సిద్ధూ కు ఝలక్ తప్పదా?

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కు ఉన్న పదవి ఊడిపోయే ప్రమాదం ఏర్పడింది. సిద్దరామయ్య ప్రస్తుతం శాసనసభ పక్ష నేతగా ఉన్నారు. ఆయనను పదవి నుంచి తప్పించాలన్న డిమాండ్ [more]

Update: 2019-09-12 18:29 GMT

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కు ఉన్న పదవి ఊడిపోయే ప్రమాదం ఏర్పడింది. సిద్దరామయ్య ప్రస్తుతం శాసనసభ పక్ష నేతగా ఉన్నారు. ఆయనను పదవి నుంచి తప్పించాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. పార్టీలోనే సిద్దరామయ్యపై అసంతృప్తి ఎక్కువగా ఉందని అధిష్టానం గమనించింది. దీనికి తోడు మిత్రపక్షమైన జనతాదళ్ ఎస్ తోనూ విభేదాలు సిద్ధరామయ్య కొనితెచ్చుకోవడంతో ఆయనను ఆ పదవి నుంచి తప్పిస్తే తప్ప బలమైన ప్రతిపక్షంగా ఉండలేమని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది.

అంతా తానే అయి….

సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆయన వైఖరే పార్టీ నేతలకు దూరం చేసిందంటున్నారు. సంకీర్ణ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు సిద్ధరామయ్య తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. పీసీపీ అధ్యక్షుడిని, ఉప ముఖ్యమంత్రిని డమ్మీని చేసి అంతా తానే అయి నడిపించారన్న ఆరోపణలు లేకపోలేదు. సంకీర్ణ సర్కార్ లో సమన్యయ కమిటీ ఛైర్మన్ గా సిద్ధరామయ్య ఉండటంతో అంతా ఆయన చెప్పినట్లే నడిచింది. ముఖ్యమంత్రి కుమారస్వామిని కూడా లెక్క చేయని స్థితిలో సిద్ధరామయ్య వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి.

కూలిపోవడానికి…..

అయితే కుమారస్వామి సర్కార్ కూలిపోవడానికి ప్రధాన కారణం సిద్ధరామయ్య అని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యేలను సరైన సమయంలో దారికి తేవడంలో సిద్ధరామయ్య విఫలమయ్యారంటున్నారు. తమ పార్టీ అధికారంలో లేకపోవడానికి సిద్ధరామయ్య కారణం కాబట్టి ఆయనను శాసనసభ పక్ష నేతగా తప్పించాలని కొందరు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. సిద్ధరామయ్య కు వ్యతిరేకంగా కొందరు నేతలు ఇప్పటికే ఢిల్లీ వెళ్లి హైకమాండ్ తో మంతనాలు జరిపారు.

జేడీఎస్ తో విభేదాలు కూడా….

ఇక సిద్ధరామయ్య, దేవెగౌడ, కుమారస్వామిల మధ్య విభేదాలు కూడా ఆయనను పదవి నుంచి తప్పించడానికి ఒక కారణం అవుతాయని అంటున్నారు. జనతాదళ్ ఎస్ తో సిద్ధరామయ్యకు అసలు పొసగడం లేదు. ఆ పార్టీ నేతలపై ఇటీవల సిద్ధరామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవెగౌడ, కుమారస్వామిలకు బహిరంగ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య సీఎల్పీ నేతగా ఉంటే జేడీఎస్ సభలో సహకరించక పోవచ్చన్న అనుమానాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కూడా పొత్తుకు సిద్ధరామయ్య ఆటంకంగా మారతారన్నది హైకమాండ్ ఆలోచనగా ఉంది. మొత్తం మీద సిద్ధరామయ్యకు శాసనసభ పక్ష నేత పదవి దూరమయ్యే రోజు ఎంతో దూరం లేదంటున్నారు.

Tags:    

Similar News