సేఫ్ కాదని తెలిసీ సిద్ధూ ఇలా...?

Update: 2018-04-26 16:30 GMT

చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ద్వారా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన రాజకీయ జీవితం చరమాంకంలో సంక్లిష్ట సమస్యను ఎదుర్కొంటున్నారు. కుమారుడు యతీంద్ర భవిష్యత్తు కోసం తన రాజకీయ జీవితాన్ని పణంగా పెడుతున్నారన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఇప్పటి వరకూ తాము ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ నియోజకవర్గాన్ని సిద్ధరామయ్య తనకుమారుడు యతీంద్రకు అప్పగించి పాత నియోజకవర్గమైన చాముండేశ్వరి నుంచి పోటీకి దిగారు. వరుణ, చాముండేశ్వరి నియోజకవర్గాలు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నవి కావు, రెండూ మైసూరు జిల్లా పరిధిలో ఉన్నవే. చాముండేశ్వరి ఆధ్మాత్మికంగా కీలకమైన ప్రదేశం. అష్టాదశ వక్తి పీఠాల్లో ఇది ఒకటి. ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారు.

చాముండేశ్వరి చరిత్ర ఇదీ.....

చాముండేశ్వరి ముఖ్యమంత్రికి సురక్షితమైన నియోజకవర్గం ఏమీ కాదు. దీనికి రకరకాల కారణాలున్నాయి. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి జనతాదళ్ (ఎస్) అభ్యర్థి జి.టి. దేవెగౌడ ఎన్నికయ్యారు. ఆయనకు 75,864 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ఎం. సత్యనారాయణకు 68740 ఓట్లు వచ్చాయి. 2008లో కాంగ్రెస్ అభ్యర్థి సత్యనారాయణ ఇక్కడ విజయం సాధించారు. ఈ నియోజకవర్గం విస్తరించి ఉన్న మైసూరు లోక్ సభ స్థానాన్ని 2014లో బీజేపీ అభ్యర్థి ప్రతాప్ సింగ్ కైవసం చేసుకున్నారు. నిజానికి సిద్ధరామయ్యకు చాముండేశ్వరి నియోజకవర్గం కొత్తేమీకాదు. గతంలో ఇక్కడి నుంచి ఐదు సార్లు ఎన్నికయ్యారు. రెండుసార్లు ఓటమి పాలయ్యారు. 1983, 1985, 1994, 2004 2006లో చాముండేశ్వరి నుంచే సిద్ధరామయ్య విజయం సాధించారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంవీ రాజశేఖర మూర్తి చేతిలో పరాజయం పాలయ్యారు. 1999లో కూడా ఇదే పరిస్థితి. 2006 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి కేవలం 200 పైచిలుకు ఓట్లతో అతి కష్టం మీద గెలిచారు సిద్ధరామయ్య.

జేడీఎస్ కు పట్టున్న......

దీంతో సిద్ధరామయ్య 2008లో తన కార్యక్షేత్రాన్ని వరుణకు మార్చుకున్నారు. నియోజకవర్గాల పునర్విభజన కూడా ఇందుకు ఒక కారణం. పునర్విభజనలో భాగంగా సిద్ధరామయ్య సొంత సామాజిక వర్గమైన కురుబలు విస్తరించి ఉన్న పలు ప్రాంతాలు పక్కనున్న వరుణ నియోజకవర్గంలోకి వెళ్లాయి. దీంతో ఆయన కూడా అక్కడకు వలస వెళ్లారు. అప్పటి నుంచి అంటే 2006 నుంచి పన్నెండేళ్ల పాటు చాముండేశ్వరి నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. చాముండేశ్వరి స్థానంలో సామాజిక వర్గాల సమీకరణ అత్యంత కీలకం. ఒక్కలిగలు, ఓబీసీలు ఇక్కడ ఎక్కువ. సుమారు 60 శాతం మంది ఒక్కలిగలు ఉన్నట్లు అంచనా. వీరంతా జనతాదళ్ (ఎస్)కు గట్టి మద్దతుదారులు. 2013లో గెలిచిన ఆ పార్టీ అభ్యర్థి జీటీ దేవెగౌడ కూడా ఆ సామాజికవర్గం వారే. ఎంతోకాలం నుంచి ఒక్కలిగలు ఆ పార్టీకి మద్దతుగా ఉంటూ వస్తున్నారు. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొందని రాజీకీయ విశ్లేషకుల అంచనా. సిట్టింగ్ ఎమ్మెల్యే జీటీ దెవెగౌడ మళ్లీ జనతాదళ్ (ఎస్) తరుపున బరిలో ఉన్నారు. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ నాయకులు ప్రతి పల్లెనూ చుట్టివస్తున్నారు. వీరశైవ మఠాలు, దళిత కాలనీలను సందర్శిస్తున్నారు. జీటీ దేవెగౌడ కుమారుడు హరీశ్ గౌడ తండ్రి తరుపున ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఒకప్పటి జనతాదళ్ (ఎస్) నాయకుడైన సిద్ధరామయ్యకు ఈసారి తమ సత్తా ఏమిటో చూపుతామని పార్టీ శ్రేణుల అంతర్గత సమావేశంలో ఆవేశపూరితంగా మాట్లాడుతున్నారు. పార్టీని వంచించి కాంగ్రెస్ లో చేరారని ఆరోపిస్తున్నారు. అందువల్ల సిద్ధరామయ్య ను ఎన్నికల్లో నిలువరించేందుకు సమాయత్తమవుతున్నారు. పార్టీ యంత్రాంగాన్ని మొత్తాన్ని ఇక్కడే మొహరించాలని నిర్ణయించారు.

పార్టీలోనే వ్యతిరేకులు తయారై.....

భారతీయ జనతా పార్టీకి ఇక్కడ పెద్దగా బలం లేదు. ఇక్కడ దానిది మూడో స్థానమే. 2014 లోక్ సభ ఎన్నికలలో మైసూరు లోక్ సభ స్థానాన్ని మోడీ గాలిలో గెలుచుకోవడం తప్ప పార్టీకి ఇక్కడ పెద్దగా క్యాడర్ లేనిమాట వాస్తవం. సిద్ధరామయ్యను రాజకీయంగా దెబ్బతీసేందుకు జనతాదళ్ (ఎస్), బీజేపీ పరస్పర అవగాహనకు వచ్చాయన్న వాదన వినపడుతోంది. ఎటూతమకు గెలిచే అవకాశం లేదని, అందువల్ల ప్రత్యర్థి అయిన సిద్ధరామయ్యను ఓడించేందుకు జేడీఎస్ తో రహస్య అవగాహనకు రావడంలో తప్పేమీ లేదన్న కమలం శ్రేణుల భావన అన్నప్రచారంజరుగుతోంది. కాంగ్రెస్ లోని సిద్ధరామయ్య వ్యతిరేకులు కూడా ఇదే ఉద్దేశ్యంలో ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ సీనియర్ నాయకులు మల్లిఖార్జున ఖర్గే, మాజీ ముఖ్యమంత్రి వీరప్పమొయిలీ, సీనయిర్ నాయకులు మార్గరెట్ ఆల్వా వంటి వారు కూడా ప్రస్తుతం సిద్ధరామయ్యతో కలసి మనస్ఫూర్తిగా కలసిపనిచేయడం లేదు. ఖర్గే లోక్ సభలో కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు. ఒక రకంగా ప్రతిపక్ష నేత. దళితనాయకుడు అయిన ఆయన ముఖ్యమంత్రి పదవిపై కూడా మనసు పెట్టుకున్నారు. రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే పేరు సయితం సీఎం పదవికి పరిశీలించే అవకాశం లేకపోలేదు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన ప్రజాజీవితంలో ఉన్నారు. ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎన్నికవుతూనే ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ వంటి వారు కూడా ఎన్నికల తర్వాతే ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ నిర్ణయిస్తుందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అంటే తాను కూడా పదవి కోసం పోటీలో ఉన్నట్లు పరోక్షంగా చెప్పడమే. ఇవన్నీ సిద్ధరామయ్యకు తెలియని విషయాలు కావు. అభివృద్ధే తనను గెలిపిస్తుందన్న ధీమాలో ఉన్నారు. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన నియోజకవర్గం ఇప్పుడు ముగింపు పలకదని ప్రగాఢంగా నమ్ముతున్నారు. కాని ఎక్కడో అనుమానం. చాముండేశ్వరి తనను దెబ్బతీస్తుందని భావించిన సిద్ధరామయ్య బాదామీ నియోజకవర్గంలో కూడా పోటీచేస్తున్నారు. ఏమవుతుందోచూడాలి....!

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News