షాహిన్ బాగ్ లో ఆగేట్లులేదే?

షాహిన్ బాగ్…. నిన్న మొన్నటి దాకా సంచలనం. ఈ పేరు, ప్రాంతం గురించి ఎవరూ ఇప్పటి వరకూ విని ఉండరు. గత రెండు నెలలుగా ఈ పేరు [more]

Update: 2020-02-15 16:30 GMT

షాహిన్ బాగ్…. నిన్న మొన్నటి దాకా సంచలనం. ఈ పేరు, ప్రాంతం గురించి ఎవరూ ఇప్పటి వరకూ విని ఉండరు. గత రెండు నెలలుగా ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. ఎక్కడ చూసినా దీనిపైనే చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి. సిటీ జెన్ షిప్ ఎమెండ్ మెంట్ యాక్ట్ (సీఏఏ) జాతీయ పౌరసత్వ పట్టిక, జాతీయ జనాభా పట్టికలకు వ్యతిరేకంగా షాహిన్ బాగ్ ప్రాంత ప్రజలు గత రెండు నెలలుగా రోడ్డెక్కారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మూడు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలను చేస్తున్నారు. నిత్యం నిరసనలను తెలియజేస్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకూ తమ ఉద్యమం ఆగదని వారు విస్పష్టంగా హెచ్చరిస్తున్నారు.

మన పాతబస్తీ లాంటిదే….

తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో షాహిన్ బాగ్ ఆందోళనలు చర్చనీయాంశమయ్యాయి. దాని వెనక కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల హస్తం ఉందని కమలనాధులు ఆరోపించారు. అలాంటిదేమీ లేదని, నిజంగా అలా ఉంటే ప్రభుత్వం ఎందుకు ఆందోళనలను అడ్డుకోవడం లేదని ఆ రెండు పార్టీలూ ప్రశ్నిస్తున్నాయి. దక్షిణ ఢిల్లీ పరిసరాల్లోని సరితా విహార్, జసోలా కాలని దాటి వెళితే షాహిన్ బాగ్ కనపడుతుంంది. చిన్న చిన్న సందులు, గొందులు, ఇరుకైన వీధులు, పాఠశాలలు, మసీదులు మధ్య విస్తరించి ఉంటుంది షాహిన్ బాగ్ ప్రాంతం. ఒక్క ముక్కలో చెప్పాలంటే మన హైదరాబాద్ పాతబస్తీ, చార్మినార్ ప్రాంతాలను పోలి ఉంటుంది. అంతా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, బీదాబిక్కీ, సామాన్య ప్రజలు ఇక్కడ నివసిస్తుంటారు. అత్యధికులు ముస్లింలే. గత ఏడాది డిసెంబరు 15న సీఏఏ చట్టం పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత వారంతా ఒక్కసారి వీధుల్లోకి వచ్చారు. వీరిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఉన్నారు. పేదలు, ధనవంతులు సయితం ఉన్నారు. తమ ఆందోళనలతో వారు దేశం దృష్టిని కట్టిపడేశారు. జాతీయగీతం, వందేమాతరం గీతాలు అక్కడ ప్రతిధ్వనిస్తున్నాయి. త్రివర్ణ పతాకాలు ఆ ప్రాంతంలో రెపరెపలాడుతున్నాయి. వేదికపై మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, చంద్రశేఖర్ ఆజాద్, సరోజిని నాయుడు, జాకీర్ హుస్సేన్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటాలతో పాటు రాజ్యాంగ పీఠికను ప్రదర్శించారు. దేశ చరిత్రలో ఒక ప్రాంతం ప్రజలు ఇంత సుదీర్ఘకాలం ఆందోళన చేయడం గతంలో ఎక్కడా చూడలేదు.

ఆప్ దే విజయం…..

షాషిన్ బాగ్ ప్రాంతం ఓఖ్లా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉంది. 2015 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అమన్ తుల్లా ఖాన్ విజయం సాధించారు. మొన్నటి ఎన్నికల్లోనూ ఆయనదే విజయం అయింది. కాంగ్రెస్ తరుపున పర్వేజ్ షష్మి, బీజేపీ తరుపున బ్రహ్మసింగ్ బిధురి పోటీ చేశారు. మైనారిటీలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఆ వర్గం వారినే పోటీకి దింపాయి. ఈసారి కూడా విజయం ఆప్ దే అయింది. మొదట్లో షాహిన్ బాగ్ నిరసనలకు పరోక్షంగా ఆప్ సహకరించిందన్న వాదనలు ఉన్నాయి. కానీ దీన్ని బీజేపీ హిందూ-ముస్లిం సమరంగా చిత్రీకరించడంతో ఆప్ వెనక్కు తగ్గింది. అంతేకాకుండా ఆప్ ఎదురుదాడికి దిగింది. ఢిల్లీలో శాంతిభద్రతలు పూర్తిగా కేంద్రం చేతిలో ఉన్నాయి. నిరసనలను అడ్డుకోవడానికి కేంద్రానికి తమ అంగీకారం కావాల్సి వస్తే అందుకు అనుమతిస్తున్నామని కేజ్రీవాల్ పరకటించారు. దీంతో బీజేపీ వెనక్కు తగ్గాల్సి వచ్చింది. అయితే ఢిల్లీ ఎన్నికలు పూర్తయినా షాహిన్ బాగ్ లో నిరసనలు మాత్రం ఆగలేదు. సీఏఏ చట్టాన్ని వెనక్కు తీసుకునేంతవరకూ ఉద్యమం చేస్తామని వారు చెబుతున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News