చేకూర్చిన అంబరీష్ భార్యను కాదని దేవెగౌడ పార్టీకి ఎలా చేస్తామని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడమే కాదు సుమలత నామినేషన్ సందర్భంగా చేసిన ర్యాలీలో వారు పొల్గొన్నారు. దీంతో జనతాదళ్ ఎస్ నేత, ముఖ్యమంత్రి కుమారస్వామి ఫైరయ్యారు. కాంగ్రెస్ తన పార్టీ నేతలను అదుపులో పెట్టుకోలేకపోతుందని, సంకీర్ణ ధర్మాన్ని విస్మరించిందని ఆయన ఆవేదన చెందారు కూడా.

సుమలత వెంట కాంగ్రెస్ జెండాలతో…

తాజాగా మాండ్య పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నాగమంగల కు చెందిన కాంగ్రెస్ నేతలు హస్తం పార్టీ జెండాలు చేతబూని సుమలత వెంట ప్రచారంలో తిరుగుతున్నారు. మాండ్య కాంగ్రెస్ నేతలను బుజ్జగించి నిఖిల్ గౌడ కు మద్దతు తెలిపేందుకు మంత్రి డీకే శివకుమార్ తీవ్ర ప్రయత్నాలే చేశారు. అయినా ఫలితం లేదు. దీంతో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రంగంలోకి దిగారు. మాండ్యలో పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన సిద్ధరామయ్య కాంగ్రెస్ నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. క్రమశిక్షణ తప్పితే చర్యలుంటాయని హెచ్చరించారు.

కాంగ్రెస్ చర్యలకు దిగినా….

నిఖిల్ గౌడకు మద్దతుగా కాంగ్రెస్ పెద్దయెత్తున మాండ్య నియోజకవర్గంలో ర్యాలీని నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ ప్రదర్శనలో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు సంయుక్తంగా పాల్గొని క్యాడర్ తో పాటు ప్రజలకు ఒక సంకేతాన్ని పంపాలని నిర్ణయం తీసుకున్నారు. మాండ్యలో సుమలతకు బీజేపీ కూడా మద్దతు పలకడంతో కుమారస్వామి తనయుడి గెలుపు డౌట్లో పడింది. అధికారంలో ఉన్నాం కనుక ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమా ఉన్నప్పటికీ, మాండ్య ప్రజలు ఆషామాషీ తీర్పు ఇవ్వరన్నది చరిత్ర చెప్పే సాక్ష్యం. సిద్ధరామయ్య సయితం ఏదో షోకాజ్ నోటీసులు ఇచ్చారు తప్ప మాండ్యలో కాంగ్రెస్ నేతలు అదుపు చేసే పరిస్థితిలో లేరన్నది కాదనలేని వాస్తవం.

Tags:    

Similar News