సీరియస్ యాక్షన్ తప్పదా…?

పట్టున్న రాష్ట్రంలో క్రమంగా బలహీనపడుతున్న కాంగ్రెస్ పార్టీకి దిక్కుతోచడం లేదు. మొన్నటి వరకూ అధికారంలో ఉండటంతో కాంగ్రెస్ పార్టీని అధిష్టానం సయితం పెద్దగా పట్టించుకోలేదు. ఇదీ కర్ణాటకలో [more]

Update: 2019-08-01 16:30 GMT

పట్టున్న రాష్ట్రంలో క్రమంగా బలహీనపడుతున్న కాంగ్రెస్ పార్టీకి దిక్కుతోచడం లేదు. మొన్నటి వరకూ అధికారంలో ఉండటంతో కాంగ్రెస్ పార్టీని అధిష్టానం సయితం పెద్దగా పట్టించుకోలేదు. ఇదీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా దినేష్ గుండూరావు ఉన్నప్పటికీ అంతా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పినట్లే పార్టీ నడుస్తుందన్నది వాస్తవం. హైకమాండ్ కూడా సిద్ధరామయ్యకు ప్రయారిటీ ఇస్తుండటంతో ఆయన హవా ఇటు పార్టీలోనూ అటు సంకీర్ణ ప్రభుత్వంలోనూ కొనసాగింది.

కూలడానికి కారణం…..

ఇటీవల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి సిద్ధరామయ్య కూడా కారణమని అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. సిద్ధరామయ్య వర్గానికి చెందిన ఎమ్మెల్యేలే రెబల్ ఎమ్మెల్యేలుగా మారడం వెనక సిద్ధరామయ్య ప్రోత్సాహం ఉన్నట్లు అనుమానిస్తోంది. తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను తిరిగి క్యాంపు నుంచి రప్పించడంలో సిద్ధరామయ్య ఫెయిల్ అయ్యారని హైకమాండ్ భావిస్తుంది. దీంతో సిద్ధరామయ్య కు చెక్ పెట్టాలన్న నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చినట్లు సమాచారం.

తిరుగులేని నేతగా….

కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో సిద్ధరామయ్కకు తిరుగులేదు. ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగడమే ఆయన నేర్పరితనం, రాజకీయ చాతుర్యానికి నిదర్శనం. ప్రతి రాష్ట్రంలో ముఖ్యమంత్రులను మార్చే సంస్కృతి ఉన్న కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్య విషయంలో ఏమీ చేయలేకపోయింది. ఆయనపై అధిష్టానం అంత నమ్మకముంచింది. అయితే గత శాసనసభ ఎన్నికలు జరిగిన తర్వాత రెండో అతి పెద్ద పార్టీగా అవతరించినా జనతాదళ్ ఎస్ నేత కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం సుతారమూ ఇష్టంలేని సిద్ధరామయ్య ప్రభుత్వ కూల్చివేతకు కారణమయ్యారంటున్నారు.

పదవి నుంచి తొలగిస్తారని….

ఇప్పటి వరకూ సిద్ధరామయ్య కాంగ్రెస్ శాసనసభ పక్షనేతగా, అధికారంలో ఉన్నప్పుడు సమన్వయ కమిటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు సమన్వయ కమిటీ అవసరం లేకపోయినప్పటికీ శాసనసభ పక్ష నేతగా సిద్ధరామయ్యను తొలగించాలన్న డిమాండ్ పార్టీలో ఊపందుకుంది. ముఖ్యంగా మాజీ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర లాంటి నేతలు సిద్ధరామయ్యను శాసనసభ పక్ష నేతగా అంగీకరించడం లేదు. హైకమాండ్ కూడా త్వరలోనే సిద్ధరామయ్యపై సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

Tags:    

Similar News