అన్ని దారులూ వెతుకుతున్నారే

కర్ణాటకలో రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు జనతాదళ్ ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం [more]

Update: 2019-07-10 18:29 GMT

కర్ణాటకలో రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు జనతాదళ్ ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఈ నెల 21న మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటన చేసినా ఫలితం లేకుండా పోయింది. వరుసగా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తుండటంతో కాంగ్రెస్ పెద్దలు డిఫెన్స్ లో పడిపోయారు.

వేటు వేస్తామని వార్నింగ్….

దీంతో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో అస్త్రాన్ని ప్రయోగించారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలోకి వెళుతున్నందున వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ నుకోరారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నామని తెలిపినా, వారి వెనక భారతీయ జనతా పార్టీ హస్తం ఉందని సిద్ధరామయ్య ఆరోపిస్తున్నారు. చివరిసారిగా వారికి అవకాశమిస్తున్నామని లేకుంటే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా వేటు వేస్తామని వార్నింగ్ లు పంపారు.

అన్ని మార్గాలనూ….

మరోవైపు ముంబయిలోనే రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు మకాం వేశారు. కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ వారిని కలసి చర్చించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ బెంగుళూరులో మకాం వేసి మరీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు హైకమాండ్ కు కర్ణాటక పరిస్థితులను తెలియజేస్తున్నారు. సంక్షోభం నుంచి బయటపడేందుకు ఆయన సిద్ధరామయ్యతో కలసి అన్ని మార్గాలనూ వెతుకుతున్నారు. స్పీకర్ రమేష్ కుమార్ చేతిలో రాజీనామాల ఆమోదం ఉండటంతో కాంగ్రెస్ పార్టీ నేతలు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు.

గవర్నర్ నుకలసి…..

అయితే మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఈ అవకాశాన్ని వదులుకోదలచుకోలేదు. ఆయన విధానసౌధ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలతో కలసి ధర్నాకు దిగారు. ఆ తర్వాత గవర్నర్ వాజూభాయి వాలను కలిసి స్పీకర్ రమేష్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల రాజీనామాలతో కర్ణాటకలో కుమారస్వామి సర్కార్ సంక్షోభంలో పడిపోయిందని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిద్ధరామయ్య మాత్రం తమ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఉందని చెబుతున్నారు. మొత్తం మీద కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ మనుగడ కష్టమేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News