నేడు చేరిక….బలం లేకున్నా ఆర్థికంగా దెబ్బతీయాలనే?

మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరబోతున్నారు. నేడు ఆయన వైసీపీలో చేరే అవకాశాలున్నాయి. ఈ మేరకు ముహూర్తం ఖరారయింది. కరణం బలరాంతో పాటు శిద్ధారాఘవరావు వైసీపీ [more]

Update: 2020-06-10 03:30 GMT

మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరబోతున్నారు. నేడు ఆయన వైసీపీలో చేరే అవకాశాలున్నాయి. ఈ మేరకు ముహూర్తం ఖరారయింది. కరణం బలరాంతో పాటు శిద్ధారాఘవరావు వైసీపీ నేతలతో చర్చించి చేరికకు సిద్ధమయినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో చర్చలు పూర్తికావడంతో శిద్ధా రాఘవరావు చేరిక దాదాపు ఖరారయింది. నేడు అమరావతిలో జగన్ సమక్షంలో శిద్ధా రాఘవరావు పార్టీలో చేరుతున్నారని తెలిసింది.

ప్రయోజనం ఏమీ లేకున్నా…..

నిజానికి శిద్ధా రాఘవరావు వల్ల వైసీపీకి అదనంగా చేకూరే ప్రయోజనం లేదు. ఆయన సామాజికవర్గం పరంగా చూసుకున్నా పెద్దగా వైసీపీ లబ్ది పొందేది లేదు. అయినా టీడీపీ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్న ఏకైక లక్ష్యంతోనే శిద్ధా రాఘవరావును పార్టీలో చేర్చుకుంటున్నారని తెలుస్తోంది. ఆయన కూడా విధిలేని పరిస్థితుల్లో వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. శిద్ధా రాఘవరావు గత కొంతకాలంగా వ్యాపార నష్టాలతో ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రభుత్వం కూడా ఆయన గ్రానైట్ వ్యాపారాలకు వందకోట్లు జరిమానా విధించింది.

ఇప్పటికే అనేక మంది….

ప్రకాశం జిల్లాలో ఇప్పటికే ఎమ్మెల్యే కరణం బలరాం, ఎమ్మెల్సీ పోతుల సునీత, టీడీపీ నేతలు కదిరి బాబూరావు, జూపూడి ప్రభాకర్ రావు వంటి నేతలు వైసీపీలో చేరిపోయారు. తొలుత శిద్ధారాఘవరావు తమ వ్యాపారాలను పరిరక్షించుకోవడానికి ఆయన సోదరులను వైసీపీలోకి పంపారు. తాను టీడీపీలో ఉండాలని నిర్ణయించుకున్నారు. కరణం బలరాం తరహాలో ఉంటానని కూడా వైసీపీ అధిష్టానానికి సంకేతాలు పంపారు. కానీ అందుకు వైసీపీ అధిష్టానం అంగీకరించలేదు. దీంతో ఆయన నేరుగా వైసీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు.

టీడీపీకి ఆర్థికంగా అండగా…

శిద్ధా రాఘవరావు 1999లో టీడీపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన అనేక పదవులను పొందారు. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ నుంచి 2007లో ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. 2014లో దర్శి నియోజకవర్గం నుంచి విజయం సాధించి మంత్రి కూడా అయ్యారు. అంతే కాకుండా గత రెండు దశాబ్దాలుగా టీడీపీకి శిద్ధా రాఘవరావు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. టీడీపీని ఆర్థికంగా దెబ్బతీసేందుకే శిద్ధా రాఘవరావును పార్టీలో చేర్చుకుంటున్నారు. అంతకు మించి ఆయన వల్ల పెద్దగా వైసీపీకి ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే వైసీపీ ప్రకాశం జిల్లాలో బలంగా ఉన్నప్పటికీ శిద్దా రాఘవరావు లాంటి నేతలు ప్రభావం చూపే అవకాశాలు తక్కువనే చెప్పాలి.

Tags:    

Similar News