బయటకు కన్పించేదంతా నిజం కాదట

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. అయితే ఇప్పుడే ఎవరు ఏంటన్నది తేలిపోయింది. రానున్న ఎన్నికల్లో జేడీఎస్, బీజేపీ అవగాహనతో పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. [more]

Update: 2021-02-12 16:30 GMT

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. అయితే ఇప్పుడే ఎవరు ఏంటన్నది తేలిపోయింది. రానున్న ఎన్నికల్లో జేడీఎస్, బీజేపీ అవగాహనతో పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. అవకాశాలే కాదు జరిగేది ఇదే. బయటకు త్రిముఖ పోటీలా కనపడుతున్నా కాంగ్రెస్ ను నిలువరించడమే రెండు పార్టీల లక్ష్యంగా కన్పిస్తుంది. బీజేపీ, జేడీఎస్ లు ఇప్పటి నుంచే అందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాయి. దీనికి విరుగుడుగా సిద్ధరామయ్య సయితం ఇప్పటి నుంచి ఈ రెండు పార్టీల బాగోతాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

త్రిముఖ పోటీ అయినా….

మరో రెండేళ్లలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ తో జతకట్టి అధికారంలోకి వచ్చిన జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలిపోయిన తర్వాత దానికి పూర్తిగా దూరమయింది. సిద్ధరామయ్య వర్గం ప్రభుత్వాన్ని కూల్చివేసిందని కుమారస్వామి బహిరంగంగానే ఆరోపిస్తూ వస్తున్నారు. అదే సమయంలో బీజేపీతో సఖ్యతగా మెలుగుతున్నారు. బీజేపీ అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకను చీల్చేందుకు జేడీఎస్ ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తుంది.

అవగాహన కుదిరిందని….

ఇందుకు అనుగుణంగానే రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరినట్లు ప్రచారం జరుగుతుంది. జేడీఎస్ కు పట్టున్న స్థానాల్లో బీజేపీ బలహీనమైన అభ్యర్థులను నిలబెడుతుంది. దీనికి ప్రతిగా బీజేపీ కూడా జేడీఎస్ సిట్టింగ్ స్థానాల జోలికి రాదు. దీంతో పాటు తన కుమారుడు నిఖిల్ గౌడను మరోసారి బరిలోకి దింపాలని కుమారస్వామి ఆలోచిస్తున్నారు. అక్కడ కూడా బీజేపీ వీక్ అభ్యర్థిని నిలబెట్టేలా ప్లాన్ చేస్తున్నారంటున్నారు. సిద్ధరామయ్య వర్గం దీనిని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తుంది.

జేడీఎస్ కు ఓటేస్తే…..

కాంగ్రెస్ ను నిలువరించడమే ధ్యేయంగా బీజేపీ, జేడీఎస్ లు కలసి పోయాయని సిద్ధరామయ్య సయితం ప్రతి సభలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. జేడీఎస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని చెబుతున్నారు. జేడీఎస్ ను సింగిల్ డిజిట్ కు పరిమితం చేయాలన్న టార్గెట్ ను సిద్ధరామయ్య పెట్టుకున్నారు. బీజేపీ, జేడీఎస్ ల నుంచి కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని సిద్ధరామయ్య చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ఆ రెండు పార్టీల నుంచి కాంగ్రెస్ లో భారీగా చేరే అవకాశాలుంటాయంటున్నారు. మొత్తం మీద కర్ణాటకలో ఎన్నికలకు రెండేళ్ల ముందే వ్యూహ ప్రతివ్యూహాలు అన్ని పార్టీలూ అమలు చేస్తున్నాయి.

Tags:    

Similar News