సిద్దూ సొల్యూషన్ కరెక్టేనా…?

కర్ణాటక రాజకీయ సంక్షోభాన్ని అధిగమించడానికి ఆ పార్టీ అనుసరిస్తున్న వ్యూహం కరెక్టేనా? అసమ్మతులను బుజ్జగించడానికి మంత్రి వర్గ విస్తరణ ఒక్కటే మార్గమా? ఇదే చర్చ ప్రస్తుతం కాంగ్రెస్ [more]

Update: 2019-07-09 16:30 GMT

కర్ణాటక రాజకీయ సంక్షోభాన్ని అధిగమించడానికి ఆ పార్టీ అనుసరిస్తున్న వ్యూహం కరెక్టేనా? అసమ్మతులను బుజ్జగించడానికి మంత్రి వర్గ విస్తరణ ఒక్కటే మార్గమా? ఇదే చర్చ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ సర్కార్ సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా బాట పట్టారు. వారంతా రిసార్టుల్లో తలదాచుకుంటున్నారు. వీరందరిని పార్టీ గూటికి రప్పించడమే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మిషన్.

సిద్దూ ప్లాన్ ఫలించేనా…?

అయితే ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాస్టర్ ప్లాన్ వేశారు. ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్ లకు చెందిన మంత్రులు రాజీనామాలు చేసి ప్రభుత్వం కొనసాగడానికి సహకరించారు. ఈ నెల 21వ తేదీన మంత్రివర్గ విస్తరణ చేపట్టి అసమ్మతి నేతలందరికీ మంత్రి పదవులు ఇవ్వాలని సిద్ధరామయ్య నిర్ణయించారు. అందుకే మంత్రి పదవులతో తిరిగి పార్టీలో వారిని రప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్, జేడీఎస్ సర్కార్ ఈ సంక్షోభం నుంచి బయటపడుతుందని సిద్ధరామయ్య ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి పదవులు ఇస్తే…..

కానీ అందరికీ మంత్రి పదవులు దక్కవు. కేవలం మంత్రి పదవుల కోసమే పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు కొందరుండగా, మరికొందరు కుమారస్వామి వ్యవహారశైలితో రాజీనామాలు చేసిన వారు మరికొందరు. ఒకవేళ మంత్రి వర్గ విస్తరణను ఈ నెల 21వ తేదీన జరిపి కొందరిని సొంత గూటికి రప్పించుకున్నా మరలా పార్టీలో అసంతృప్తులు తలెత్తవన్న గ్యారంటీ ఏమీలేదు. అయితే ఇది తాత్కాలిక చర్య మాత్రమే. ఈవిషయం సిద్ధరామయ్య కూ తెలియంది కాదు.

ఆజాద్ హుటాహుటిన….

కర్ణాటక ప్రభుత్వాన్ని సంక్షోభంలో నుంచి బయటపడేయటానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ను సోనియాగాంధీ హుటాహుటిన బెంగళూరుకు పంపించారు. అసంతృప్తులతో మాట్లాడి వారి డిమాండ్లను నెరవర్చే బాధ్యతను గులాం నబీ ఆజాద్ పై పెట్టారు. సిద్ధరామయ్య సహకారంతో అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించవచ్చన్నది పార్టీ హైకమాండ్ యోచనగా ఉంది. ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించకుండా జాప్యం చేసే అవకాశముంది. స్పీకర్ రమేష్ కుమార్ వ్యాఖ్యలను బట్టి ఇదే అర్థమవుతోంది. కొంతకాలం రాజీనామాలను ఆమోదించకుంటే వారంతట వారే తిరిగి హస్తం పార్టీలోకి వస్తారన్న భావనలో ఉన్నారు. అయితే గవర్నర్ నుంచి సర్కార్ కు ముప్పు పొంచి ఉందన్నది వాస్తవం.

Tags:    

Similar News