బాస్… బిగ్ సౌండ్ విన్పిస్తుందట…తిరుగుబాటు చేస్తారేమో?

రాజకీయాలు అంటే చాలానే లెక్కలు ఉంటాయి. పదవులు రాకపోతే అసంతృప్తి అలా దావానలంగా వ్యాపిస్తుంది. దాంతో అది పార్టీ పుట్టెను కూడా ముంచేస్తుంది. ఏపీలో సీనియర్లు పలువురు [more]

Update: 2021-02-03 08:00 GMT

రాజకీయాలు అంటే చాలానే లెక్కలు ఉంటాయి. పదవులు రాకపోతే అసంతృప్తి అలా దావానలంగా వ్యాపిస్తుంది. దాంతో అది పార్టీ పుట్టెను కూడా ముంచేస్తుంది. ఏపీలో సీనియర్లు పలువురు వైసీపీలో ఉన్నారు. వారంతా ఉత్త ఎమ్మెల్యేలుగానే కాలం వెళ్లదీస్తున్నారు. వారు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు అంటున్నారు. ఉత్తరాంధ్రలోని ఒక మాజీ మంత్రితో పాటు నెల్లూరు జిల్లాలోని మరో ఇద్దరు మాజీ మంత్రులు కూడా జగన్ మీద ఒక్క లెక్కన రగిలిపోతున్నారుట.

ఏ రాయి అయినా ఒక్కటే …

వైసీపీలో చేరి రెండేళ్ళు గడచిపోయాయి. ఈ ఏడాది చివరలో మరో మారు మంత్రి వర్గ విస్తరణ జరుగుతుంది. కానీ ఈ ముగ్గురు మాజీ మంత్రులకు కచ్చితంగా పదవులు రావు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అదేలా అంటే శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు మంత్రులు అయ్యారు. ఇక మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సోదరుడు కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆయన్ని కాదని జగన్ ప్రసాదరావుకు ఇవ్వరు. ఇక నెల్లూరు, ప్రకాశంలో చూసుకుంటే మరో ఇద్దరు మాజీ మంత్రులు ఉన్నారు. వారే ఆనం రామ‌నారాయణరెడ్డి, మహీధర రెడ్డి. వీరి విషయంలో కూడా జగన్ ది ఇదే డెసిషన్. దాంతో పార్టీలో తాము కొనసాగినా లేకున్నా ఒక్కటే అని వీరు నిర్ధారించుకుంటున్నారుట.

బిగ్ సౌండేనా…?

వైఎస్సార్ కాలం నుంచి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ వస్తున్న ఈ మాజీ మంత్రులను తక్కువ అంచనా వేయడం కుదరదు అంటున్నారు. వారు వ్యక్తులుగా వైసీపీ పెద్దలకు కనిపిస్తున్నా కూడా బయటకు వెళ్ళి బిగ్ సౌండ్ చేస్తే కనుక వైసీపీ అద్దాల మేడకు గట్టి దెబ్బలు పడడం ఖాయమని అంటున్నారు. ఈ ముగ్గురి రాజకీయ భవిష్యత్తు వైసీపీతో ఉండదు అని తేలిపోయిన వేళ ప్రజా సమస్యల పేరిట గళం విప్పాలని భావిస్తున్నారు అంటున్నారు. ఏపీలో స్థానిక ఎన్నికల తరువాతనే వీరి రాజకీయ అడుగులు ఉంటాయని కూడా చెబుతున్నారు.

ప్లస్సా మైనస్సా …?

ఒకనాడు చక్రం తిప్పిన వారు ఎల్లకాలం రాజకీయంగా లైమ్ లైట్ లో ఉంటారనుకుంటే పొరపాటే అవుతుంది. వీరంతా కూడా ఓటములను కూడా చవి చూసిన వారే. ఇక సీనియర్లుగా ఉంటూ వేరే పార్టీలలోకి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న వారిని కొత్త వారిని కాదని వీరికి అకామిడేట్ చేసే ఉదారత ఉంటుందని ఎవరూ అనుకోరు. పైగా కొత్త రాజకీయం కోసం అన్ని పార్టీలు చూస్తున్న వేళ ఇతర పార్టీలలో కూడా అవకాశాలు ఎంతమేరకు దక్కుతాయి అన్నది ఒక ప్రశ్నగానే ఉంటుంది. కానీ తమ వారసులను వేరే పార్టీలలోకి దించి అయినా రాజకీయం చేద్దామనుకుంటే మాత్రం వారు వైసీపీ మీద రాళ్ళు వేసినా ఉపయోగం ఉంటుంది. ఇపుడు అదే పనిలో సీనియర్లు ఉన్నారని అంటున్నారు. ఇప్పటికి ముగ్గురుగా కనిపిస్తున్నా రేపటి రోజున ప్రజాభిప్రాయం వైసీపీకి లోకల్ బాడీ ఎన్నికల్లో కొంత మారినా, మంత్రి వర్గ విస్తరణలో చాన్స్ దక్కపోయినా మరింతమంది గళాలు కూడా వీరితో జత చేరవచ్చు అని కూడా అంటున్నారు. చూడాలి మరి వైసీపీలో ఏం జరుగుతుందో.

Tags:    

Similar News