ఓ బ్రహ్మచారీ… మాకు ఇక్కడ పులుసు కారుతుంది

ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు దాటుతుంది. ఆయన ప్రజలకు చేసింది ఏముందో తెలియదు కాని ఆయన పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటుతున్నాయని చెప్పక తప్పదు. [more]

Update: 2021-02-07 17:30 GMT

ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు దాటుతుంది. ఆయన ప్రజలకు చేసింది ఏముందో తెలియదు కాని ఆయన పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటుతున్నాయని చెప్పక తప్పదు. బ్రహ్మచారికి ఏం తెలుసు మా బాధలంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకూ కరోనా వైరస్ తో ఉపాధి అవకాశాలు కోల్పోయి ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటాయి. వీటిని నియంత్రించడానికి ఏడేళ్ల కాలంలో ఆయన ఏంచేశారన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఉప్పు నుంచి పప్పు వరకూ……

ఉప్పు, పప్పు ధరల నుంచి కూరగాయల వరకూ అన్ని ధరలు పెరిగిపోయాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు నెలవారీ బడ్జెట్ కు మించి ధరలు పెరిగిపోతుండటంతో ప్రజల్లో అసహనం వ్యక్తమవుతుంది. దాదాపు నాలుగు నెలల నుంచి నిత్యావసర వస్తువుల ధరలు యాభై శాతం నుంచి 70 శాతం వరకూ పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీలు కూడా ధరల పెరుగుదలను పట్టించుకోవడం మానేశాయి.

నిరసనలు కూడా లేక….

గతంలో వామపక్షాలయినా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడల్లా ఆందోళనకు దిగేవి. ఈ మధ్య కాలంలో వామపక్షాలు సయితం ఈ సమస్యను వదిలేస్తున్నాయి. ఒక్కొక్క కుటుంబం మీద నెలకు దాదాపు రెండువేల అదనపు భారం ఒక నిత్యావసర వస్తువుల మీద నుంచే పడుతుంది. ఉల్లిపాయల ధరలు గత కొద్ది నెలలుగా దిగి రావడం లేదు. ఢిల్లీలో కూర్చుని నీతులు, సూక్తులు వల్లించే మోదీకి ఈ ధరాభారం గురించి పట్టడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

దీని కారణంగానే…?

నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి ప్రధాన కారణం పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడమే. గత కొన్నాళ్లుగా రోజూ పెట్రోలు, డీజిల్ రేట్లను ఆయిల్ కంపెనీలు పెంచుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది. క్రూడాయిల్ ధర తగ్గనా సెస్సుల పేరుతో జనాలపై ప్రభుత్వం బాదుడు మాత్రం ఆపడం లేదు. ఈ కారణంగానే నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటాయని చెప్పకతప్పదు. ఇప్పటికైనా ధరల నియంత్రణకు ప్రభుత్వం నడుంబిగించకపోతే మోదీకి, ఆయన పార్టీకి పేద, మధ్య తరగతి ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదు.

Tags:    

Similar News