ఎప్పుడైనా…ఏమైనా జరగొచ్చు

మహారాష్ట్ర రాజకీయల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. గవర్నర్ ఆహ్వానించినప్పుడు మీనమేషాలు లెక్కించిన కాంగ్రెస్, ఎన్సీపీలు రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత వేగం పెంచాయి. మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని [more]

Update: 2019-11-16 16:30 GMT

మహారాష్ట్ర రాజకీయల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. గవర్నర్ ఆహ్వానించినప్పుడు మీనమేషాలు లెక్కించిన కాంగ్రెస్, ఎన్సీపీలు రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత వేగం పెంచాయి. మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్, ఎన్సీపీలు అంగీకరించాయి. కామన్ మినిమం ప్రోగ్రాం కూడా సిద్ధమయింది. అంతేకాదు పదవుల పంపకానికి కూడా మూడు పార్టీలూ తలలూపేశాయి. దీంతో మహారాష్ట్రలో శివసేన సారథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు అవుతుందని ఆ పార్టీ ధీమాగా ఉంది.

మూడు పార్టీలు కలసి…

రాష్ట్రపతి పాలన విధించిన మూడురోజులకూ మూడు పార్టీల మధ్య సయోధ్య కుదరడం విశేషం. ఈ మూడు పార్టీలూ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని, శివసేన నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్న స్పష్టత మాత్రం వచ్చేసింది. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యులవ్వడం విశేషం. తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బయట నుంచి మద్దతిస్తామని చెబుతూ వచ్చింది.

బీజేపీకి భయపడి…..

అయితే మహారాష్ట్రలో ఎన్నికైన కాంగ్రెస్ శాసనసభ్యుల వత్తిడి మేరకు కాంగ్రెస్ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఏమాత్రం తేడా వచ్చినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూసే అవకాశమున్నందున ఆ అవకాశం కాంగ్రెస్ ఈసారి ఇవ్వదలచుకోలేదు. ఎన్నికలకు ముందు కూడా అనేక మంది కాంగ్రెస్, ఎన్సీపీ నేతలను బీజేపీ చేర్చుకోవడంతో కాంగ్రెస్ శివసేన ప్రభుత్వంలో చేరాలనే నిర్ణయించుకోవడం విశేషం. కాంగ్రెస్, ఎన్సీపీలకు చెరి 14 మంత్రి పదవులతో పాటు, ఉప ముఖ్యమంత్రి పదవులు కూడా ఇద్దరికీ ఇచ్చేలా ఒప్పందం కుదిరింది.

ఆ అవకాశం ఇస్తుందా?

అయితే ఈ పరిణామాలను భారతీయ జనతా పార్టీ నిశితంగా గమనిస్తుంది. మూడు పార్టీల కలయిక ఎక్కువ కాలం ఉండదని బీజేపీ గట్టిగా విశ్వసిస్తోంది. శివసేన మహారాష్ట్రలో సొంతంగా బలపడాలంటే ఉమ్మడి ప్రణాళిక అమలు చేస్తే సాధ్యంకాదు. తమ పార్టీ మ్యానిఫేస్టో ప్రకారమే వెళ్లాల్సి ఉంటుంది. అయితే అలా వెళితే పార్టీల మధ్య వైరుథ్యాలు ఖచ్చితంగా వస్తాయి. శివసేనకు అవకాశమిచ్చి బీజేపీ వేచి చూస్తుందా? లేక అసలు ప్రభుత్వం ఏర్పాటు కాకుండానే మరో దారిలో అడ్డుకుంటుందా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News