టీడీపీలో హీరో.. వైసీపీలో జీరోనేనా ?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్పడం క‌ష్టం. అడుగు తీసి అడుగు వేసే నాయ‌కుల‌కు అనేక స‌వాళ్లు ద‌ర్శన‌మిస్తాయి. వాటిని అధిగ‌మించి.. ముందుకు వెళ్లే నాయ‌కులు చ‌రిత్ర [more]

Update: 2020-12-12 05:00 GMT

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్పడం క‌ష్టం. అడుగు తీసి అడుగు వేసే నాయ‌కుల‌కు అనేక స‌వాళ్లు ద‌ర్శన‌మిస్తాయి. వాటిని అధిగ‌మించి.. ముందుకు వెళ్లే నాయ‌కులు చ‌రిత్ర సృష్టిస్తే.. అధిగ‌మించ‌లేక రాజీప‌డే నేత‌లు చ‌రిత్రలో క‌లిసిపోతున్నారు. ఇలాంటి వారిలో ఒక‌రుగా మిగిలిపోయే స్థితిలో ఉన్నారు మాజీ మంత్రి, ద‌ర్శి మాజీ ఎమ్మెల్యే శిద్దా రాఘ‌వ‌రావు. టీడీపీలో రాజ‌కీయాలు ప్రారంభించిన వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన శిద్దా.. ప్రకాశం జిల్లాలో క్లీన్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. రెడ్డి, క‌మ్మ నేత‌ల హ‌వా ఉన్న ఈ జిల్లాలో ఆయ‌న ఎమ్మెల్యేగా గెల‌వ‌డంతో పాటు ఐదేళ్లు మంత్రిగా ఉండ‌డం మామూలు విష‌యం కాదు.

వ్యాపారపరంగా కష్టాలు….

అయితే శిద్దా రాఘ‌వ‌రావు గ‌త ఎన్నిక‌ల‌కు ముందు బాబు ఒత్తిడి మేర‌కు అయిష్టంగానే ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేయ‌డం, ఓడిపోవ‌డం తెలిసిందే. వాస్తవానికి త‌న కుమారుడిని గ‌త ఎన్నిక‌ల్లోనే టీడీపీ త‌ర‌ఫున అసెంబ్లీ ఎన్నిక‌ల‌ బ‌రిలో దించాల‌ని… తాను కూడా ద‌ర్శి నుంచే పోటీ చేయాల‌ని అనుకున్నా సాధ్యం కాలేదు. దీంతో ఒంగోలు నుంచి అతి క‌ష్టం మీద పోటీ చేసి ఓడిపోయారు. శిద్దా రాఘ‌వ‌రావు ఓట‌మితో పాటు పార్టీ కూడా చిత్తుగా ఓడిపోయాక శిద్ధాకు రాజ‌కీయ‌, వ్యాపార క‌ష్టాలు మోద‌ల‌య్యాయి. అధికార పార్టీ నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు రావ‌డంతో పాటు త‌న కుమారుడి రాజ‌కీయ భ‌విష్యత్తుపై ఆశ‌ల‌తో ఆయ‌న వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. వైసీపీలో చేరిన త‌ర్వాత‌.. ఆయ‌న ఆర్ధికంగా ఇబ్బందులు లేకుండా వ్యాపారాలు వ్యవ‌హారాల‌ను చ‌క్కబెట్టుకుంటున్నారు.

పెద్ద నేతలందరూ…..

కానీ, ఎంతో కీల‌క‌మైన రాజ‌కీయాల విష‌యంలో మాత్రం శిద్దా రాఘ‌వ‌రావు దూకుడు మునుప‌టితో పోల్చుకుంటే.. జీరో అయిపోయింది వైసీపీలో అనేక మంది నేత‌లు ప్రకాశం జిల్లాలో చ‌క్రం తిప్పుతున్నారు. మంత్రి బాలినేని క‌నుస‌న్నల్లోనే జిల్లా రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. మ‌రో వైపు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కూడా దూకుడు ఏమాత్రం త‌గ్గించ‌లేదు. ఇక‌, రాజ‌కీయ స‌ల‌హాదారు.. స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి కూడా త‌న‌దైన శైలిలో జిల్లా రాజ‌కీయాల‌ను చ‌క్కబెడుతున్నారు. మ‌రోవైపు వేమిరెడ్డి ప్రభాక‌ర్‌రెడ్డి జిల్లా వ్యవ‌హారాల‌ను కంట్రోల్ చేస్తున్నారు.

గుర్తింపు కూడా లేకుండా…..

ఈ నేప‌థ్యంలో శిద్దా రాఘ‌వ‌రావును కానీ, ఆయ‌న కుమారుడిని కానీ .. ప‌ట్టించుకునే తీరిక పార్టీలో ఎవ‌రికీ ఎక్కడా క‌నిపించ‌డం లేదు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు రాష్ట్ర వ్యాప్తంగాను, పార్టీలో, ప్రభుత్వంలో, సామాజిక వ‌ర్గంలో ఓ వెలుగు వెలిగిన ఆయ‌న అస‌లు వైసీపీలో ఉన్నారా ? అన్న సందేహం వ‌స్తోంది. క‌నీస భ‌విష్యత్తులో అయినా శిద్ధా ఫ్యామిలీకి వైసీపీలో రాజ‌కీయంగా గుర్తింపు ఉంటుందా ? అన్నది ఎవ్వరికి అర్థం కావ‌డం లేదు. శిద్ధా ప్రాధినిత్యం వ‌హించిన ద‌ర్శిపై సిట్టింగ్ ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ వ‌ర్సెస్ మాజీ ఎమ్మెల్యే బూచేప‌ల్లి వివాదం తార‌స్తాయికి చేరుకుంది.

కనుచూపు మేరలో…..

ఈ పోరులో అక్కడ కాస్తో కూస్తో ఉన్న శిద్దా రాఘ‌వ‌రావు వ‌ర్గం నామ‌మాత్రమైంది. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. శిద్దా కుటుంబానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశం కూడా క‌నిపించ‌డం లేదు. జిల్లాలో శిద్ధా కుటుంబానికి వైసీపీలో ఓ గ్రౌండ్ ( నియోజ‌క‌వ‌ర్గం) అంటూ లేకుండా పోయింది. క‌నుచూపు మేర‌లో కూడా అక్కడ క‌నీసం చిన్నా చిత‌కా ప‌ద‌వులు కూడా వ‌చ్చేలా లేవు. జ‌గ‌న్ ఇప్పటికే జిల్లాలో ఎంతో మందికి ప‌ద‌వుల‌పై హామీలు ఇచ్చేశారు. వాళ్లకు ఫిల‌ప్ అయ్యాక అయినా శిద్ధా గురించి ఆలోచ‌న చేస్తారా ? అన్నది డౌటే. ఎలా చూసుకున్నా నాడు ఓ వెలుగు వెలిగిన శిద్దా రాఘ‌వ‌రావును ఇప్పుడు వైసీపీలో కార్యక‌ర్తలు కూడా ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు.

Tags:    

Similar News