సీనియర్ వర్సెస్ జూనియర్

కాంగ్రెస్ లో సీనియర్లు, జూనియర్లు వార్ మొదలయినట్లుంది. చాలా కాలంగా ఇది పార్టీలో కన్పిస్తున్నా అది బయటకు పొక్కలేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో యువనేతలను పక్కన పెట్టి [more]

Update: 2020-02-13 17:30 GMT

కాంగ్రెస్ లో సీనియర్లు, జూనియర్లు వార్ మొదలయినట్లుంది. చాలా కాలంగా ఇది పార్టీలో కన్పిస్తున్నా అది బయటకు పొక్కలేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో యువనేతలను పక్కన పెట్టి సీనియర్లకు ముఖ్య పదవులు కట్టబెట్టడంపై జూనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. సీనియర్లు ఇంకా పార్టీని శాసించాలనుకుంటున్నారన్న అభిప్రాయం జూనియర్ నేతల్లో వ్యక్తమవుతోంది. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష్య పదవికి రాజీనామా చేయడానికి కూడా ఇది ఒక కారణంగా చెబుతున్నారు.

కోటరీగా మారి…..

క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోకుండా సీనియర్లు కోటరీగా మారి అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని రాహుల్ గాంధీకి ఎప్పుడో అర్థమయినా తల్లి సోనియా కోసం ఆగారని అంటున్నారు. ప్రధానంగా ఎన్నికల సమయంలో సీనియర్లు పార్టీ మొత్తాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. టెన్ జన్ పథ్ కు రోజూ చక్కర్లు కొట్టే నేతలు వాస్తవ పరిస్థితులను గుర్తించలేెక, గుర్తించినా వాటిని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లలేకపోతున్నారు. ఫలితంగా వరస పరాజయాలను కాంగ్రెస్ చవిచూడాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతల్లో అత్యధిక మంది భావిస్తున్నారు.

ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై…..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలు మరింత ప్రస్ఫుటమయ్యాయి. సీనియర్ నేత చిదంబరం ఢిల్లీ ఎన్నికల్లో ఓటమిని తమవైపు నెట్టకుండా బీజేపీ వైపు చూపారు. మతపరమైన, విభజన అజెండాను ఢిల్లీ ప్రజలు ఓడించారని, భవిష్యత్తులో రాష్ట్రాల ఎన్నికలకు ఇది ఒక సూచిక అని ఆయన ట్వీట్ చేశారు. దీనిపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్టా ఫైరయ్యారు. కాంగ్రెస్ ఓటమికి కారణాలు వెతుక్కోకుండా బీజేపీ ఓటమి చూసి సంబరపడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీకి అప్పగించి కాంగ్రెస్ దుకాణం మూసేద్దామా? అని తీవ్ర వ్యాఖ్యలే ఆమె చేశారు.

తప్పేముంది?

నిజానికి శర్మిష్టా అన్న దానిలో తప్పేమీ లేదు. సీనియర్లు తమ లోపాలను వెతుక్కోకుండా బీజేపీ ఓడి పోయిందన్న సంబరం ఎందుకన్నది జూనియర్లు అనేక మంది ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఢిల్లీ ఇన్ ఛార్జి పీసీ చాకో అయితే తప్పంతా షీలాదీక్షిత్ పైకి నెట్టేశారు. వీరప్పమొయిలీ, శశిధరూర్ వంటి నేతలు బీజేపీ ఓటమిపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రకటనలు చేయడం సీనియర్లు, జూనియర్ల మధ్య దూరం పెంచిందనే చెప్పాలి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ల ఆధిపత్యానికి తెరపడితే తప్ప అది బాగుపడదని రాహుల్ తో సహా యువనేతలందరికీ అర్థమయింది. అయినా ఏం చేయలేని పరిస్థితి.

Tags:    

Similar News