జాతకం తిరగబడింది

కర్ణాటక ఉప ఎన్నికలు తన జాతకాన్ని మారుస్తాయని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎంతో ఆశపడ్డారు. కానీ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కుదేలవ్వడంతో ఆయన జాతకం తిరగబడిందన్న [more]

Update: 2019-12-09 17:30 GMT

కర్ణాటక ఉప ఎన్నికలు తన జాతకాన్ని మారుస్తాయని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎంతో ఆశపడ్డారు. కానీ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కుదేలవ్వడంతో ఆయన జాతకం తిరగబడిందన్న వ్యాఖ్యలు పార్టీలోనే విన్పిస్తున్నాయి. పధ్నాలుగు నెలలు అధికారంలో ఉండి దానిని నిలబెట్టుకోలేకపోయిన కాంగ్రెస్, జేడీఎస్ లకు తగిన గుణపాఠాన్నే ప్రజలు చెప్పారన్న కామెంట్స్ సోషల్ మీడియాలో విన్పిస్తున్నాయి. కర్ణాటక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు, జనతాదళ్ ఎస్ ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించాయి.

సకాలంలో చర్యలేవీ?

నిజానికి ఉప ఎన్నికల ఊసే రాకూడదు. సంకీర్ణ సర్కార్ కూలిపోకూడదు. కానీ పధ్నాలుగు నెలల కాలంలో కాంగ్రెస్, జేడీఎస్ అగ్రనేతలు చేతులారా చేసుకున్న వ్యవహారమే ఈ ఉప ఎన్నికలు అని చెప్పక తప్పదు. అసంతృప్త ఎమ్మెల్యేలు అందరూ బలమైన వారే. జనంలోనూ, ఆర్థికంగా వారు బలవంతులు. అసలే అంతంత మాత్రంగా ఉన్న సంకీర్ణ సర్కార్ లో అసంతృప్తిని వెంటనే అణిచేయాల్సిన సిద్ధరామయ్య నాన్చేశారు. దీంతో పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరిలో ఎక్కువ మంది సిద్ధరామయ్య అనుచరులే కావడం విశేషం.

అంతా ఆయనపైనే…..

దీంతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఉప ఎన్నికల బాధ్యతను సిద్ధరామయ్య పైనే ఉంచారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం మొత్తం సిద్ధరామయ్య చూసుకున్నారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు బీజేపీ టిక్కెట్లు ఇవ్వడంతో తమ పంట పండినట్లేనని సిద్ధరామయ్య భావించారు. జంప్ జిలానీలను ప్రజలు పక్కన పెడతారనుకున్నారు. అందుకే తాను తిరిగి సీఎం అవుతానని సన్నిహితుల వద్ద చెప్పుకున్నారు. సీఎం రేసులో మల్లికార్జున ఖర్గే వంటి వారి పేర్లు విన్పిస్తున్నాయన్న వార్తలపై సిద్ధరామయ్య దళితులను సీఎం చేయడానికి కన్నడ ప్రజలు అంగీకరించరని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నమ్మకం ఏదీ?

అయితే సిద్ధరామయ్య అభ్యర్థుల ఎంపికలోనే తప్పిదం చేశారు. ఆ నియోజకవర్గాల్లో ఏళ్లుగా పాతుకుపోయిన నేతలు రాజీనామా చేసి వెళ్లిపోవడంతో సమర్థులైన వారికి టిక్కెట్లు కేటాయించాలి. కానీ పెద్దగా పట్టులేని నేతలకు టిక్కెట్లు ఇచ్చారు. దీంతో పాటు కాంగ్రెస్ అభ్యర్థులను తిరిగి గెలిపించినా ప్రభుత్వం ఉండే అవకాశం లేదని ప్రజలు కూడా భావించినట్లుంది. సంకీర్ణ సర్కార్ పై జనంలో నమ్మకం కలిగించలేకపోయారు. అధిష్టానం తనపై ఉంచిన విశ్వాసాన్ని కూడా సిద్ధరామయ్య కాపాడుకోలేకపోయారు. ఉప ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీలో సిద్ధరామయ్య శకం ముగిసినట్లేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. కేవలం రెండు స్థానాల్లోనే విజయం సాధించింది. బీజేపీకి అధికారాన్ని మూడున్నరేళ్ల పాటు అప్పగించేశారు.

Tags:    

Similar News